నిఫ్టీ @ 23000

సూచీల లాభాల జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. శుక్రవారం ఇంట్రాడేలో కొత్త గరిష్ఠాలను అధిరోహించిన సెన్సెక్స్, నిఫ్టీ.. లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చాయి. నిఫ్టీ చరిత్రలో తొలిసారిగా 23,000 పాయింట్లను అధిగమించినా, మళ్లీ కిందకు వచ్చేసింది.

Published : 25 May 2024 02:21 IST

గరిష్ఠస్థాయిల్లో లాభాల స్వీకరణతో వెనక్కి
సమీక్ష

సూచీల లాభాల జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. శుక్రవారం ఇంట్రాడేలో కొత్త గరిష్ఠాలను అధిరోహించిన సెన్సెక్స్, నిఫ్టీ.. లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చాయి. నిఫ్టీ చరిత్రలో తొలిసారిగా 23,000 పాయింట్లను అధిగమించినా, మళ్లీ కిందకు వచ్చేసింది. అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు ప్రతికూల ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు తగ్గి   83.10 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.73% తగ్గి 80.77 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.419.99 లక్షల కోట్లుగా నమోదైంది.

సెన్సెక్స్‌ ఉదయం 75,335.45 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. తదుపరి లాభాల్లోకి వచ్చి, ఇంట్రాడేలో 75,636.50 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకిన సూచీ, అనంతరం మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. చివరకు 7.65 పాయింట్ల నష్టంతో 75,410.39 వద్ద ముగిసింది. నిఫ్టీ 10.55 పాయింట్లు తగ్గి   22,957.10 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 23,026.40 వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది.

  • అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ఏడాది గరిష్ఠ స్థాయులకు చేరింది. ఇంట్రాడేలో 1.91% రాణించిన షేరు రూ.3,456.25 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు రూ.3,384.65 వద్ద ముగిసింది. హిండెన్‌బర్గ్‌ నివేదికకు ముందు రూ.3434.50 వద్ద ఉన్న షేరు.. ఆ తర్వాత రూ.1,194.20కు పడిపోయింది. మళ్లీ 189% పుంజుకుని ప్రస్తుత స్థాయికి చేరింది. 
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 నష్టపోయాయి. టెక్‌ మహీంద్రా 1.18%, ఐటీసీ 1.16%, ఎం అండ్‌ ఎం 1.15%, టీసీఎస్‌ 1.14%, టైటన్‌ 1.05%, ఏషియన్‌ పెయింట్స్‌ 0.94% డీలాపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.64%, ఎల్‌ అండ్‌ టీ 1.11%,  ఎయిర్‌టెల్‌ 1.07%, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.80% లాభపడ్డాయి. 
  • సెన్సెక్స్‌లోకి అదానీ పోర్ట్స్‌: జూన్‌ 24 నుంచి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీలోకి అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ చేరనుంది. విప్రో స్థానాన్ని అదానీ పోర్ట్స్‌ భర్తీ చేయనుంది. సెన్సెక్స్‌లోకి అదానీ గ్రూప్‌ సంస్థ చేరడం ఇదే మొదటిసారి. ఇప్పటికే అదానీ పోర్ట్స్‌ షేరు నిఫ్టీ-50 సూచీలో ఉంది. 
  • 100 బి.డాలర్ల ఆదిత్య బిర్లా గ్రూప్‌: కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ 100 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8.30 లక్షల కోట్ల) మైలురాయిని అధిగమించింది. గ్రూప్‌ సంస్థలు అల్ట్రాటెక్, గ్రాసిమ్, హిందాల్కో, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, వొడాఫోన్‌ ఐడియా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, టీసీఎన్‌ఎస్‌ క్లాతింగ్, ఆదిత్య బిర్లా మనీ, సెంచురీ టెక్స్‌టైల్స్, సెంచురీ ఎంకా కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.8.51 లక్షల కోట్లుగా నమోదైంది.
  • ఆఫిస్‌ స్పేస్‌ సొల్యూషన్స్‌ ఐపీఓకు మొత్తంగా 11.40 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 86,29,670 షేర్లను ఆఫర్‌ చేయగా, 9,83,73,951 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ విభాగంలో 21.08 రెట్ల స్పందన దక్కింది.
  • ఎయిరిండియా చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి (సీఎఫ్‌ఓ)గా సంజయ్‌ శర్మ నియమితులయ్యారు. జూన్‌ 10న ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.   
  • జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ కొనుగోలు కోసం సురక్షా రియాల్టీ సమర్పించిన బిడ్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ తిరస్కరించింది. రైతులకు పరిహారంగా అదనంగా రూ.1300 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. 
  • ఈ ఏడాది జనవరిలో 10 బిలియన్‌ డాలర్ల విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు సోనీ గ్రూప్‌ 90 మి.డాలర్లు (దాదాపు రూ.748.7 కోట్లు) ఫీజు చెల్లించాలని జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌ కోరింది. సోనీ గ్రూప్‌ సంస్థలు కల్వర్‌ మ్యాక్స్, బంగ్లా ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి లావాదేవీ రద్దు ఫీజును కోరుతున్నట్లు ఎక్స్ఛేంజీలకు జీ తెలిపింది.
  • దీర్ఘకాల బరువు నిర్వహణ చికిత్సలో వినియోగించే ఔషధం కోసం హండాక్‌తో లైసెన్సింగ్, సరఫరా ఒప్పందాన్ని బయోకాన్‌ కుదుర్చుకుంది.

నేటి బోర్డు సమావేశాలు: దివీస్‌ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా, ఆంధ్రా పెట్రోకెమికల్స్, పరాస్‌ డిఫెన్స్, ఆల్‌కార్గో లాజిస్టిక్స్, రిలయన్స్‌ పవర్‌

జీవనకాల గరిష్ఠానికి ఫారెక్స్‌ నిల్వలు: మే 17తో ముగిసిన వారానికి మన విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు 4.549 బి.డాలర్లు (దాదాపు రూ.38,000 కోట్లు) పెరిగి జీవనకాల సరికొత్త గరిష్ఠమైన 648.7 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.53.84 లక్షల కోట్ల)కు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. అంతక్రితం వారం ఫారెక్స్‌ నిల్వలు 644.151 బి.డాలర్లుగా ఉన్నాయి. సమీక్షిస్తున్న వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 3.361 బి.డాలర్లు పెరిగి 569.009 బి.డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి నిల్వలు 1.244 బి.డాలర్లు అధికమై 57.195 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు (ఎస్‌డీఆర్‌లు) 113 మిలియన్‌ డాలర్లు పెరిగి 18.168 బిలియన్‌ డాలర్లకు చేరగా, ఐఎంఎఫ్‌ వద్ద దేశ నిల్వల స్థానం 168 మిలియన్‌ డాలర్లు తగ్గి 4.327 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని