సంక్షిప్త వార్తలు

అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న గో ఫస్ట్‌ను దక్కించుకునేందుకు ఫిబ్రవరిలో దాఖలు చేసిన బిడ్‌ను 3 నెలల తర్వాత బిజీ బీ ఎయిర్‌వేస్‌ ఉపసంహరించుకుంది.

Published : 26 May 2024 02:49 IST

బిజీ బీ ఎయిర్‌వేస్‌ బిడ్‌ ఉపసంహరణ
గో ఫస్ట్‌ దివాలా ప్రక్రియ వ్యవహారం

దిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న గో ఫస్ట్‌ను దక్కించుకునేందుకు ఫిబ్రవరిలో దాఖలు చేసిన బిడ్‌ను 3 నెలల తర్వాత బిజీ బీ ఎయిర్‌వేస్‌ ఉపసంహరించుకుంది. ఈ ఎయిర్‌వేస్‌లో ఈజ్‌మైట్రిప్‌ సీఈఓ నిశాంత్‌ పిట్టికి మెజార్టీ వాటా ఉంది. అలాగే స్పైస్‌జెట్‌ అధినేత అజయ్‌ సింగ్‌కు కూడా వాటా ఉంది. అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత బిడ్‌ను ఉపసంహరించుకోవాలని తన వ్యక్తిగత హోదాలో నిర్ణయించుకున్నట్లు పిట్టి వెల్లడించారు. ఇతర వ్యూహాత్మక ప్రాధాన్యాలపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం సహకరిస్తుందని పేర్కొన్నారు.


రిలయన్స్‌ పవర్‌ నష్టం రూ.398 కోట్లు 

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రిలయన్స్‌ పవర్‌ రూ.397.66 కోట్ల ఏకీకృత నష్టాన్ని ప్రకటించింది. ఇంధన వ్యయాలు రూ.823.47 కోట్ల నుంచి రూ.953.67 కోట్లకు పెరగడమే ఇందుకు కారణం. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.321.79 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.1,853.32 కోట్ల నుంచి రూ.2,193.85 కోట్లకు చేరింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర నష్టం రూ.470.77 కోట్ల నుంచి రూ.2,068.38 కోట్లకు పెరగడం గమనార్హం. విదేశీ కరెన్సీ మార్పిడి బాండ్లు (ఎఫ్‌సీసీబీలు), క్యూఐపీ ద్వారా సెక్యూరిటీల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది. సెబీ నియమ నిబంధనలు, మార్గదర్శకాలు, చట్టాలకు లోబడి వీటి జారీ ఉండనుంది. ప్రస్తుతం రిలయన్స్‌ పవర్‌ 6,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆస్తులను కలిగి ఉంది.


ఎన్‌హెచ్‌ఏఐ రహదారి ఆస్తుల నగదీకరణతో ప్రభుత్వానికి రూ.60,000 కోట్లు: ఇక్రా

దిల్లీ: ప్రభుత్వ రంగ భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) యాజమాన్యంలోని కొన్ని రహదారి ఆస్తులను నగదీకరించడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రభుత్వానికి రూ.60,000 కోట్లు సమకూరే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. 2024 ఏప్రిల్‌లో ఎన్‌హెచ్‌ఏఐ తన 33 రహదారి ఆస్తులను 2024-25లో నగదీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. టోల్‌-నిర్వహణ-బదిలీ (టీఓటీ), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్విట్‌)ల ద్వారా వీటిని నగదీకరించనున్నట్లు తెలిపింది. ఈ రహదారి ఆస్తులు 12 రాష్ట్రాల్లో సుమారు రూ.2,750 కిలోమీటర్లు విస్తరించి ఉండటంతో పాటు వార్షిక టోల్‌ వసూళ్లు రూ.4,931 కోట్లు వసూలు చేస్తున్నాయని ఇక్రా పేర్కొంది. టీఓటీ/ఇన్విట్‌ పద్ధతిలో నగదీకరించనున్న 33 రహదారి ఆస్తుల ద్వారా రూ.53,000-60,000 కోట్లు ఖజానాకు అందుతాయని ఇక్రా అంచనా వేసింది. ఇందులో పెద్ద (రూ.6,000 కోట్లకు పైగా), మధ్య (రూ.3,000-4,000 కోట్లు), చిన్న (రూ.1,000-3,000 కోట్లు) స్థాయి రహదారి ఆస్తులు ఉన్నాయి. ప్రభుత్వం 2021-22 నుంచి 2024-25 వరకు జాతీయ నగదీకరణ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ)లో భాగంగా రహదారి రంగ నగదీకరణ ద్వారా రూ.1.6 లక్షల కోట్లు సమకూర్చుకోవాలనుకుంది. తాజాగా నగదీకరణతో రూ.53,000-60,000 కోట్లు లభిస్తే లక్ష్యంలో 65-71 శాతం సాధించినట్లు అవుతుందని ఇక్రా పేర్కొంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని