వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్‌

అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది.

Published : 19 May 2024 01:44 IST

9 ఏళ్లలో 50 నుంచి 7000కు
ఫైఫా నివేదిక

దిల్లీ: అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. 2014-15కు ముందు ఈ రంగాల్లోని అంకురాలు 50కన్నా తక్కువే ఉన్నాయని పేర్కొంది. ‘రైతు జీవనోపాధికి భరోసా: సుస్థిర వ్యవసాయ పద్ధతులతో రైతు ఆదాయాలను పెంచడం’ అనే సదస్సులో భాగంగా  ‘భారత వ్యవసాయ రంగం రూపాంతరం’ నివేదికను విడుదల చేసింది. వ్యవసాయ రంగానికి కేటాయింపులు గత తొమ్మిదేళ్లలో రూ.30వేల కోట్ల నుంచి రూ.1.3లక్షల కోట్లకు చేరాయని పేర్కొంది. మన దేశంతో పాటు, ప్రపంచానికి ఆహారం అందించేందుకు అన్నదాత చేస్తున్న కృషికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయం అని ఫైఫా అధ్యక్షుడు జవారె గౌడ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన (పీఎం-కేఎంవై), ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌), ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) వంటి కీలక విధాన కార్యక్రమాలు.. రైతులకు ఆర్థిక, ఆదాయ మద్దతు అందించినట్లు పేర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా ఈ రంగంలో స్థిరంగా 4% వృద్ధిని సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే కాలంలో దీనిని అధిగమించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని