గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ డివిడెండు 500%

ఆదిత్య బిర్లా గ్రూపులో ముఖ్య సంస్థ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.2,721.81 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది.

Updated : 24 May 2024 04:38 IST

దిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూపులో ముఖ్య సంస్థ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.2,721.81 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.2,355.67 కోట్లతో పోలిస్తే ఇది 15.54% అధికం. సిమెంట్, ఆర్థిక సేవల వ్యాపారాలు రాణించడం ఇందుకు దోహదం చేసిందని కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.33,462.14 కోట్ల నుంచి 12.74% పెరిగి రూ.37,727.13 కోట్లకు చేరింది. ఇప్పటివరకు కంపెనీ నమోదుచేసిన అత్యధిక త్రైమాసిక ఆదాయం ఇదే అని గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. మొత్తం వ్యయాలు 11.18% పెరిగి రూ.33,750.46 కోట్లకు చేరాయి. ఇతర వనరుల నుంచి ఆర్జించిన ఆదాయాలతో కలిపి మొత్తం ఆదాయం 13.27% వృద్ధితో రూ.38,154.36 కోట్లుగా నమోదైంది. 

పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం 10.4% తగ్గి రూ.9,925.65 కోట్లకు పరిమితమైంది. 2022-23లో లాభం రూ.11,078.20 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.1,17,627.08 కోట్ల నుంచి 11.35% పెరిగి రూ.1,30,978.48 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.10 (500%) తుది డివిడెండును చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. 

ఆయా విభాగాల పనితీరు ఇలా.. 

  • జనవరి- మార్చిలో సెల్యులోజిక్‌ ఫైబర్స్‌ ఆదాయం రూ.3,764.06 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ.3,761.75 కోట్లకు పరిమితమైంది.      
  • రసాయనాల వ్యాపారాదాయం రూ.2,397.47 కోట్ల నుంచి 13.11% తగ్గి రూ.2,082.98 కోట్లుగా నమోదైంది. 
  • సిమెంట్‌ (అల్ట్రాటెక్‌), పెయింట్స్, బీ2బీ ఇ-కామర్స్‌ వ్యాపారం బిర్లా పైవట్‌తో కూడిన బిల్డింగ్‌ మెటీరియల్స్‌ వ్యాపార ఆదాయం రూ.18,803.03 కోట్ల నుంచి 11.25% పెరిగి రూ.20,918.55 కోట్లకు చేరింది.            
  • ఆర్థిక సేవల (ఆదిత్యా బిర్లా కేపిటల్‌) వ్యాపారాదాయం రూ.8,094.51 కోట్ల నుంచి 29.51% వృద్ధితో రూ.10,483.77 కోట్లుగా నమోదైంది. 
  • ఇతరత్రా (జౌళి, ఇన్సులేటర్లు, పునరుత్పాదక విద్యుత్‌ వ్యాపారం) విభాగాల ఆదాయం 5.95% పెరిగి రూ.789.85 కోట్లకు చేరింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని