కిమ్స్‌ హాస్పిటల్స్‌కు రూ.71.6 కోట్ల లాభం

కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.637.6 కోట్ల ఆదాయాన్ని, రూ.71.6 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.

Published : 17 May 2024 02:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.637.6 కోట్ల ఆదాయాన్ని, రూ.71.6 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం రూ.580.8 కోట్లు, నికరలాభం రూ.98.7 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 10% పెరిగినా, లాభం తగ్గింది. ఆస్పత్రి పడకల వినియోగం (బెడ్‌ ఆక్యుపెన్సీ) 51.4 శాతంగా నమోదైంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి కంపెనీ చేతిలో రూ.132 కోట్ల నగదు నిల్వ ఉంది. అవుట్‌ పేషెంట్‌ (ఓపీ), ఇన్‌ పేషెంట్‌ (ఐపీ) అడ్మిషన్లలో కొంత పెరుగుదల కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలానికి ఈ సంస్థ రూ.2,511 కోట్ల ఆదాయాన్ని, రూ.336 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది.

వైద్య సేవలు, ఆదాయాల పరంగా సంతృప్తికర వృద్ధి సాధించినట్లు కిమ్స్‌ హాస్పిటల్స్‌ సీఎండీ డాక్టర్‌ బి.భాస్కరరావు వివరించారు. కొత్తగా తమ అజమాయిషీలోకి వచ్చిన సన్‌షైన్‌ హాస్పిటల్స్‌, నాగ్‌పూర్‌ హాస్పిటల్స్‌ పనితీరు మెరుగుపడుతోందని అన్నారు. త్వరలో నాసిక్‌ ఆసుపత్రి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. సంవత్సరాంతానికి థానే, బెంగళూరు ఆస్పత్రులు కార్యకలాపాలకు శ్రీకారం చుడతాయని అన్నారు. అందువల్ల 2024-25 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఆదాయాలు నమోదు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని