దేశంలోనే అతిపెద్ద ఐపీఓ?

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్‌ మోటార్, తన భారత అనుబంధ కంపెనీ అయిన హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా మెగా పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం.

Published : 25 May 2024 02:15 IST

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా సన్నాహాలు
రూ.25,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్‌ మోటార్, తన భారత అనుబంధ కంపెనీ అయిన హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా మెగా పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. ఇప్పటికే సిటీ గ్రూప్, జేపీ మోర్గాన్, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీలతో చర్చలు జరిపిన ఈ కంపెనీ, తాజాగా కోటక్‌ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్‌ స్టాన్లీలనూ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులుగా ఎంచుకున్నట్లు ఒక ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. విక్రయించే వాటా పరిమాణం, కంపెనీ తుది విలువలపై ఆధారపడి భారత్‌లోనే అతిపెద్ద ఐపీఓగా ఇది ఉండేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంది. ఇప్పటిదాకా  ఎల్‌ఐసీ 2.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.21,000 కోట్ల) ఐపీఓనే మన దేశంలో అతిపెద్ద ఐపీఓగా ఉంది. ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ ద్వారా హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా 2.5-3 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.20,750-24,900 కోట్లు) మేర సమీకరించే అవకాశం కనిపిస్తోంది. ఆ లెక్కన ఇదే అతిపెద్ద ఐపీఓ అవుతుంది.

జూన్‌ లేదా జులైలో దరఖాస్తు: తాజాగా కోటక్‌ మహీంద్రా, మోర్గాన్‌ స్టాన్లీ జతకలవడంతో.. ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు అనుమతి కోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి జూన్‌ లేదా జులైలో ముసాయిదా పత్రాల (డీఆర్‌హెచ్‌పీ)ను హ్యుందాయ్‌ సమర్పించొచ్చు. ఇది విజయవంతమైతే చాలా వరకు బహుళ జాతి కంపెనీ(ఎమ్‌ఎన్‌సీ)లు కూడా ఇదే బాట పట్టొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.  

విలువ 20 బి. డాలర్లు: ఐపీఓ కోసం హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా విలువను 20 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.66 లక్షల కోట్ల) దరిదాపుల్లో లెక్కగట్టొచ్చని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆ వార్తా సంస్థ పేర్కొంది. ‘ఇందుకు చాలా అంశాలు లెక్కలోకి వస్తాయి. ఐపీఓ పరిమాణంపై అవి ప్రభావం చూపుతాయి. తర్వాతి దశల్లో, ముసాయిదా పత్రాల దాఖలుకు ముందు చాలా వరకు అంశాల్లో స్పష్టత రావొచ్చ’ని ఆ వర్గాలు తెలిపాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని