సంక్షిప్త వార్తలు

పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో  రూ.1,311.86 కోట్ల ఆదాయంపై రూ.84.41 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

Published : 21 May 2024 01:23 IST

పవర్‌ మెక్‌ తుది డివిడెండ్‌ రూ.2

ఈనాడు, హైదరాబాద్‌: పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో  రూ.1,311.86 కోట్ల ఆదాయంపై రూ.84.41 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాలంలో ఆదాయం రూ.1,183.20 కోట్లు, లాభం రూ.74.57 కోట్లుగా ఉన్నాయి. మొత్తం ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఆదాయం రూ.4,234.40 కోట్లు, నికర లాభం రూ.248.70 కోట్లుగా ఉన్నాయి. ఒక్కో షేరుపై రూ.2 తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.


పెంపుడు జంతువుల ఆహార విభాగంలోకి గ్రోవెల్‌

ఈనాడు, హైదరాబాద్‌: రొయ్యలు, చేపల మేత, ప్రాసెసింగ్‌ పరిశ్రమలో ఉన్న గ్రోవెల్‌ కొత్తగా పెంపుడు జంతువుల ఆహారం, పోషణ విభాగంలోకి అడుగు పెట్టింది. పెంపుడు శునకాలకు పోషణ (ట్రీట్స్‌) కోసం ఫుల్లర్, డాట్‌గుడ్‌ పేర్లతో ఈ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు గ్రోవెల్‌ ప్రమోటర్‌ గ్రూపునకు చెందిన ఎం.ఎస్‌.ఆర్‌ కార్తీక్‌ వెల్లడించారు. దీనికోసం దశల వారీగా రూ.100 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొన్నారు. పెంపుడు జంతువుల ఆహార విపణి ప్రస్తుతం రూ.650 కోట్ల స్థాయిలో ఉందని, 2027కు ఇది రూ.2,000 కోట్లకు చేరుతుందనే అంచనాలున్నాయని తెలిపారు. నాలుగైదు నెలల్లో పెంపుడు శునకాలు, పిల్లుల ఆహార శ్రేణినీ తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న యూనిట్లకు తోడుగా మరో 2 కొత్త ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 


రూ.95,000 మించిన వెండి

ఈనాడు వాణిజ్య విభాగం: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులకు తోడు ఇరాన్‌ అధ్యక్షుడు ఆకస్మికంగా హెలీకాప్టర్‌ ప్రమాదంలో మరణించడం, మదుపర్ల ఆందోళనకు కారణమైంది. ఫలితంగా అనిశ్చితిలో ఆదుకుంటాయని భావించే బంగారం, వెండి లోహాల్లోకి పెట్టుబడులు అధికంగా వచ్చాయి. సోమవారం అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాముల) మేలిమి బంగారం ధర 2423 డాలర్లకు చేరింది. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో చూస్తే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1500 అధికమై రూ.76,750కి చేరింది. వెండి కిలో ధర రూ.2500 అధికమై రూ.95,600ను తాకింది. అతి త్వరలోనే కిలో వెండి రూ.లక్ష మార్కును చేరుతుందని బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 


సెయిల్‌ లాభం రూ.1,126 కోట్లు

దిల్లీ: జనవరి- మార్చి త్రైమాసికంలో స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) నికర లాభం ఏకీకృత పద్ధతిలో స్వల్పంగా 2 శాతం తగ్గి రూ.1,126.68 కోట్లకు పరిమితమైంది. ఏడాదిక్రితం ఇదే సమయంలో నికర లాభం రూ.1,159.21 కోట్లుగా ఉంది.  కార్యకలాపాల ద్వారా ఆదాయం కూడా రూ.29,130.66 కోట్ల నుంచి రూ.27,958.52 కోట్లకు తగ్గింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) నికర లాభం రూ.3,066.67 కోట్లకు పెరిగింది. 2023-24కు రూ.1 తుది డివిడెండును డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని