6 నెలల సగటే.. ఇకపై మార్కెట్‌ విలువ

నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ మదింపు విధానంలో సెబీ మార్పు చేసింది. ఇక మీదట మార్కెట్‌ విలువ లెక్కింపునకు ఒక్క రోజు (ప్రస్తుతం మార్చి 31ను)కు బదులుగా ఆరు నెలల సగటును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది.

Published : 22 May 2024 01:53 IST

2024 డిసెంబరు 31 నుంచి అమలు: సెబీ 

దిల్లీ: నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ మదింపు విధానంలో సెబీ మార్పు చేసింది. ఇక మీదట మార్కెట్‌ విలువ లెక్కింపునకు ఒక్క రోజు (ప్రస్తుతం మార్చి 31ను)కు బదులుగా ఆరు నెలల సగటును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు నమోదు, వెల్లడి నిబంధనల్లో (ఎల్‌ఓడీఆర్‌) సెబీ సవరణ చేయనుంది. ఈ సవరణ 2024 డిసెంబరు 31 నుంచి అమల్లోకి వస్తుంది. జులై 1 నుంచి డిసెంబరు 31 వరకు సగటు మార్కెట్‌ విలువ ఆధారంగా, నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువను, ర్యాంకులను నిర్ణయిస్తారు. ఇందుకు డిసెంబరు 31ను కట్‌-ఆఫ్‌ డేట్‌గా తీసుకుంటారు. డిసెంబరు 31న మార్కెట్‌ విలువను నిర్థరించిన తర్వాత.. సంబంధిత నిబంధనలు అమలయ్యేందుకు మూడు నెలలు లేదా తదుపరి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఏది తర్వాత అయితే అప్పటి వరకు పరివర్తనా కాలంగా (ట్రాన్షిషన్‌ పీరియడ్‌) ఉంటుంది. ‘ఏడాది చివరి రోజు అంటే డిసెంబరు 31న స్టాక్‌ ఎక్స్ఛేంజీలు జులై 1 నుంచి డిసెంబరు 31 వరకు నమోదిత కంపెనీల సగటు మార్కెట్‌ విలువ ఆధారంగా, ఆ కంపెనీల ర్యాంకులతో కూడిన జాబితాను సిద్ధం చేయాల’ని ఎల్‌ఓడీఆర్‌ నిబంధనలను సవరిస్తూ సెబీ తెలిపింది. ఒక్క రోజును పరిగణనలోకి తీసుకుంటే ఆ రోజు మార్కెట్‌ కదలికల్లో మార్పుల కారణంగా నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ హెచ్చుతగ్గులకు లోనవుతోందని, అందువల్ల నిర్దిష్ట సమయాన్ని (కనీసం ఆరు నెలలు) నిర్ణయించుకుని ఆ సమయంలోని మార్కెట్‌ విలువ సగటు ఆధారంగా నిర్ణయిస్తే నమోదిత సంస్థల మార్కెట్‌ పరిమాణంలోను, ర్యాంకుల నిర్ణయంలో మరింత కచ్చితత్వం ఉంటుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. సెబీ పూర్వ పూర్తికాల సభ్యుడు ఎస్‌.కె.మొహంతి నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ మార్పును సెబీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు