సంక్షిప్త వార్తలు

తమిళనాడులో స్మార్ట్‌ఫోన్లు, డ్రోన్ల తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు గూగుల్‌ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Published : 24 May 2024 02:59 IST

తమిళనాడులో గూగుల్‌ స్మార్ట్‌ఫోన్, డ్రోన్ల ప్లాంట్లు!

చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడులో స్మార్ట్‌ఫోన్లు, డ్రోన్ల తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు గూగుల్‌ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ సంస్థతో కలిసి తమిళనాడులో పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి ప్లాంటును నెలకొల్పే యోచనలో గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ ఉంది. తమిళనాడులోనే డిక్సన్‌ ప్లాంటులోనూ పిక్సెల్‌ ఫోన్ల తయారు చేసేందుకు గతంలోనే గూగుల్‌ నిర్ణయించింది. ఈ ప్లాంట్ల నుంచి పిక్సెల్‌ ఫోన్లను విదేశాలకూ ఎగుమతి చేయనుంది. గూగుల్‌ మాతృ సంస్థ, ఆల్ఫాబెట్‌కు చెందిన మరో అనుబంధ సంస్థ వింగ్‌ కూడా తమిళనాడులో డ్రోన్ల అసెంబ్లింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌బీ రాజా అమెరికా వెళ్లినప్పుడు, గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చలు జరిపారు.


6.8 లక్షల మొబైల్‌ నంబర్లపై అనుమానాలు
60 రోజుల్లో తనిఖీ పూర్తిచేయండి
టెల్కోలకు డాట్‌ ఆదేశాలు

దిల్లీ: 6 లక్షలకు పైగా మొబైల్‌ నంబర్ల వినియోగదారుల వివరాలను మళ్లీ తనిఖీ చేయాలని టెలికాం సంస్థలకు, టెలికాం విభాగం (డాట్‌) ఆదేశాలు జారీ చేసింది. ఆయా కనెక్షన్లను తప్పుడు/నకిలీ/  చెల్లుబాటు కాని పత్రాల ఆధారంగా పొందారన్న అనుమానాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ఒక అధికారిక ప్రకటన వెలువడింది. 60 రోజుల్లోగా ఈ మొబైల్‌ నంబర్ల పునఃపరిశీలన పూర్తి చేయాలని డాట్‌ స్పష్టం చేసింది. ‘వ్యక్తిగత ధ్రువీకరణ, చిరునామాల విషయంలో నకిలీ, చెల్లుబాటు కాని, ఫోర్జింగ్‌ పత్రాలతో దాదాపు 6.8 లక్షల మొబైల్‌ కనెక్షన్లు పొందినట్లు డాట్‌ గుర్తించింద’ని ఆ ప్రకటన పేర్కొంది. రీ-వెరిఫికేషన్‌ పూర్తిచేయని పక్షంలో, ఆయా మొబైల్‌ నంబర్లు డిస్‌కనెక్ట్‌ అవుతాయని డాట్‌ స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ 10,834 అనుమానిత మొబైల్‌ నంబర్లను తిరిగి తనిఖీ చేయాలని డాట్‌ ఆదేశించింది. అందులో 8272 నంబర్ల్ల తనిఖీ పూర్తికాక పోవడంతో, వాటిని తొలగించారు.


విపణిలోకి ఐకూ జెడ్‌9ఎక్స్‌

హైదరాబాద్‌ (బంజారాహిల్స్‌) న్యూస్‌టుడే : అందుబాటు ధరతో పాటు, యువతను ఆకట్టుకునేలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ జెడ్‌9ఎక్స్‌ను తీసుకొచ్చినట్లు ఐకూ సంస్థ సీఈఓ నిపుణ్‌ మార్య తెలిపారు. 1 టెరాబైట్‌ వరకు మెమొరీ పెంచుకునే వీలున్న ఈ ఫోన్లు రూ.12,999 - 15,999 శ్రేణిలో లభిస్తాయని గురువారం ఇక్కడ తెలిపారు. హైదరాబాద్‌ తమకు అతి పెద్ద మార్కెట్‌గా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆన్‌లైన్‌లోనే ఫోన్లు విక్రయిస్తున్నామని, రానున్న రోజుల్లో సంప్రదాయ విక్రయశాలల్లోనూ తమ ఉత్పత్తులు లభిస్తాయన్నారు. విక్రయాల పరంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 35% వృద్ధి సాధించామని తెలిపారు.  తెలంగాణలో 28, ఏపీలో 18 సేవా కేంద్రాలున్నాయని వెల్లడించారు.


జీటీఆర్‌ఈ ‘ప్రొడక్షన్‌ ఏజెన్సీ’గా ఎంపికైన ఆజాద్‌ ఇంజినీరింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: డీఆర్‌డీఏ (డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) సారథ్యంలోని జీటీఆర్‌ఈ (గ్యాస్‌ టర్బైన్‌ రీసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌) అభివృద్ధి చేస్తున్న అడ్వాన్స్‌డ్‌ గ్యాస్‌ టర్బైన్‌ ఇంజిన్‌ కోసం ‘ప్రొడక్షన్‌ ఏజెన్సీ’గా హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆజాద్‌ ఇంజినీరింగ్‌ను ఎంపిక చేసింది. ఇంజిన్‌ విడిభాగాల ఉత్పత్తి, అసెంబ్లింగ్, టెస్టింగ్‌ కార్యకలాపాలను ఆజాద్‌ ఇంజినీరింగ్‌ నిర్వహిస్తుంది. రక్షణ రంగంలో వివిధ అవసరాల కోసం ఈ ఇంజిన్‌ను వినియోగిస్తారు. 2026 నుంచి ఇంజిన్లు అందించనున్నట్లు ఆజాద్‌ ఇంజినీరింగ్‌ వెల్లడించింది. జీటీఆర్‌ఈ కోసం పనిచేయడం అంటే, ఇంజినీరింగ్‌ డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి విభాగాల్లో తమ నైపుణ్యం, అనుభవానికి గుర్తింపు లభించినట్లేనని ఆజాద్‌ ఇంజినీరింగ్‌ ఛైర్మన్‌ రాకేష్‌ చాప్దార్‌ అన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని