అదానీ బొగ్గు దిగుమతి కేసును సత్వరం తేల్చండి

ఇండోనేషియా నుంచి తక్కువ నాణ్యత గల బొగ్గును దిగుమతి చేసుకుని, అధిక ధరకు అదానీ గ్రూపు విక్రయించిందనే ఆరోపణలపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణను వేగవంతం చేయాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డి.వై.చంద్రచూడ్‌కు 21 అంతర్జాతీయ సంస్థలు లేఖ రాశాయి.

Published : 25 May 2024 02:22 IST

సీజేఐకు 21 విదేశీ సంస్థల లేఖ

దిల్లీ: ఇండోనేషియా నుంచి తక్కువ నాణ్యత గల బొగ్గును దిగుమతి చేసుకుని, అధిక ధరకు అదానీ గ్రూపు విక్రయించిందనే ఆరోపణలపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణను వేగవంతం చేయాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డి.వై.చంద్రచూడ్‌కు 21 అంతర్జాతీయ సంస్థలు లేఖ రాశాయి. ఈ కేసును డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ దాఖలు చేసింది. 2013లో తక్కవ గ్రేడ్‌ బొగ్గును దిగుమతి చేసుకుని, అధిక విలువకు విక్రయించడం ద్వారా అదానీ గ్రూపు మోసానికి పాల్పడిందంటూ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్టు (ఓసీసీఆర్‌పీ) నివేదికను ఉటంకిస్తూ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనాన్ని ప్రచురించింది. ఈ పరిణామం అనంతరమే సీజీఐకు విదేశీ సంస్థలు లేఖ రాశాయి. 

  • అత్యంత నాణ్యమైన, పర్యావరణ హితమైన ఇంధనంగా పేర్కొంటూ, తక్కువ నాణ్యమైన బొగ్గును అధిక ధరకు తమిళనాడు జనరేషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ (ట్యాన్‌జెడ్‌కో)కి అదానీ గ్రూపు విక్రయించిందనే కేసు వ్యవహారంలో మరిన్ని కొత్త సాక్ష్యాలను నివేదిక అందించిందని ఆ సంస్థలు వెల్లడించాయి. ఈ 21 సంస్థల్లో ఆస్ట్రేలియా సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ జస్టిస్, బ్యాంక్‌ట్రాక్, బాబ్‌ బ్రౌన్‌ ఫౌండేషన్, లండన్‌ మైనింగ్‌ నెట్‌వర్క్, సన్‌రైజ్‌ మూమెంట్, స్టాప్‌ అదానీ, క్వీన్స్‌లాండ్‌ కన్జర్వేషన్‌ కౌన్సిల్‌ లాంటివి ఉన్నాయి.
  • అదానీ గ్రూపు ఈ ఆరోపణలను ఖండించగా.. ఆ వార్తా కథనాన్ని ఆధారంగా చేసుకొని రాహుల్‌ గాంధీ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తున్నారు. 

అదానీ సంస్థల్లో పెట్టుబడులపై రాజీవ్‌ జైన్‌కు 150% ప్రతిఫలం

ఏడాదికాలంలోనే ఆర్జించిన జీక్యూజీ పార్ట్‌నర్స్‌ ఛైర్మన్‌

దిల్లీ: ఏడాదికాలంగా అదానీ గ్రూపు సంస్థల్లో జీక్యూజీ పార్ట్‌నర్స్‌ ఛైర్మన్, ముఖ్య పెట్టుబడుల అధికారి రాజీవ్‌ జైన్‌ పెట్టిన పెట్టుబడులు దాదాపు 150% ప్రతిఫలాన్ని అందించాయి. 2023 జనవరిలో అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం, అదానీ గ్రూపు సంస్థల షేర్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జీక్యూజీ పార్ట్‌నర్స్‌ సంస్థ ద్వారా జైన్‌ వ్యూహాత్మకంగా అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చారు. 2023 మార్చిలో అదానీ గ్రూపునకు చెందిన 4 ప్రధాన కంపెనీలు- అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (ఏఈఎల్‌)లో రూ.5,400 కోట్లు, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌లో రూ.5,300 కోట్లు, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సొల్యూషన్స్‌ (ఏఈఎస్‌ఎల్‌)లో రూ.1,900 కోట్లు, అదానీ గ్రీన్‌ ఎనర్జీలో రూ.2,850 కోట్లు చొప్పున మొత్తంగా రూ.15,400 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. ఈ పెట్టుబడి విలువ ఇప్పుడు సుమారు రూ.40,000 కోట్లకు చేరింది. 

  • 2023 జూన్‌లో ఏఈఎల్‌లో రూ.4,100 కోట్లు, ఏఈఎస్‌ఎల్‌లో రూ.2,650 కోట్లు, అదానీ గ్రీన్‌ ఎనర్జీలో రూ.4,600 కోట్ల చొప్పున మొత్తం రూ.11,350 కోట్లను జైన్‌ పెట్టుబడిగా పెట్టారు. ఈ పెట్టుబడుల విలువ కూడా ప్రస్తుతం సుమారు రూ.19,500 కోట్లకు చేరింది. 
  • 2023 ఆగస్టులో అదానీ పవర్‌లో రూ.8,700 కోట్లను జైన్‌ పెట్టుబడిగా పెట్టగా.. ఈ విలువ సుమారు రూ.22,500 కోట్లకు పెరిగింది. 
  • మొత్తంగా చూస్తే రూ.35,450 కోట్ల జైన్‌ పెట్టుబడి విలువ ఇప్పుడు సుమారు రూ.82,000 కోట్లకు చేరింది. అంటే సుమారు 150% వరకు పెరిగిందన్నమాట. అదానీ గ్రూపు కంపెనీల్లోనే కాకుండా.. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్, పతంజలి ఆయుర్వేద్, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్, వొడాఫోన్‌ ఐడియాలోనూ జీక్యూజీ పార్ట్‌నర్స్‌కు పెట్టుబడులు ఉన్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని