261% పెరిగిన గెయిల్‌ లాభం

ప్రభుత్వ రంగ గెయిల్‌ ఇండియా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,176.97 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 17 May 2024 02:51 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ గెయిల్‌ ఇండియా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,176.97 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.603.52 కోట్లతో పోలిస్తే ఇది 261% అధికం. సహజ వాయువు (గ్యాస్‌) సరఫరా, పెట్రో రసాయనాల వ్యాపారం వృద్ధి ఇందుకు కారణమని ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమాచారమిచ్చింది. గ్యాస్‌ సరఫరా వ్యాపారం 2023 జనవరి-మార్చిలో రూ.16.41 కోట్ల నష్టాన్ని ప్రకటించగా, 2024 జనవరి-మార్చిలో రూ.980 కోట్ల పన్నుకు ముందు లాభం నమోదు చేసింది. పెట్రో రసాయనాల వ్యాపారం కూడా రూ.401 కోట్ల నష్టం నుంచి రూ.262.34 కోట్ల పన్నుకు ముందు లాభాన్ని ఆర్జించింది. సహజ వాయువు మార్కెటింగ్‌ ఆదాయం రూ.487.40 కోట్ల నుంచి రూ.1,390 కోట్లకు చేరింది. కార్యకలాపాల ఆదాయంలో ఎలాంటి మార్పు లేకుండా రూ.32,334.50 కోట్లుగా నమోదైంది.

  • 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం రూ.8,836.48 కోట్లకు చేరింది. 2022-23లో ఇది రూ.5,301.51 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో ఆదాయం రూ.1.44 లక్షల కోట్ల నుంచి రూ.1.3 లక్షల కోట్లకు తగ్గింది.
  • మధ్యప్రదేశ్‌లోని విజయ్‌పుర్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని పటా వరకు పైప్‌లైన్‌ నిర్మించేందుకు రూ.1,792 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గెయిల్‌ బోర్డు ఆమోదం తెలిపింది.
  • సహజ వాయువు సరఫరా 2023-24లో రోజుకు 120.46 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎండీ) కి చేరింది. 2022-23 నాటి 107.28 ఎంఎంఎస్‌సీఎండీ కంటే ఇది 12% ఎక్కువ. గ్యాస్‌ మార్కెటింగ్‌ పరిమాణం 94.91 ఎంఎంఎస్‌సీఎండీ నుంచి 98.45 ఎంఎంఎస్‌సీఎండీ కి చేరింది. పాలిమర్‌ విక్రయాలు సుమారు రెండింతలు పెరిగి 7,87,000 టన్నులకు చేరాయి.
  • పెట్రో రసాయనాలు, ద్రవరూప హైడ్రో కార్బన్ల ధరలు తక్కువగా ఉన్నప్పటికీ 2023-24లో అన్ని విభాగాల్లో బలమైన పని తీరు కనబరిచామని గెయిల్‌ సీఎండీ సందీప్‌ కుమార్‌ గుప్తా వెల్లడించారు.  గత ఆర్థిక సంవత్సరంలో రూ.11,426 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని