పసిడి ఆభరణాల రిటైలర్లకు మంచి గిరాకీ

వ్యవస్థీకృత పసిడి ఆభరణాల రిటైలర్లకు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో మంచి గిరాకీ ఉంటుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక అంచనా వేసింది. ఆదాయ వృద్ధి 17-19 శాతంగా నమోదు కావొచ్చని తెలిపింది.

Published : 23 May 2024 01:57 IST

2024-25లో 17-19% ఆదాయ వృద్ధి: క్రిసిల్‌ 

ముంబయి: వ్యవస్థీకృత పసిడి ఆభరణాల రిటైలర్లకు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో మంచి గిరాకీ ఉంటుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక అంచనా వేసింది. ఆదాయ వృద్ధి 17-19 శాతంగా నమోదు కావొచ్చని తెలిపింది. పసిడి ధరలు బాగా పెరగడంతో, పరిమాణ వృద్ధి మాత్రం స్థిరంగా ఉంటుందని పేర్కొంది. ఆభరణాల రిటైలర్లకు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు పెరిగే అవకాశం ఉందనీ  వెల్లడించింది. పసిడి ధరలు పెరగడంతో పాటు కొత్త విక్రయశాలలను జత చేసుకోవడానికి అదనపు నిధులు వెచ్చించాల్సి ఉంటుందని వివరించింది. మొత్తం పసిడి ఆభరణాల రిటైలర్ల విపణిలో వ్యవస్థీకృత పసిడి ఆభరణాల రిటైలర్ల వాటా మూడో వంతు ఉంటుందని పేర్కొంది. దేశీయ పసిడి ధర 2023-24లో 15% పెరిగి 10 గ్రాముల ధర రూ.67,000కు చేరిందని తెలిపింది. 2024 ఏప్రిల్‌లో మరింత అధికమై రూ.73,000 స్థాయిలో ఉందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ కేంద్ర బ్యాంకులతో పాటు వినియోగదార్లు కూడా పసిడిని సురక్షిత పెట్టుబడి సాధనంగా చూస్తుండటంతో గిరాకీ బాగా పెరిగిందని తెలిపింది. భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు కూడా బంగారం ధర పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ ఆదిత్య ఝావర్‌ వెల్లడించారు. అధిక ధరలు ఉన్నప్పటికీ, బ్రాండింగ్, మార్కెటింగ్‌ వ్యయాలను పెంచడంతో పాటు కొనుగోలుదార్లకు అధిక రాయితీలు, ఆఫర్లు, కొత్త డిజైన్లతో రిటైలర్లు ముందుకొస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 2024-25లో కొత్త విక్రయశాలల ఏర్పాటు 10-12 శాతంగా ఉండొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది.

 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని