ఓఎన్‌జీసీ లాభం రూ.9,869 కోట్లు

ప్రభుత్వరంగ ఓఎన్‌జీసీ (ఆయిల్‌ అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌) జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.9,869 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక నికర లాభం రూ.528 కోట్లతో పోలిస్తే ఇది 19 రెట్లు అధికం.

Published : 22 May 2024 01:55 IST

దిల్లీ: ప్రభుత్వరంగ ఓఎన్‌జీసీ (ఆయిల్‌ అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌) జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.9,869 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక నికర లాభం రూ.528 కోట్లతో పోలిస్తే ఇది 19 రెట్లు అధికం. ఏడాది క్రితం పన్ను వివాదాల కింద రూ.9,235 కోట్లు కేటాయించాల్సి రావడంతో, లాభం తక్కువగా నమోదైంది. ఆ కేటాయింపులను మినహాయిస్తే, సమీక్షా త్రైమాసికంలో లాభం స్వల్పంగానే పెరిగినట్లు భావించాలి. సమీక్షిస్తున్న త్రైమాసికంలో ముడి చమురు ఉత్పత్తి 4.3% పెరిగి 4.71 మిలియన్‌ టన్నులుగా నమోదైంది. ప్రతి బ్యారెల్‌ ముడి చమురుపై 80.81 డాలర్లను సంస్థ ఆర్జించింది. ఏడాది క్రితం ఈ మొత్తం 77.12 డాలర్లే. ఇదే సమయంలో గ్యాస్‌ ధర ఒక్కో బ్రిటీష్‌ థర్మల్‌ యూనిట్‌కు   8.57 డాలర్ల నుంచి 6.50 డాలర్లకు తగ్గింది. గ్యాస్‌ ఉత్పత్తి కూడా 2.4% తగ్గి 4.95 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లకు (బీసీఎం) పరిమితమైంది. కార్యకలాపాల   ఆదాయం  4.6% తగ్గి రూ.34,637 కోట్లుగా నమోదైంది.

2023-24కు రికార్డు లాభం: పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఓఎన్‌జీసీ స్టాండలోన్‌ నికర లాభం రూ.40,526 కోట్లకు పెరిగింది. ఇది సంస్థ చరిత్రలోనే అత్యధికం. 2022-23లో ఇది రూ.40,097 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో ఆదాయం రూ.1.55 లక్షల కోట్ల నుంచి రూ.1.38 లక్షల కోట్లకు తగ్గింది. ఏకీకృత ప్రాతిపదికన ఓఎన్‌జీసీ నికర లాభం రూ.57,101 కోట్లుగా నమోదైంది. చమురు ఉత్పత్తి 0.7% తగ్గి 18.4 మిలియన్‌ టన్నులకు; గ్యాస్‌ ఉత్పత్తి 3.2 శాతం తగ్గి 19.97 బీసీఎంకు పరిమితమైంది. 

  • రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు 50% (2.50) తుది డివిడెండును డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. ఇప్పటికే చెల్లించిన 195% మధ్యంతర డివిడెండుతో కలిపితే, గత ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా 245% (రూ.12.25) డివిడెండును ఓఎన్‌జీసీ ప్రకటించినట్లు అవుతుంది. ఇందుకోసం మొత్తంగా రూ.15,411 కోట్లు వెచ్చిస్తోంది.
  • 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఓఎన్‌జీసీ రూ.37,000 కోట్ల మూలధన వ్యయాలు చేసింది. 2022-23లో ఇది రూ.30,208 కోట్లుగా ఉంది. 
  • విదేశీ అనుబంధ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌ (ఓవీఎల్‌) 203-24లో 7.178 మిలియన్‌ టన్నుల ముడి చమురును, 3.34 బీసీఎం గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది. 2022-23లో ముడి చమురు ఉత్పత్తి 6.349 మిలియన్‌ టన్నులు కాగా.. గ్యాస్‌ ఉత్పత్తి 3.822 బీసీఎంగా నమోదైంది. 2023-24లో ఓవీఎల్‌ నికర లాభం రూ.639 కోట్లకు తగ్గింది. 2022-23లో ఇది రూ.1,660 కోట్లుగా ఉంది. టర్నోవరు 18.2% తగ్గి రూ.9,553 కోట్లకు పరిమితమైంది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు