మేమూ వినియోగించుకునే అవకాశమివ్వండి

విమాన ఇంధన (ఏటీఎఫ్‌) సరఫరా, నిల్వ కోసం ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు వినియోగించుకుంటున్న పైపులైన్లు, నిల్వ కేంద్రాలను తమకూ అందుబాటులోకి తేవాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రభుత్వాన్ని కోరింది.

Published : 20 May 2024 01:33 IST

ఏటీఎఫ్‌ పైపులైన్లు, నిల్వ కేంద్రాలపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

దిల్లీ: విమాన ఇంధన (ఏటీఎఫ్‌) సరఫరా, నిల్వ కోసం ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు వినియోగించుకుంటున్న పైపులైన్లు, నిల్వ కేంద్రాలను తమకూ అందుబాటులోకి తేవాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రభుత్వాన్ని కోరింది. ఇంధన డిపోలు, రిఫైనరీల నుంచి ఏటీఎఫ్‌ను విమాశ్రయాలకు సరఫరా చేసేందుకు ఈ సదుపాయాలను ప్రభుత్వరంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) ఏళ్ల తరబడి నిర్మించుకున్నాయి. ఇప్పుడు వీటిని వినియోగించుకునే అవకాశం లభిస్తే, ఆసియాలోనే అత్యంత రద్దీ కలిగిన కొన్ని విమానాశ్రయాల్లో ఏటీఎఫ్‌ వ్యాపారంలో అధిక వాటాను పొందొచ్చనే ఉద్దేశంతో ఆర్‌ఐఎల్‌ ఉందని సమాచారం. 

దేశీయంగా ఏటీఎఫ్‌ను ఉత్పత్తి చేస్తున్న సంస్థల్లో ఆర్‌ఐఎల్‌ది నాలుగో స్థానం. దిల్లీ విమానాశ్రయం వెలుపల ఉన్న ఏటీఎఫ్‌ నిల్వ కేంద్రంతో పాటు ముంబయి, హైదరాబాద్, బెంగళూరు.. తదితర విమానాశ్రయాలకు ఏటీఎఫ్‌ను సరఫరా చేస్తున్న పైపులైన్లు వాడుకునే అవకాశం కల్పించాలని ఆర్‌ఐఎల్‌ కోరుతోంది. ఇప్పుడు కూడా ఆయా విమానాశ్రయాలకు ఏటీఎఫ్‌ను ఆర్‌ఐఎల్‌ సరఫరా చేస్తున్నా, ప్రభుత్వరంగ సంస్థలతో పోలిస్తే బాగా తక్కువే. ఈ నేపథ్యంలోనే చమురు వ్యవహారాల నియంత్రణ సంస్థ పీఎన్‌జీఆర్‌బీకి తన అభిప్రాయాన్ని ఆర్‌ఐఎల్‌ తెలిపింది. ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న, భవిష్యత్తులో నిర్మించబోయే విమానాశ్రయాలకు కూడా ఏటీఎఫ్‌ను సరఫరా చేసే పైపులైన్లను ఏ సంస్థ అయినా వాడుకునే వీలు కల్పించాలని, ఇందువల్ల పోటీ పెరిగి, ఏటీఎఫ్‌ వ్యయాలు అదుపులోకి వస్తాయని ఆర్‌ఐఎల్‌ పేర్కొంది. కొత్తగా నిర్మించబోయే పైపులైన్లను ఎవరైనా వినియోగించుకునేందుకు తమకు అభ్యంతరం లేదంటున్న ప్రభుత్వరంగ సంస్థలు, తమ స్వీయ అవసరాల కోసం నిర్మించుకున్న పాత పైపులైన్లను మాత్రం ఇతరులతో పంచుకునేందుకు సుముఖంగా లేవు.

  • దేశంలో ప్రభుత్వరంగ చమురు సంస్థలు 17.12 మిలియన్‌ టన్నుల ఏటీఎఫ్‌ను ఉత్పత్తి చేస్తుండగా, అందులో 8.2 మిలియన్‌ టన్నులను దేశీయంగా వినియోగిస్తున్నారు. మిగిలింది విదేశాలకు ఎగుమతి అవుతోంది. రిలయన్స్‌ జామ్‌నగర్‌ రిఫైనరీల్లో  దాదాపు 5 మిలియన్‌ టన్నుల ఏటీఎఫ్‌ను ఉత్పత్తి చేస్తోంది. 
  • గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ఏటీఎఫ్‌కు గిరాకీ 11.8% పెరిగింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని