వయాకామ్‌ 18, స్టార్‌ ఇండియాల విలీనం!

వయాకామ్‌ 18 - స్టార్‌ ఇండియా ప్రై.లి. (ఎస్‌ఐపీఎల్‌)ల విలీనానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అనుమతి కోరింది.

Published : 26 May 2024 02:55 IST

రూ.70,550 కోట్ల విలీన ప్రతిపాదన
సీసీఐ ఆమోదం కోరిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

దిల్లీ: వయాకామ్‌ 18 - స్టార్‌ ఇండియా ప్రై.లి. (ఎస్‌ఐపీఎల్‌)ల విలీనానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అనుమతి కోరింది. ఈ ప్రతిపాదిత లావాదేవీతో మీడియా వ్యాపారాలను విలీనం చేయబోతోంది. ఆర్‌ఐఎల్‌కు చెందిన వయాకామ్‌ 18, ద వాల్ట్‌ డిస్నీ కంపెనీ (టీడబ్ల్యూడీసీ) యాజమాన్యంలోని ఎస్‌ఐపీఎల్‌లు విలీనం కాబోతున్నాయి. ఈ లావాదేవీ విలువ 8.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.70,550 కోట్లు). ఈ విలీన లావాదేవీ వల్ల దేశంలోని మీడియా వ్యాపారాల్లో పోటీ వాతావరణానికి ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని సీసీఐకి ఆర్‌ఐఎల్‌ తెలిపింది.

దేశంలో ఎస్‌ఐపీఎల్‌ సంస్థ పలు టీవీ ఛానళ్లతోపాటు ఓటీటీ ప్లామ్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ను నిర్వహిస్తోంది. వయాకామ్‌ 18 కూడా బ్రాడ్‌కాస్టింగ్‌ టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమాను నడుపుతోంది. దీంతో పాటు ప్రొడక్షన్, మోషన్‌ పిక్చర్స్‌ పంపిణీ రంగంలోనూ ఉంది. ఇరు సంస్థలను కలిపి సంయుక్త సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలయన్స్, వాల్ట్‌ డిస్నీ ఒప్పందం చేసుకున్నాయి. ఇది పూర్తయితే వివిధ భాషల్లో వందకు పైగా ఛానళ్లు, 2 ఓటీటీలు విలీన సంస్థ చేతిలో ఉంటాయి. ఈ జేవీకి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఈ సంయుక్త సంస్థలో 63.13 శాతం వాటా రిలయన్స్‌కు, 36.84 శాతం వాటా వాల్ట్‌ డిస్నీకి ఉంటుంది. విలీనం అనంతరం ఓటీటీ వ్యాపార అభివృద్ధికి ఆర్‌ఐఎల్‌ రూ.11,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని