వ్యాపార వృద్ధిలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు అగ్రస్థానం

గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల మొత్తం వ్యాపారం, డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధిరేటును బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) నమోదు చేసింది.

Published : 20 May 2024 01:36 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల మొత్తం వ్యాపారం, డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధిరేటును బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) నమోదు చేసింది. 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4 బ్యాంకులు మాత్రమే రెండంకెల వ్యాపార వృద్ధిని నమోదు చేశాయి. పుణె ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బీఓఎం మొత్తం వ్యాపార వృద్ధి (దేశీయంగా) 15.94 శాతంగా నమోదైంది.

  • దేశంలోనే అతి పెద్ద పీఎస్‌బీ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 13.12% వ్యాపార వృద్ధితో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఎస్‌బీఐ మొత్తం వ్యాపారం (డిపాజిట్లు, రుణాలు) బీఓఎం కంటే 16.7 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. బీఓఎం మొత్తం వ్యాపారం రూ.4,74,411 కోట్లు కాగా, ఎస్‌బీఐ వ్యాపారం రూ.79,52,784 కోట్లుగా నమోదైంది. 
  • డిపాజిట్ల సేకరణలో బీఓఎం 15.66%, ఎస్‌బీఐ 11.07%, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 11.05%, కెనరా బ్యాంక్‌ 10.98% వృద్ధి సాధించాయి.
  • తక్కువ వ్యయంతో కూడిన కాసా (కరెంట్‌ ఖాతా, పొదుపు ఖాతా) డిపాజిట్లు బీఓఎంలో 52.73% వృద్ధి చెందాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 50.02 శాతంతో రెండో స్థానం దక్కించుకుంది.  
  • రుణ వృద్ధిలో కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న యూకో బ్యాంక్‌ 16.38 శాతంతో అగ్ర స్థానంలో ఉంది. దీని తర్వాత బీఓఎం 16.30 శాతంతో రెండో స్థానం, ఎస్‌బీఐ 16.26 శాతంతో మూడో స్థానం దక్కించుకున్నాయి. మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వృద్ధి 2023-24లో 16%  కంటే తక్కువగా నమోదైంది.
  • ఆస్తుల నాణ్యత పరంగా బీఓఎం, ఎస్‌బీఐలు తక్కువ స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) ప్రకటించాయి. 2024 మార్చి 31 నాటికి బీఓఎం 1.88%, ఎస్‌బీఐ 2.24% జీఎన్‌పీఏలు కలిగి ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు వరుసగా 0.2%, 0.43 శాతంగా ఉన్నాయి.
  • కనీస మూలధన నిష్పత్తిలో బీఓఎం 17.38 శాతంతో అగ్ర స్థానంలో ఉండగా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) 17.28%, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ 17.16 శాతంతో తర్వాత స్థానాల్లో నిలిచాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని