ప్లేస్టోర్‌ బిల్లింగ్‌ విధానంపై విచారణ జులై 5కు వాయిదా

గూగుల్‌ ప్లేస్టోర్‌ బిల్లింగ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను జులై 5వ తేదీకి నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) వాయిదా వేసింది.

Published : 25 May 2024 02:14 IST

దిల్లీ: గూగుల్‌ ప్లేస్టోర్‌ బిల్లింగ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను జులై 5వ తేదీకి నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) వాయిదా వేసింది. పిటిషన్లపై స్వల్ప సమయం పాటు విచారణ జరిపిన ఎన్‌సీఎల్‌ఏటీ ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అండ్‌ డిజిటల్‌ ఫౌండేషన్‌ (ఐబీడీఎఫ్‌), ఇండియన్‌ డిజిటల్‌ మీడియా ఇండస్ట్రీ ఫౌండేషన్, పీపుల్‌ ఇంటరాక్టివ్‌ ఇండియా (షాదీ.కామ్‌), మెబిగో ల్యాబ్స్‌ (కుకు ఎఫ్‌ఎమ్‌)లు ప్లేస్టోర్‌ బిల్లింగ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎన్‌సీఎల్‌ఏటీలో పిటిషన్లు వేశాయి. బిల్లింగ్‌ విధాన షరతులను అంగీకరించలేదనే కారణంతో ప్లేస్టోర్‌ నుంచి యాప్‌లను తొలగించకుండా తదుపరి విచారణ వరకు యథాతథ స్థితి కొనసాగిస్తూ ఆదేశాలివ్వాల్సిందిగా ధర్మాసనాన్ని ఈ యాప్‌ సంస్థల తరపు న్యాయవాది కోరారు. దీనికి సంబంధించి గూగుల్‌ నుంచి అండర్‌టేకింగ్‌ (హామీ పత్రం) తీసుకోవాలని అడిగారు. అండర్‌టేకింగ్‌ ఇచ్చేందుకు గూగుల్‌ తరపు న్యాయవాది నిరాకరించారు. కానీ తదుపరి విచారణ వరకు యాప్‌లు తొలగించడం లాంటిది గూగుల్‌ చేయబోదని ఎన్‌సీఎల్‌ఏటీకి హామీ ఇచ్చారు. ఒకవేళ గూగుల్‌ ఏమైనా మీకు వ్యతిరేకంగా చర్యలు చేపడితే.. వేసవి సెలవుల్లో అత్యవసర విచారణ కోసం యాప్‌ సంస్థలు ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించవచ్చని ధర్మాసనం తెలిపింది. ఇన్‌-యాప్‌ చెల్లింపులపై 11-26% సుంకం వసూలు చేసేలా కొత్త ప్లేస్టోర్‌ బిల్లింగ్‌ విధానాన్ని గూగుల్‌ తీసుకొచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ భారత్‌కు చెందిన 4 యాప్‌ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కొట్టివేసింది. సీసీఐ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్‌సీఎల్‌ఏటీలో యాప్‌ కంపెనీలు పిటిషన్లు దాఖలు చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని