సంక్షిప్త వార్తలు(5)

కేన్సర్‌ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్‌ ట్యాబ్లెట్లను హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ ఉత్పత్తి చేసి, జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌కు సరఫరా చేయనుంది.

Published : 18 May 2024 01:04 IST

అమెరికా మార్కెట్‌కు కేన్సర్‌ మందు 
జైడస్‌ లైఫ్, ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: కేన్సర్‌ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్‌ ట్యాబ్లెట్లను హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ ఉత్పత్తి చేసి, జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌కు సరఫరా చేయనుంది. దీనిపై రెండు సంస్థల మధ్య ‘లైసెన్సింగ్‌- సరఫరా’ ఒప్పందం కుదిరింది. ఈ ట్యాబ్లెట్లను అమెరికాలో జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ విక్రయిస్తుంది. కాబోజాంటినిబ్‌ ట్యాబ్లెట్, ఎగ్జెలిగ్జిస్‌ ఇంక్‌., అనే యూఎస్‌ కంపెనీకి చెందిన ‘కాబోమెటిక్స్‌’ అనే బ్రాండుకు జనరిక్‌ ఔషధం. ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ ఈ మందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ వద్ద పారా-4 సర్టిఫికేషన్‌తో ఏఎన్‌డీఏ (అబ్రివియేటెడ్‌ న్యూడ్రగ్‌ అప్లికేషన్‌) దరఖాస్తు చేసింది. అందువల్ల ఈ జనరిక్‌ ఔషధాన్ని యూఎస్‌లో విక్రయించడానికి 180 రోజుల ప్రత్యేక మార్కెటింగ్‌ హక్కులు (ఇఎంఆర్‌) లభిస్తాయని జైడస్‌ వివరించింది. జైడస్‌తో కలిసి ఈ మందును యూఎస్‌ మార్కెట్‌కు అందించబోతున్నామని ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ సీఎండీ ఎంఎస్‌ఎన్‌ రెడ్డి అన్నారు.


జైడస్‌ లాభం నాలుగింతలు

దిల్లీ: జైడస్‌ లైఫ్‌సెన్సెస్, మార్చి త్రైమాసికంలో రూ.1182 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.297 కోట్లతో పోలిస్తే, ఇది 4 రెట్లు అధికం. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.5011 కోట్ల నుంచి రూ.5534 కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ నికరలాభం రూ.3859 కోట్లకు చేరింది. 2022-23 లాభం రూ.1960 కోట్లకు ఇది దాదాపు రెట్టింపు. కార్యకలాపాల ఆదాయం రూ.17,237 కోట్ల నుంచి రూ.19,547 కోట్లకు పెరిగింది. రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.3 (300%) డివిడెండును బోర్డు ప్రతిపాదించింది. 


65% తగ్గిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లాభం

దిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ మార్చి త్రైమాసికంలో రూ.1322 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.3741 కోట్లతో పోలిస్తే, ఇది 65% తక్కువ. కంపెనీ ఆదాయం కూడా రూ.47,427 కోట్ల నుంచి రూ.46,511.28 కోట్లకు పరిమితమైంది. ముడి పదార్థాల వ్యయాలు పెరగడానికి తోడు, కొన్ని ఖర్చుల వల్లే లాభం తగ్గినట్లు సంస్థ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరానికి ప్రతి షేరుకు రూ.7.30 చొప్పున తుది డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. 


ఎయిర్‌ ట్యాక్సీ సేవల్లోకి డ్రోగో డ్రోన్స్‌!

హైదరాబాద్‌: ఎయిర్‌ ట్యాక్సీ సేవల్లోకి అడుగుపెట్టనున్నట్లు డ్రోగో డ్రోన్స్‌ ప్రకటించింది. వీటితో పాటు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సంస్థ సీఈఓ యశ్వంత్‌ బొంతు తెలిపారు. వ్యవసాయ రంగంలో విస్తృత సేవలు అందించేలా తాము రూపొందించిన కృషీ 3 డ్రోన్‌కు డీజీసీఏ అనుమతులు లభించాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 30 లక్షల ఎకరాల్లో క్రిమిసంహారక మందుల పిచికారీకి ఇఫ్కోతో తమ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుందని, సర్వే, మ్యాపింగ్, ఉత్పత్తుల రవాణా వంటి ఇతర రంగాలకూ విస్తరించనున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా ముఖ్యమైన జిల్లా కేంద్రాల్లో, ఆ తర్వాత మండల కేంద్రాల్లో డ్రోన్‌ సర్వీస్‌ హబ్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యశ్వంత్‌ పేర్కొన్నారు. కృషీ 3 ప్రో డ్రోన్‌ను ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 4 ఎకరాల్లో పురుగు మందులను పిచికారీ చేస్తుంది. పూర్తిగా మందు నింపితే 24 నిమిషాలు, ఖాళీగా ఉంటే 42 నిమిషాలు గాల్లో ఎగిరే సామర్థ్యం ఉంది. కొత్త డ్రోన్‌ సాయంతో రోజుకు 30 నుంచి 35 ఎకరాల్లో పిచికారీ చేయడంతో పాటు రైతులు 80% అధిక దిగుబడి సాధించొచ్చని వివరించారు.


తకేడా ఫార్మా డెంగీ టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు

హైదరాబాద్‌లోని బీఇ లిమిటెడ్‌ యూనిట్లలో ఉత్పత్తి

ఈనాడు, హైదరాబాద్‌: జపాన్‌కు చెందిన బహుళ జాతి ఫార్మా కంపెనీ, తకేడా ఫార్మా అభివృద్ధి చేసిన డెంగీ టీకా (టీఏకే-003) కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి ‘ప్రీ-క్వాలిఫికేషన్‌’ గుర్తింపు లభించింది. ఇది డబ్ల్యూహెచ్‌ఓ ప్రీ-క్వాలిఫికేషన్‌ లభించిన రెండో డెంగీ టీకా కావడం గమనార్హం. దీనివల్ల ఐక్యరాజ్యసమతి సంస్థలైన యునిసెఫ్, పాహో (పాన్‌ అమెరికన్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌) తదితర సంస్థలు ఈ టీకాను సేకరించే వీలు కలుగుతుంది. డెంగీ టీకాను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడంలో ఇది కీలకమైన అడుగు అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ డాక్టర్‌ రొజెరియో గాస్పర్‌ వివరించారు. డెంగీ టీకా హైదరాబాద్‌లోని బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ యూనిట్లలో 5 కోట్ల డోసుల మేర ఉత్పత్తి కానుంది. ఇందుకోసం ఇటీవల బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ (బీఇ) తో ఉత్పత్తి ఒప్పందాన్ని తకేడా ఫార్మా కుదుర్చుకున్న సంగతి విదితమే. దోమ కాటు వల్ల వచ్చే డెంగీ వ్యాధి కేసులు ప్రపంచ వ్యాప్తంగా ఏటా 40 కోట్ల వరకు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని