సంక్షిప్త వార్తలు

గ్లాండ్‌ ఫార్మా ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1537 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల ఆదాయంతో పోల్చితే 96% పెరిగింది. త్రైమాసిక నికరలాభం 145% వృద్ధితో రూ.192 కోట్లకు చేరింది.

Updated : 23 May 2024 02:13 IST

గ్లాండ్‌ ఫార్మా ఆకర్షణీయ ఫలితాలు 

ఈనాడు, హైదరాబాద్‌: గ్లాండ్‌ ఫార్మా ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1537 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల ఆదాయంతో పోల్చితే 96% పెరిగింది. త్రైమాసిక నికరలాభం 145% వృద్ధితో రూ.192 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి ఈ సంస్థ 56% అధికంగా రూ.5,664 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. వార్షిక నికరలాభం రూ.772 కోట్లుగా ఉంది. వాటాదార్లకు ఒక్కో షేరుకు రూ.20 చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. సమీక్షా త్రైమాసికంలో ఆకర్షణీయ పనితీరు కనబరచినట్లు గ్లాండ్‌ ఫార్మా సీఈఓ శ్రీనివాస్‌ సాదు అన్నారు. ఐరోపాలో కొనుగోలు చేసిన సెనెగ్జి అనే సంస్థ నుంచి మున్ముందు మంచి ఆదాయాలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. 


అవంతీ ఫీడ్స్‌కు రూ.112 కోట్ల లాభం 

ఈనాడు, హైదరాబాద్‌: అవంతీ ఫీడ్స్‌ మార్చి త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1319.96 కోట్ల ఆదాయాన్ని, రూ.112.03  కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.7.64 ఉంది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం రూ.1,117.04 కోట్లు, నికరలాభం రూ.101.12 కోట్లు, ఈపీఎస్‌ రూ.6.85 ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలానికి ఈ సంస్థ రూ.5,505 కోట్ల ఆదాయం, రూ.392.59 కోట్ల నికరలాభం, రూ.26.21 ఈపీఎస్‌ నమోదు చేసింది. రూ.1 ముఖ విలువ కల ఒక్కో షేరుకు రూ.6.75 చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ ప్రతిపాదించింది. 


కావేరీ సీడ్స్‌ ఆదాయం రూ.80.54 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: కావేరీ సీడ్స్‌ కంపెనీ, మార్చి త్రైమాసికానికి రూ.80.54 కోట్ల ఆదాయాన్ని, రూ.2.79 కోట్ల నికర లాభాన్నీ నమోదు చేసింది. 2022-23 ఇదే కాలంలో ఆదాయం రూ.60.64 కోట్లు, నికర నష్టం రూ.13.89 కోట్లుగా ఉన్నాయి. వీటితో పోలిస్తే సమీక్షా త్రైమాసికంలో ఆదాయం 32.82% పెరిగింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ.1062.43 కోట్లు, నికర లాభం రూ.293 కోట్లుగా ఉన్నాయి. చేతిలో రూ.443 కోట్ల నగదు ఉంది. 2022-23లో ఆదాయం రూ.1000.56 కోట్లు, నికర లాభం రూ.267.04 కోట్లుగా నమోదయ్యాయి. 44.83 లక్షల షేర్లను, ఒక్కోటి రూ.725 చొప్పున బైబ్యాక్‌ చేసేందుకు రూ.325 కోట్లు వెచ్చించినట్లు కంపెనీ ఛైర్మన్, ఎండీ జీవీ భాస్కర్‌ రావు తెలిపారు. బంగ్లాదేశ్‌లో అనుబంధ కంపెనీ ఏర్పాటు చేశామన్నారు.


కొత్తగా 100 శాఖలు ఏర్పాటు చేస్తాం : కేవీబీ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 100 శాఖలు ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నట్లు కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ (కేవీబీ) మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ బి.రమేశ్‌ బాబు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 39 శాఖలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,605 కోట్ల నికర లాభాన్ని ఆర్జించామని, బ్యాంకు చరిత్రలోనే ఇది అత్యధికమని తెలిపారు. బుధవారం అయోధ్యలో కేవీబీ నూతన బ్యాంకు శాఖను ఛైర్‌పర్సన్‌ మీనా హేమచంద్రన్‌ ప్రారంభించారు. దీంతో మొత్తం శాఖల సంఖ్య 840కి చేరింది. 


కమల్‌ వాచ్‌ వార్షికోత్సవ ఆఫర్లు

హైదరాబాద్‌: రోలెక్స్, ఒమేగా, బుల్గరి లాంటి విలాసవంత బ్రాండ్‌ వాచీల విక్రయ సంస్థ కమల్‌ వాచ్‌ కంపెనీ 55వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ఈనెల 18 నుంచి జులై 14 వరకు అమ్మకాలపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. కొనుగోలుదార్లకు రాయితీలు, బహుమతులు ఇస్తామని వెల్లడించింది. ప్రతి రూ.5000 కొనుగోలుపై ఇచ్చే కూపన్లతో వారం వారీ డ్రాలతో పాటు ఆగస్టులో బంపర్‌ డ్రాలు ఉంటాయని వివరించింది. బంపర్‌ ప్రైజ్‌ కింద టొయోటా గ్లాంజా ఆటోమేటిక్‌ కారు, హోండా యాక్టివా స్కూటర్లు, ఐఫోన్లు లాంటివి పొందొచ్చని పేర్కొంది. 


గ్రాన్యూల్స్‌ ఇండియాలో 3.09% వాటా విక్రయించిన ప్రమోటర్‌ కృష్ణ ప్రసాద్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: గ్రాన్యూల్స్‌ ఇండియా ప్రమోటర్, సంస్థ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌ చిగురుపాటి తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించారు. ఎన్‌ఎస్‌ఈలో బల్క్‌ డీల్‌ ద్వారా 75 లక్షల షేర్లను బుధవారం ఆయన విక్రయించారు. ఈ షేర్లు కంపెనీలో 3.09% వాటాకు సమానం. ఒక్కో షేరును రూ.405.08 సగటు ధరకు విక్రయించగా, ఆయనకు           రూ.304 కోట్లు లభించాయి. తన వ్యక్తిగత అప్పులు తీర్చడానికి, తనఖాలో ఉన్న షేర్లను విడిపించడానికి, ఈ లావాదేవీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కానీ, సమీప భవిష్యత్తులో గానీ మరిన్ని షేర్లు విక్రయించే ఆలోచన తనకు లేదని ఈ సందర్భంగా కృష్ణప్రసాద్‌ స్పష్టం చేశారు. ఈ షేర్ల విక్రయం వల్ల గ్రాన్యూల్స్‌ ఇండియాలో 41.96 శాతంగా ఉన్న ప్రమోటర్ల వాటా, 38.87 శాతానికి తగ్గింది. చిగురుపాటి వాటా 34.78% నుంచి   31.69 శాతానికి దిగి వచ్చింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని