దివీస్‌ లాభం రూ.531 కోట్లు

దివీస్‌ లేబొరేటరీస్‌ ఆకర్షణీయమైన ఫలితాలను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఈ సంస్థ రూ.2,338 కోట్ల ఆదాయాన్ని, రూ.531 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.

Published : 26 May 2024 02:54 IST

వాటాదార్లకు రూ.30 డివిడెండ్‌
స్వతంత్ర డైరెక్టర్‌గా డాక్టర్‌ రాజేంద్ర కుమార్‌ ప్రేమ్‌చంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: దివీస్‌ లేబొరేటరీస్‌ ఆకర్షణీయమైన ఫలితాలను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఈ సంస్థ రూ.2,338 కోట్ల ఆదాయాన్ని, రూ.531 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.1,974 కోట్లు, నికరలాభం రూ.319 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే నికరలాభం 66.5 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలానికి దివీస్‌ లేబొరేటరీస్‌ రూ. 8,002 కోట్ల ఆదాయాన్ని, రూ.1,576 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.7,974 కోట్లు కాగా, నికరలాభం రూ.1,808 కోట్లుగా ఉంది. 

వాటాదార్లకు రూ.2 ముఖ విలువ కల ఒక్కో షేరుపై 1500 శాతం డివిడెండు చెల్లించాలని సంస్థ యాజమాన్యం ప్రతిపాదించింది. దీని ప్రకారం ఒక్కో షేరుకు రూ.30 చొప్పున డివిడెండు లభిస్తుంది. ఇందుకు ఆగస్టు 2ను రికార్డు తేదీగా నిర్ణయించారు. కంపెనీ 34వ వాటాదార్ల వార్షిక సమావేశం (ఏజీఎం) ఈ ఏడాది ఆగస్టు 12న నిర్వహించాలని నిర్ణయించారు. వైద్యుడిగా విశేష అనుభవం ఉన్న డాక్టర్‌ రాజేంద్ర కుమార్‌ ప్రేమ్‌చంద్‌ను కంపెనీ బోర్డులో 5 ఏళ్ల కాలానికి స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించారు. కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్, ఎండీ (జనరల్‌ మెడిసిన్‌), నిమ్స్‌లో డీఎం (కార్డియాలజీ) చదివిన ఆయన కార్డియాలజిస్ట్‌గా ఎంతోకాలంగా సేవలు అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని