సంక్షిప్త వార్తలు(6)

భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ (భెల్‌), మార్చి త్రైమాసికంలో రూ.489.62 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.658.02 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.8,338.61 కోట్ల నుంచి రూ.8,416.84 కోట్లకు పెరిగింది.

Published : 22 May 2024 01:50 IST

25% తగ్గిన భెల్‌ లాభం

దిల్లీ: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ (భెల్‌), మార్చి త్రైమాసికంలో రూ.489.62 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.658.02 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.8,338.61 కోట్ల నుంచి రూ.8,416.84 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.7,411.64 కోట్ల నుంచి రూ.7,794.11 కోట్లకు చేరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తంమీద కంపెనీ లాభం రూ.282.22 కోట్లకు పరిమితమైంది. 2022-23లో ఈ మొత్తం రూ.654.12 కోట్లు. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.23,853.57 కోట్ల నుంచి రూ.24,439.05 కోట్లకు పెరిగింది. రూ.2 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.0.25 (12.50%) డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది.


తొలి త్రైమాసికంలో 7.5% వృద్ధి

ఆర్‌బీఐ బులెటిన్‌ అంచనా 

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మనదేశ వృద్ధిరేటు 7.5 శాతంగా ఉండొచ్చని మంగళవారం విడుదలైన ఆర్‌బీఐ మే నెల బులెటిన్‌లోని వ్యాసం పేర్కొంది. సగటు గిరాకీ, గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర వ్యయాలు పెరగడం ఇందుకు కారణమని తెలిపింది. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడగలిగిందని వివరించింది. ‘ఎకనామిక్‌ యాక్టివిటీ ఇండెక్స్‌(ఈఏఐ) ప్రకారం.. ఏప్రిల్‌లో కార్యకలాపాలు పుంజుకున్నాయి. ముందస్తు అంచనాల ప్రకారం.. ఏప్రిల్‌-జూన్‌లో వృద్ధి రేటు 7.5% నమోదు కావొచ్చ’ని తెలిపింది. 2024 జనవరి-మార్చి  త్రైమాసిక ఫలితాలు, 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరం తాత్కాలిక అంచనాలను ప్రభుత్వం మే 31న విడుదల చేయనుంది. ఏప్రిల్‌లో టోల్‌ వసూళ్లు  8.6% పెరగ్గా.. వాహన అమ్మకాలు 25.4% వృద్ధి చెందాయి.


దేశీయ విమాన ప్రయాణికులు 1.32 కోట్లు

దిల్లీ: దేశీయ విమాన ప్రయాణికులు ఈ ఏడాది ఏప్రిల్‌లో 1.32 కోట్లుగా నమోదయ్యారని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) మంగళవారం వెల్లడించింది. 2023 ఏప్రిల్‌లో ప్రయాణించిన 1.28 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య  3.88% అధికం. బోర్డింగ్‌ నిరాకరించడంతో 1,370 మంది ప్రయాణికులు  ప్రభావితమయ్యారు. ఈ సమయంలో పరిహారం, సదుపాయాలకు విమానయాన సంస్థలు రూ.136.23 లక్షలు వెచ్చించాయి. 32,314 విమాన సర్వీసులు రద్దు కావడంతో    రూ.89.26 లక్షలను పరిహారంగా చెల్లించాయి. 1,09,910 విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. ఆ సమయంలో ప్రయాణికులకు సదుపాయాలు అందించేందుకు రూ.135.42 లక్షలు వెచ్చించాయి.

సమయపాలన (ఆన్‌-టైమ్‌ పర్ఫార్మెన్స్‌: ఓటీపీ)లో ఆకాశ ఎయిర్‌ 89.2 శాతంతో అగ్ర స్థానంలో నిలిచింది. ఏఐఎక్స్‌ కనెక్ట్‌ (79.5%), విస్తారా (76.2%), ఇండిగో (76.1%), ఎయిరిండియా (72.1%), స్పైస్‌జెట్‌ (64.2%), అలయన్స్‌ ఎయిర్‌ (49.5%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇండిగో మార్కెట్‌ వాటా మరింత పెరిగి ఏప్రిల్‌లో 60.6 శాతానికి చేరింది. ఎయిరిండియా వాటా 14.2 శాతంగా నమోదైంది. విస్తారా, ఏఐఎక్స్‌ కనెక్ట్‌లు వరుసగా 9.2%, 5.4% వాటాకు పరిమితమయ్యాయి. 


డాక్టర్‌ రెడ్డీస్‌ అనుబంధ కంపెనీకి జీఎస్‌టీ నోటీసు  

ఈనాడు, హైదరాబాద్‌: డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ అనుబంధ కంపెనీ అయిన అరిజీన్‌ డిస్కవరీ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌కు జీఎస్‌టీ నోటీసు జారీ అయింది. రూ.64.94 లక్షల జీఎస్‌టీ పెనాల్టీ చెల్లించాలని ఆదేశిస్తూ, టీజీఎస్‌టీ, సీజీఎస్‌టీ చట్టాల్లోని సెక్షన్‌ - 73 కింద మాదాపూర్‌ (హైదరాబాద్‌) లోని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఈ నోటీసు ఇచ్చారు. దీనిపై అప్పీలుకు వెళ్లనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. 


నాగౌర్‌లో రూ.3,000 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ ప్లాంటు

దిల్లీ: రాజస్థాన్‌లోని నాగౌర్‌లో తయారీ ప్లాంటు ఏర్పాటు నిమిత్తం సుమారు రూ.3,000 కోట్లు పెట్టుబడిగా పెట్టే యోచనలో ఉన్నట్లు జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ తెలిపింది. ఈ నిధులను రుణం, ఈక్విటీ ద్వారా సమీకరించనున్నట్లు పేర్కొంది. కొత్త ప్లాంటులో 3.3 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో కూడిన క్లింకరైజేషన్‌ యూనిట్, 2.50 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న గ్రైండిగ్‌ యూనిట్‌ ఉంటాయని కంపెనీ తెలిపింది. 18 మెగావాట్ల వేస్ట్‌ హీట్‌ రికవరీ ఆధారిత విద్యుదుత్పత్తి విభాగం కూడా ఇందులో ఉంటుందని పేర్కొంది. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1000 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందని జేఎస్‌బ్ల్యూ సిమెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టరు పార్ధ్‌ జిందాల్‌ తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ ప్రస్తుత తయారీ వార్షిక సామర్థ్యం 19 మిలియన్‌ టన్నులు కాగా.. దీనిని 60 మిలియన్‌ టన్నులకు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలోని విజయనగర్, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల, పశ్చిమబెంగాల్‌లోని సల్బోని, ఒడిశాలోని జయపుర, మహారాష్ట్రలోని డోల్విలో కంపెనీకి ప్లాంట్లు ఉన్నాయి.  


బోర్డు సమావేశాలపై 2 రోజులు ముందుగా సమాచారం.. 

సందర్భం ఏదైనా గానీ బోర్డు సమావేశాల నిర్వహణకు రెండు పనిదినాలు ముందుగా సమాచారం ఇవ్వాలని సెబీ పేర్కొంది. ప్రస్తుతం ఆర్థిక ఫలితాలు, షేర్ల బైబ్యాక్, నిధుల సమీకరణ లాంటి కొన్ని ప్రత్యేక అంశాల అజెండాపై బోర్డు సమావేశాల నిర్వహణకు 2-11 రోజుల్లోగా ముందస్తు సమాచారం ఇచ్చేందుకు వీలుంది. ఇప్పుడు అన్నింటికీ ఈ కాలపరిమితిని రెండు రోజులుగా మారుస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రత్యేక కేసుల్లో కీలక యాజమాన్య సిబ్బంది (కేఎంపీ) ఖాళీలను నింపేందుకు ప్రస్తుతమున్న మూడు నెలల గడువును ఆరు నెలలకు పెంచుతూ సెబీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ అనుమతులను ఆ నమోదిత సంస్థ తీసుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని