సంక్షిప్త వార్తలు(7)

అస్ట్ర మైక్రోవేవ్‌ ప్రోడక్ట్స్‌ మార్చి త్రైమాసికానికి రూ.353 కోట్ల ఆదాయాన్ని, రూ.50 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం రూ.256 కోట్లు, నికరలాభం రూ.12 కోట్లే ఉన్నాయి.

Published : 25 May 2024 02:11 IST

రూ.1,000- 1,100 కోట్ల వార్షిక టర్నోవర్‌ లక్ష్యం
అస్ట్ర మైక్రోవేవ్‌ ప్రోడక్ట్స్‌  

ఈనాడు, హైదరాబాద్‌: అస్ట్ర మైక్రోవేవ్‌ ప్రోడక్ట్స్‌ మార్చి త్రైమాసికానికి రూ.353 కోట్ల ఆదాయాన్ని, రూ.50 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం రూ.256 కోట్లు, నికరలాభం రూ.12 కోట్లే ఉన్నాయి. దీంతో పోల్చితే సమీక్షా త్రైమాసికంలో ఆదాయం 37.5%, నికరలాభం 308% పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి రూ.904 కోట్ల ఆదాయాన్ని, రూ.113 కోట్ల నికరలాభాన్ని సంస్థ నమోదు చేసింది. 2022-23లో ఆదాయం రూ.807 కోట్లు, నికరలాభం రూ.77 కోట్లుగా ఉన్నాయి. మార్చి 31 నాటికి కంపెనీ చేతిలో రూ.1,956 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి.1-3 సంవత్సరాల్లో ఈ ఆర్డర్లు పూర్తి చేయనున్నట్లు అస్ట్ర మైక్రోవేవ్‌ ప్రోడక్ట్స్‌ ఎండీ ఎస్‌.జి.రెడ్డి పేర్కొన్నారు. కొత్త ఉత్పత్తులు రూపొందిస్తున్నామని, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు సెమీకండక్టర్‌ సేవలు అందించేందుకు టెలీడైన్‌ ఈ2వీ హైరెల్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రూ.1300 కోట్ల ఆర్డర్లు లభించే అవకాశం ఉందని,  రూ.1,000- 1,100 కోట్ల వార్షిక టర్నోవర్‌ నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 


అలుఫ్యూరైడ్‌ డివిడెండ్‌ 30%

ఈనాడు, హైదరాబాద్‌: అలుఫ్యూరైడ్‌ లిమిటెడ్‌ మార్చి త్రైమాసికానికి రూ.46.62 కోట్ల ఆదాయంపై రూ.5.48 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.7.02 ఉంది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం రూ.37.19 కోట్లు, నికరలాభం రూ.4.17 కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి ఆదాయం రూ.166.77 కోట్లు, నికరలాభం రూ.18.14 కోట్లు, ఈపీఎస్‌ రూ.23.20 నమోదయ్యాయి. 2022-23లో ఆదాయం రూ. 138.91 కోట్లు, నికరలాభం రూ. 13.88 కోట్లు, ఈపీఎస్‌ రూ.17.75 ఉన్నాయి. దీంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, నికరలాభం పెరిగాయి. ఒక్కో షేరుకు 30 శాతం  (రూ.3 చొప్పున) డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది.


ఎన్‌టీపీసీ లాభం రూ.6490 కోట్లు

దిల్లీ: ప్రభుత్వ రంగ ఎన్‌టీపీసీ మార్చి త్రైమాసికంలో రూ.6,490.05 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే మూడు నెలల లాభం రూ.4,871.85 కోట్లతో పోలిస్తే ఇది 33% ఎక్కువ. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.44,744.96 కోట్ల నుంచి రూ.48,816.55 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరం(2023-24)లో కంపెనీ లాభం రూ.21,332.45 కోట్లకు చేరింది. 2022-23 లాభం రూ.17,121.35 కోట్లే. ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ.1,77,976.39 కోట్ల నుంచి రూ.1,81,165.86 కోట్లకు పెరిగింది. 

తుది డివిడెండు రూ.3.25: కంపెనీ బోర్డు రూ.3.25 తుది డివిడెండును సిఫారసు చేసింది. తొలి మధ్యంతర డివిడెండు రూ.2.25, రెండో మధ్యంతర డివిడెండు రూ.2.25కు ఇది అదనం. అణు ఇంధన వ్యాపారం కోసం పూర్తి స్థాయి అనుబంధ కంపెనీ ఏర్పాటుకు ఎన్‌టీపీసీ బోర్డు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. విద్యుత్‌ శాఖ, దీపమ్, నీతి ఆయోగ్‌ ఇందుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. 


హిందాల్కో లాభం రూ.3,174 కోట్లు 

దిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్‌ మార్చి త్రైమాసికంలో రూ.3,174 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.2,411 కోట్లతో పోలిస్తే ఇది 32% అధికం. బలమైన మార్జిన్లకు తోడు అల్యూమినియం, రాగి వ్యాపార విభాగాల్లో మెరుగైన విక్రయాలు ఇందుకు దోహదం చేశాయి. మొత్తం ఆదాయం రూ.56,209 కోట్ల నుంచి రూ.56,356 కోట్లు పెరిగింది. కంపెనీ అన్ని వ్యాపార విభాగాల్లో బలమైన ఫలితాలను నమోదు చేసిందని ఎండీ సతీశ్‌ పాయ్‌ అన్నారు.


అశోక్‌ లేలాండ్‌ వార్షిక లాభం రెట్టింపు

దిల్లీ: వాణిజ్య వాహన సంస్థ అశోక్‌ లేలాండ్, జనవరి- మార్చిలో ఏకీకృత ప్రాతిపదికన రూ.933.69 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.799.87 కోట్లతో పోలిస్తే ఇది 16.73% ఎక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.13,202.55 కోట్ల నుంచి రూ.13,577.58 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.12,085.50 కోట్ల నుంచి రూ.12,037.16 కోట్లకు తగ్గాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) నికర లాభం రూ.2,696.34 కోట్లకు పెరిగింది. 2022-23లో లాభం రూ.1,358.82 కోట్లతో పోలిస్తే, ఇది దాదాపు రెట్టింపు. కార్యకలాపాల ఆదాయం రూ.41,672.60 కోట్ల నుంచి రూ.45,790.64 కోట్లకు పెరిగింది. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.4.95 (495%) మధ్యôతర డివిడెండును డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. ‘అన్ని విభాగాలు రాణించడం వల్లే జనవరి- మార్చిలో మెరుగైన ఆర్థిక ఫలితాలు నమోదు చేయగలిగాం. 2023-24లో 1,94,553 వాణిజ్య వాహనాలను విక్రయించాం. 2022-23లో విక్రయించిన 1,97,336 వాహనాల కంటే ఈ సంఖ్య కాస్త తక్కువ’ అని అశోక్‌ లేలాండ్‌ పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు కనబరుస్తుందనే అంచనాల నేపథ్యంలో సమీప, మధ్య కాలంలో వృద్ధి బాగుంటుందనే ఆశాభావాన్ని కంపెనీ ఛైర్మన్‌ ధీరజ్‌ హిందూజా వ్యక్తం చేశారు.


ఎల్‌సీవీ విభాగంలో 5-6 కొత్త మోడళ్లు: ఎండీ

తేలికపాటి వాణిజ్య వాహనాల (ఎల్‌సీవీ) విభాగంలో ఈ ఏడాది 5-6 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు అశోక్‌ లేలాండ్‌ ఎండీ, సీఈఓ శేణు అగర్వాల్‌ తెలిపారు. మే, జులై, ఆగస్టు.. ఇలా ప్రతి 2 నెలలకు ఒక్కో ఎల్‌సీవీ మోడల్‌ను తీసుకొస్తామని పేర్కొన్నారు. అనుబంధ సంస్థ స్విచ్‌ మొబిలిటీ ద్వారా ఎల్‌ఈవీ 3 విద్యుత్తు వాహనాలను కూడా విడుదల చేసే యోచనలో కంపెనీ ఉందని అగర్వాల్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.500- 700 కోట్లను మూలధన వ్యయంగా కంపెనీ వెచ్చించనుంది.


23% తగ్గిన కర్ణాటక బ్యాంక్‌ లాభం 

దిల్లీ: ప్రైవేటురంగ కర్ణాటక బ్యాంక్, మార్చి త్రైమాసికంలో రూ.274 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.354 కోట్లతో పోలిస్తే, ఇది 23% తక్కువ. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.2365 కోట్ల నుంచి రూ.2620 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం మాత్రం రూ.860 కోట్ల నుంచి రూ.834 కోట్లకు తగ్గిందని బ్యాంక్‌ వెల్లడించింది. వేతన సెటిల్మెంట్‌ వల్ల సమీక్షా త్రైమాసికంలో రూ.152 కోట్ల ఒక్కసారి భారం పడినట్లు తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 3.74% నుంచి 3.53 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.70% నుంచి 1.58 శాతానికి పరిమితమైనట్లు వివరించింది. ఇందువల్ల కేటాయింపులు కూడా రూ.253 కోట్ల నుంచి రూ.185 కోట్లకు దిగి వచ్చినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని