ఐపీఓ సన్నాహ కంపెనీలకు నిబంధనల సరళీకరణ

పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) కోసం సన్నద్ధతలో ఉన్న కంపెనీలు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించే షేర్ల పరిమాణంలో ఏమైనా మార్పులు ఉంటే.. ఇష్యూ పరిమాణాన్ని రూపాయల్లో లేదా షేర్ల సంఖ్య ఆధారంగా మళ్లీ కొత్తగా ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సెబీ తెలిపింది.

Published : 22 May 2024 01:52 IST

పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) కోసం సన్నద్ధతలో ఉన్న కంపెనీలు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించే షేర్ల పరిమాణంలో ఏమైనా మార్పులు ఉంటే.. ఇష్యూ పరిమాణాన్ని రూపాయల్లో లేదా షేర్ల సంఖ్య ఆధారంగా మళ్లీ కొత్తగా ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. కంపెనీల వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ అనంతరం ప్రమోటరు గ్రూపు సంస్థలు, సంస్థాగత (నాన్‌- ఇండివిడ్యువల్‌) వాటాదార్లు 5 శాతానికి మించి వాటా కలిగి ఉంటే.. ప్రమోటరుగా గుర్తించకుండా కనీస ప్రమోటరు వాటా పరిమితి (ఎంపీసీ) లోటును భర్తీ చేసేందుకు అనుమతి ఉంటుందని సెబీ వెల్లడించింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఈక్విటీ షేర్లను నమోదు చేయడానికి ముందు కంపెనీల ప్రమోటర్లు, పలు విడతల్లో నిధులను సమీకరిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రమోటర్ల వాటా కనీస ప్రమోటర్ల వాటా పరిమితి అయిన 20% కంటే తక్కువకు దిగివస్తోంది. ఈ లోటును ఇతర వర్గాల మదుపర్ల వాటాల ద్వారా భర్తీ చేసేందుకు ఇష్యూ ఆఫ్‌ కేపిటల్‌ అండ్‌ డిస్‌క్లోజర్‌ రిక్వయిర్‌మెంట్స్‌ (ఐసీడీఆర్‌) నిబంధనలు వీలు కల్పిస్తున్నాయి. ఐపీఓ ముసాయిదా దరఖాస్తు (డీఆర్‌హెచ్‌పీ)ను సెబీకి సమర్పించడానికి ముందు.. తప్పనిసరి మార్పిడి సెక్యూరిటీల ద్వారా మార్చిన ఈక్విటీ షేర్లను ఏడాది పాటు కలిగి ఉంటే వాటిని ఎంపీసీ లోటు భర్తీకి పరిగణనలోకి తీసుకోవచ్చని సెబీ తెలిపింది. బ్యాంకుల సిబ్బంది ధర్నాలు లేదా ఆ తరహా ఘటనల సందర్భంలో బిడ్‌ ముగింపు తేదీని కనీసం ఒక రోజుకు పొడిగించే అవకాశాన్ని సెబీ కల్పించింది. ప్రస్తుతం ఇది మూడు రోజులుగా ఉంది. ఈ మార్పులన్నింటికీ సంబంధించి ఐసీడీఆర్‌ నిబంధనల్లో సెబీ సవరణలు చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని