2024లో ఈక్విటీ ఫండ్లలోకి రూ.1.3 లక్షల కోట్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మ్యూచువల్‌ ఫండ్లు (ఎంఎఫ్‌) ఎంతో నమ్మకం ఉంచుతున్నాయి. ఈ ఏడాది (2024)లో ఇప్పటికే సుమారు రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ఇందుకు నిదర్శనం.

Published : 20 May 2024 01:34 IST

దిల్లీ: దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మ్యూచువల్‌ ఫండ్లు (ఎంఎఫ్‌) ఎంతో నమ్మకం ఉంచుతున్నాయి. ఈ ఏడాది (2024)లో ఇప్పటికే సుమారు రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ఇందుకు నిదర్శనం. రిటైల్‌ మదుపర్లు ఆసక్తి ప్రదర్శించడంతో పాటు, స్టాక్‌ మార్కెట్‌ రాణించడమూ ఇందుకు దోహదం చేసింది. దేశీయ మదుపర్లకు దీర్ఘకాలిక సంపద సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఎఫ్‌లు.. ఇక్కడి వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకునే, సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఈక్విటీల్లో పెట్టుబడులు చొప్పిస్తున్నాయని ట్రేడ్‌జీనీ సీఓఓ త్రివేశ్‌ డి పేర్కొన్నారు. క్రమానుగత పెట్టుబడి పథకాల(సిప్‌లు)పై మదుపర్లకు ఆసక్తి పెరుగుతుండటమూ, ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి పెట్టుబడులు తరలి రావడానికి కారణమవుతోందని పేర్కొన్నారు.

  • మొత్తంమీద నాలుగున్నర నెలల్లోనే ఈక్విటీల్లోకి ఎంఎఫ్‌ల పెట్టుబడులు సుమారు రూ.1.3 లక్షల కోట్లకు చేరాయి.
  • ఇదే సమయంలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐ) ఈక్విటీల నుంచి రూ.25,000 కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం గమనార్హం. అంతర్జాతీయంగా ఒడుదొడుకులు, రేట్ల కోతపై అనిశ్చితులు, భారత్‌లో కొత్తగా ఎవరు అధికారంలోకి వస్తారనే సందేహంతో లాభాల స్వీకరణకు దిగడం ఇందుకు దోహదం చేశాయి.
  • ఎన్‌ఎస్‌ఈ నమోదిత కంపెనీల్లో ఎంఎఫ్‌ల వాటా 2024 మార్చి చివరికి జీవన కాల గరిష్ఠ స్థాయి అయిన 8.92 శాతానికి చేరింది. మార్చి త్రైమాసికంలో రూ.81,539 కోట్ల పెట్టుబడులు తరలి రావడంతో ఇది సాధ్యమైంది. 2023 డిసెంబరు చివరకు ఎంఎఫ్‌ల వాటా  8.81 శాతంగా ఉండేది. మార్చి ఆఖరుకు ఎఫ్‌పీఐల వాటా 11 ఏళ్ల కనిష్ఠమైన 17.68 శాతానికి తగ్గింది. 2023 డిసెంబరు ఆఖరుకు వీరి వాటా 18.19 శాతంగా ఉండేది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని