ప్రయాణ, పర్యాటక సూచీలో భారత్‌కు 39వ స్థానం: డబ్ల్యూఈఎఫ్‌

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ 2024లో భారత్‌ ర్యాంక్‌ మెరుగై 39వ స్థానానికి చేరింది. అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు కొవిడ్‌ ముందు స్థాయికి చేరాయని డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక నివేదిక వెల్లడించింది.

Published : 22 May 2024 02:00 IST

దిల్లీ: ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ 2024లో భారత్‌ ర్యాంక్‌ మెరుగై 39వ స్థానానికి చేరింది. అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు కొవిడ్‌ ముందు స్థాయికి చేరాయని డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. దక్షిణసియాలో తక్కువ మధ్య స్థాయి ఆదాయం కలిగిన దేశాల్లో భారత్‌ తొలి స్థానంలో ఉంది. 2021లో    డబ్ల్యూఈఎఫ్‌ ప్రకటించిన ఈ సూచీలో మన దేశ స్థానం 54 కాగా, ఈసారి మెరుగు పడింది. 2024 జాబితాలో అమెరికా తర్వాత స్థానాల్లో స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా నిలిచాయి. యూనివర్సిటీ ఆఫ్‌ సర్వేతో కలిసి ఈ సూచీని రూపొందించారు. సూచీలో పారామితుల ప్రకారం వ్యయాల పరంగా మన దేశానికి 18వ ర్యాంక్, విమాన రవాణాలో 26వ స్థానం, రోడ్లు-నౌకాశ్రయాల మౌలిక వసతుల్లో 25వ స్థానం లభించింది. భారత్‌లో సహజ (6వ ర్యాంక్‌), సాంస్కృతిక (9వ), విరామేతర (9వ) వనరులు ప్రయాణాలకు సాయం చేస్తున్నాయని డబ్ల్యూఈఎఫ్‌ పేర్కొంది.

  • దేశ మొత్తం టీటీడీఐ (ట్రావెల్‌ అండ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌) స్కోరు 2.1 శాతంగా ఉంది. ఇది 2019 స్థాయి కంటే తక్కువ. అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఐరోపా, ఆసియా-పసిఫిక్‌ దేశాలు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. ఈ ఏడాది అంతర్జాతీయ జీడీపీకి.. విదేశీ పర్యాటకుల ప్రయాణ-పర్యాటక రంగాల వాటా కొవిడ్‌ ముందు స్థాయికి చేరొచ్చని డబ్ల్యూఈఎఫ్‌ వివరించింది. అంతర్జాతీయ పర్యాటకుల రికవరీలో పశ్చిమాసియా దేశాలు 20% (2019 స్థాయి కంటే ఎక్కువ) నమోదు చేశాయి. ఐరోపా, ఆఫ్రికా, అమెరికాలు 2023లో బలమైన రికవరీ (90%) సాధించాయి. 119 దేశాల్లో ప్రయాణ, పర్యాటక రంగాలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.
  • జర్మనీ (6), యూకే (7), చైనా (8), ఇటలీ (9), స్విట్జర్లాండ్‌ (10) టాప్‌-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అధిక ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థలు సాధారణంగానే ప్రయాణ, పర్యాటక అభివృద్ధికి అనుకూల పరిస్థితులను కలిగి ఉంటాయని నివేదిక పేర్కొంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని