పేటీఎం నష్టం రూ.550 కోట్లు

పేటీఎం బ్రాండ్‌తో ఆర్థిక సేవలందిస్తున్న వన్‌97 కమ్యూనికేషన్స్‌ ఆర్థిక ఫలితాల్లో డీలాపడింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ నిషేధం నేపథ్యంలో 2023-24 మార్చి త్రైమాసికంలో రూ.550 కోట్ల నికర నష్టాన్ని సంస్థ నమోదు చేసింది.

Published : 23 May 2024 02:00 IST

దిల్లీ: పేటీఎం బ్రాండ్‌తో ఆర్థిక సేవలందిస్తున్న వన్‌97 కమ్యూనికేషన్స్‌ ఆర్థిక ఫలితాల్లో డీలాపడింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ నిషేధం నేపథ్యంలో 2023-24 మార్చి త్రైమాసికంలో రూ.550 కోట్ల నికర నష్టాన్ని సంస్థ నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక నష్టం రూ.167.5 కోట్లే. దాంతో పోల్చితే, ఈసారి నష్టం 3 రెట్లకు పైగా పెరిగింది. ‘యూపీఐ లావాదేవీలకు కలిగిన అంతరాయం వల్ల ఆర్థిక ఫలితాలపై ప్రభావం పడింది. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం 3% తగ్గి రూ.2,267 కోట్లుగా నమోదైంద’ని పేటీఎం తెలిపింది. డిపాజిట్ల స్వీకరణతో పాటు ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్‌లలో నిధులు జమచేయకుండా మార్చి 15 నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ‘మా ఉత్పత్తులపై నిషేధం వల్ల ఎబిటాపై రూ.500 కోట్ల వరకు ప్రభావం పడింద’ని కంపెనీ పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం (2023-24)లో కంపెనీ నష్టం రూ.1,422.4 కోట్లకు పరిమితమైంది. 2022-23 నష్టం రూ.1,776.5 కోట్లు. ఇదే సమయంలో ఆదాయం రూ.7,990.3 కోట్ల నుంచి 25% పెరిగి రూ.9,978 కోట్లకు చేరింది.

పేటీఎంలో ఉద్యోగాల కోత!: తొలిసారిగా విక్రయాల్లో క్షీణతను నమోదు చేసిన నేపథ్యంలో ప్రధానేతర ఆస్తులను తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తోంది. అదే సమయంలో కొంత మంది ఉద్యోగులనూ తొలగించవచ్చని సంకేతాలిస్తోంది.  

పోస్ట్‌పెయిడ్‌ రుణాల నిలిపివేత: పోస్ట్‌పెయిడ్‌ రుణాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు పేటీఎం ప్రతినిధి ఒకరు ఒక ఆంగ్ల వార్తా సంస్థకు తెలిపారు. కేవలం ‘డిస్ట్రిబ్యూషన్‌ ఓన్లీ క్రెడిట్‌’ నమూనాపైనే దృష్టి సారించనుంది. ఇందు కోసం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో భాగసామ్యాలు కుదుర్చుకోవాలని పేటీఎం చూస్తోంది. 

ఇబ్బంది లేదంటున్న బ్లూమ్‌బర్గ్‌: పేటీఎం 2025-26లో బలంగా పుంజుకుంటుందని బ్లూమ్‌బర్గ్‌ ఇంటెలిజెన్స్‌ అంచనా వేస్తోంది. నియంత్రణ పరమైన ఆందోళనలు కొత్త లైసెన్సుతో తొలగుతాయని చెబుతోంది. భారత డిజిటల్‌ చెల్లింపుల్లో కంపెనీ వాటా స్థిరంగా కొనసాగగలదనీ అంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని