సెన్సెక్స్, నిఫ్టీ @ 1,50,000!

భారత స్టాక్‌ మార్కెట్ల దూకుడుపై మోతీలాల్‌ ఓస్వాల్‌్ గ్రూపు ఛైర్మన్‌ రామ్‌దేవ్‌ అగర్వాల్‌ ఆశ్చర్యకర అంచనాను వెలిబుచ్చారు.

Published : 26 May 2024 02:51 IST

మోతీలాల్‌ ఓస్వాల్‌ ఛైర్మన్‌ అంచనా

దిల్లీ: భారత స్టాక్‌ మార్కెట్ల దూకుడుపై మోతీలాల్‌ ఓస్వాల్‌్ గ్రూపు ఛైర్మన్‌ రామ్‌దేవ్‌ అగర్వాల్‌ ఆశ్చర్యకర అంచనాను వెలిబుచ్చారు. బీఎస్‌ఈ ప్రామాణిక సూచీ అయిన సెన్సెక్స్‌ వచ్చే 5-6 ఏళ్లలో 1,50,000 పాయింట్ల మైలురాయిని చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. నిఫ్టీ ఈ స్థాయిని చేరేందుకు మరో 15-17 ఏళ్ల సమయం పట్టొచ్చని ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ 75,000 పాయింట్లు, నిప్టీ 23,000 పాయింట్ల వద్ద కదలాడుతున్నాయి. ఆయన వెలిబుచ్చిన ప్రకారం చూస్తే.. సెన్సెక్స్‌ మరో 5-6 ఏళ్లలో రెట్టింపు మేర పెరిగే అవకాశం ఉందన్నమాట. ‘స్టాక్‌ మార్కెట్లో లాభాలు సంపాదించాలంటే దూరదృష్టి, ధైర్యం, సహనం ఉండాలి. ముఖ్యంగా సహనం. అప్పుడే మనం మార్కెట్లో ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కోగల్గుతాం’ అని అగర్వాల్‌ వివరించారు. ఒకవేళ ఏవైనా ప్రతికూల పరిణామాలు ఎదురైతే 2030 నాటికి, ఎదురుకాకుంటే 2028 కల్లా సెన్సెక్స్‌ 1,50,000 పాయింట్ల మైలురాయిని అందుకుంటుందని ఆయన అంచనా వేశారు. 

ఎన్నికల ఫలితాలపై ఆత్రుత వద్దు: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై మరీ ఎక్కువగా ఆత్రుత పడవద్దని మదుపర్లకు అగర్వాల్‌  సూచించారు. ‘జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి. కానీ నా పెట్టుబడి వ్యూహాల్లో ఎటువంటి మార్పు ఉండదు. జూన్‌ 4న వచ్చే ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా ఆ ముందు రోజైన జూన్‌ 3న, తర్వాతి రోజైన జూన్‌ 5న నా పెట్టుబడి నిర్ణయాలు యథావిధిగానే కొనసాగుతాయ’ని ఆయన తెలిపారు. మేలో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) అమ్మకాల బాట పట్టడంపై ఆయన స్పందిస్తూ.. భారత మార్కెట్‌లో ఎఫ్‌ఐఐలు తిరిగి కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడగానికి కొంత సమయం పడుతుందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడడం వల్లే భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుతం మదుపర్లు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారని ఆయన విశ్లేషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని