హీరో ఎలక్ట్రిక్, ఒకినవ, బెన్లింగ్‌లకు షాక్‌!

విద్యుత్‌ వాహన తయారీ కంపెనీలైన హీరో ఎలక్ట్రిక్, ఒకినవ, బెన్లింగ్‌ లను, ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందకుండా అనర్హత వేటు వేసే (బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే) అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Published : 24 May 2024 03:08 IST

అన్ని ప్రభుత్వ పథకాల నుంచి అనర్హతకు గురయ్యే అవకాశం

దిల్లీ: విద్యుత్‌ వాహన తయారీ కంపెనీలైన హీరో ఎలక్ట్రిక్, ఒకినవ, బెన్లింగ్‌ లను, ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందకుండా అనర్హత వేటు వేసే (బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే) అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దేశంలో విద్యుత్‌ వాహన తయారీ-వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేమ్‌-2 పథకం కింద ఆయా సంస్థలు తప్పుడు క్లెయిములతో ప్రయోజనాలు పొందాయి. వాటిని తిరిగి ఇవ్వడంలో విఫలం కావడం, ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోనుందని అంటున్నారు.

ఫిర్యాదులు అందడంతో: ఫేమ్‌-2 కింద నమోదైన పలు కంపెనీలు (ఓఈఎమ్‌లు) ఆ పథకం మార్గదర్శకాలను ఉల్లంఘించాయని, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు 2022లో ఫిర్యాదులు అందాయి. స్థానికంగా విడిభాగాలు సేకరించకుండా, దిగుమతి చేసుకున్న విడిభాగాలతో రూపొందించిన విద్యత్‌ వాహనాలను పలు కంపెనీలు విక్రయించాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో మంత్రిత్వశాఖ దాదాపు 13 కంపెనీలపై దర్యాప్తు చేపట్టింది. అందులో 6 కంపెనీలు.. హీరో ఎలక్ట్రిక్, ఒకినవ ఆటోటెక్, బెన్లింగ్‌ ఇండియా ఎనర్జీ అండ్‌ టెక్నాలజీ, ఏఎమ్‌ఓ మొబిలిటీ, గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, రివోల్ట్‌ మోటార్స్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది.

3 కంపెనీలు వెనక్కి ఇచ్చేశాయ్‌: ‘ఏఎమ్‌ఓ మొబిలిటీ, గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, రివోల్ట్‌ మోటార్స్‌ తాము పొందిన సబ్సిడీ మొత్తాన్ని వడ్డీ సహా కొద్ది నెలల్లోపే తిరిగి ఇచ్చి, ప్రభుత్వం నుంచి క్లీన్‌ చిట్‌ పొందాయి. హీరో ఎలక్ట్రిక్, ఒకినవ, బెన్లింగ్‌ మాత్రం ప్రోత్సాహకాలను తిరిగి ఇవ్వలేదు. దీంతో ఫేమ్‌-2 పథకం నుంచి ఆయా కంపెనీలను తొలగించాం. తదుపరి అడుగు మంత్రిత్వ శాఖ కిందున్న అన్ని పథకాల నుంచి వాటిని తొలగించడమే. ఇప్పటికే హీరో ఎలక్ట్రిక్, బెన్లింగ్‌ ఇండియాలపై ఆ చర్య తీసుకున్నాం. ఒకినవ కోర్టుకెళ్లడంతో డీబార్‌ చేయలేదు. తదుపరి అడుగు భారత ప్రభుత్వ పథకాలన్నిటి నుంచి ఈ కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం. అది పద్ధతి ప్రకారం ఆర్థిక శాఖ అనుమతులతో జరగాల్సి ఉంద’ని ఒక అధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని