ఇండియా సిమెంట్స్‌కు తగ్గిన నష్టం

ఇండియా సిమెంట్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.50.06 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.

Published : 21 May 2024 01:57 IST

దిల్లీ: ఇండియా సిమెంట్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.50.06 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక నష్టం రూ.243.77 కోట్లతో పోలిస్తే, ఇది బాగా తక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.1,485.73 కోట్ల నుంచి రూ.1,266.65 కోట్లకు పరిమితమైంది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కంపెనీ 24.36 లక్షల టన్నుల సిమెంటును విక్రయించింది. కిందటేడాది ఇదేసమయంలో 27.85 లక్షల టన్నులు అమ్మడం గమనార్హం. సిమెంటు ధరలు తగ్గినప్పటికీ.. స్థలాల విక్రయం ద్వారా రూ.24 కోట్ల లాభం రావడం వల్ల, ఆ ప్రభావం పరిమితమైనట్లు కంపెనీ తెలిపింది. అంతకుముందు 2 త్రైమాసికాల్లో సామర్థ్య వినియోగం 51 శాతంగా ఉందని.. నిర్వహణ మూలధనాన్ని చొప్పించడం వల్ల సమీక్షా త్రైమాసికంలో ఇది 63 శాతానికి పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.1,637.65 కోట్ల నుంచి రూ.1,351.84 కోట్లకు పరిమితమయ్యాయి. 

  • పూర్తి ఆర్థిక సంవత్సరాని (2023-24)కి ఏకీకృత నికర నష్టం రూ.215.76 కోట్లకు పెరిగింది. 2022-23లో నష్టం రూ.169.82 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం రూ.5,608.14 కోట్ల నుంచి రూ.5,112.24 కోట్లకు పెరిగింది. 
  • ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే నూతన ప్రభుత్వం మౌలిక వసతులపై వ్యయాలను అధికంగా కొనసాగించే అవకాశం ఉండటంతో, రానున్న నెలల్లోనూ నిర్మాణ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంలో సిమెంటుకు బలమైన గిరాకీ కనిపిస్తోందని వెల్లడించింది. ధరల ఒత్తిళ్లు పెరగడం, సరకు రవాణా వ్యయాలు అధికం కావడం, తీవ్ర పోటీ లాంటివి మార్జిన్లపై ప్రభావం చూపించొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని