74,360 ఎగువన లాభాలు కొనసాగొచ్చు!

సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం సూచీలు లాభాల్లో ముగిశాయి. డీఐఐల కొనుగోళ్లు, స్థిరమైన చమురు ధరలు ఇందుకు దోహదపడ్డాయి.

Published : 21 May 2024 01:58 IST

సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం సూచీలు లాభాల్లో ముగిశాయి. డీఐఐల కొనుగోళ్లు, స్థిరమైన చమురు ధరలు ఇందుకు దోహదపడ్డాయి. దేశీయంగా చూస్తే.. ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠమైన 4.83 శాతానికి తగ్గింది. టోకు ద్రవ్యోల్బణం మాత్రం 13 నెలల గరిష్ఠమైన 1.26 శాతంగా నమోదైంది. మార్చిలో పారిశ్రామికోత్పత్తి 4.9 శాతానికి నెమ్మదించింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర స్వల్పంగా పెరిగి 84 డాలర్లకు చేరింది. చైనాలో గిరాకీ పెరగొచ్చన్న అంచనాలు, అమెరికా నిల్వలు తగ్గడం ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.37 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.4 శాతంగా నమోదైంది. చైనా పారిశ్రామికోత్పత్తి అంచనాలను మించి 6.7 శాతానికి చేరింది. యూరో ఏరియా ద్రవ్యోల్బణం 2.4 శాతం వద్ద స్థిరంగా ఉంది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 1.8% లాభంతో 74,006 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 2% తగ్గి 22,502 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో యంత్ర పరికరాలు, స్థిరాస్తి, విద్యుత్‌ షేర్లు లాభపడగా.. ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, బ్యాంకింగ్‌ స్క్రిప్‌లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.10,650 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.14,410 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ.28,200 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. 

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 7:4గా నమోదు కావడం.. 

ఎంపిక చేసిన పెద్ద షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది. 

ఈ వారంపై అంచనా: గతవారం సెన్సెక్స్‌ 71,866 పాయింట్ల వద్ద మద్దతు తీసుకుని లాభాలు నమోదుచేసింది. స్వల్పకాలంలో 74,360 పాయింట్ల ఎగువన ముగిస్తే, జీవనకాల గరిష్ఠమైన 75,124 పాయింట్లను పరీక్షించే అవకాశం ఉంటుంది. మరోవైపు 72,529 పాయింట్ల వద్ద మద్దతు, ఆ తర్వాత 71,866 వద్ద మరో మద్దతు లభించొచ్చు. 

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాలను దేశీయ సూచీలు తీసుకోవచ్చు. కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో యాజమాన్య వ్యాఖ్యలపై దృష్టిపెట్టొచ్చు. 5వ విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సరళి, ఇతర అంశాలు కూడా ప్రభావం చూపనున్నాయి. రుతుపవనాలకు సంబంధించిన వార్తలు కీలకం కానున్నాయి. ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి, షేర్ల విలువలు అధిక స్థాయులకు చేరడం, విదేశీ మదుపర్ల అమ్మకాలు, ఇండియా విక్స్‌ పెరగడంతో సూచీల ఒడుదొడుకులు అధికమయ్యే అవకాశం ఉంది. ఈ వారం ఐటీసీ, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, దివీస్, ఎన్‌ఎమ్‌డీసీ, జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్, గ్రాసిమ్, బాష్‌(, హిందాల్కో, బీఈఎల్, పేజ్‌ ఇండస్ట్రీస్,  భెల్, ఇండిగో, యునైటెడ్‌ స్పిరిట్స్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. హెచ్‌ఎస్‌బీసీ కాంపోజిట్‌ పీఎంఐ, మే తయారీ పీఎంఐ, సేవల పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. అంతర్జాతీయంగా.. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్, ఈసీబీ చీఫ్‌ క్రిస్టీన్‌ లగార్డే ప్రసంగాలపై కన్నేయొచ్చు. అమెరికా ఫెడ్‌ ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌ బుధవారం విడుదల కానున్నాయి. జపాన్‌ ద్రవ్యోల్బణం, అమెరికా నిరుద్యోగ క్లెయిమ్‌లపై దృష్టిపెట్టొచ్చు. ఇరాన్‌ అధ్యక్షుడి ఆకస్మిక మృతి కూడా మార్కెట్లపై ప్రభావం చూపొచ్చు. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, చమురు ధరల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు.  

తక్షణ మద్దతు స్థాయులు: 73,459, 72,822, 72,529

తక్షణ నిరోధ స్థాయులు: 74,360, 75,125, 75,700

సెన్సెక్స్‌ 74,360 ఎగువన ముగిస్తే మరింత లాభపడొచ్చు.

 సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని