ఎంబీఏ పట్టభద్రుల్లో వలసల రేటు అధికంగానే

ఎంబీఏ పట్టభద్రుల్లో వలసల రేటు అధికంగా కొనసాగుతుండటం ఆందోళనకర అంశమని ఓ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ప్రధాన ప్రాంగణాల నుంచి నియమితులైన ప్రారంభ స్థాయి ఉద్యోగుల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంది.

Published : 26 May 2024 02:56 IST

డెలాయిట్‌ నివేదిక

దిల్లీ: ఎంబీఏ పట్టభద్రుల్లో వలసల రేటు అధికంగా కొనసాగుతుండటం ఆందోళనకర అంశమని ఓ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ప్రధాన ప్రాంగణాల నుంచి నియమితులైన ప్రారంభ స్థాయి ఉద్యోగుల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంది. డెలాయిట్‌ ఇండియా ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం.. దేశవ్యాప్తంగా మొదటి శ్రేణి (టైర్‌ 1) కళాశాల ప్రాంగణాల నుంచి కొత్తగా నియమితులైన వారిలో వలసల రేటు 21 శాతం కాగా.. ఉద్యోగంలో చేరి ఒకటి, రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగుల్లో ఇది వరుసగా 26%, 28 శాతంగా ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంగణాల్లో కొత్తగా నియమితులైన ఉద్యోగులు ఏడాది, రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగుల వలసల రేటు వరుసగా 19%, 21%, 25 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. ‘ఉద్యోగులు ముఖ్యంగా ఎంబీఏ పట్టభద్రులను అట్టేపెట్టుకునే విషయంలో కంపెనీలు పునరాలోచన చేయడం అత్యంత ముఖ్యమనే విషయాన్ని ఈ నివేదిక గుర్తించింది. వీళ్లలో వలసల రేటు అధికంగా ఉండటం జాగ్రత్త పడాల్సిన అంశమే. వినూత్న విధానాలు దీర్ఘకాలం పాటు పనిచేయవు. పోటీ మార్కెట్‌లో నైపుణ్యవంతులను అట్టేపెట్టుకోవడం ముఖ్యం’ అని డెలాయిట్‌ ఇండియా డైరెక్టర్‌ నీలేశ్‌ గుప్తా తెలిపారు. 190 సంస్థలు, 500 ప్రాంగణాల నుంచి వివరాలు సేకరించి ఈ నివేదికను రూపొందించారు. ఇందులో ముఖ్యాంశాలు ఇలా..

  • ప్రతి ఐదుగురు ఉన్నతాధికార్లలో నలుగురు నియామకాలు, వేతనం, ప్రోత్సాహకాలపై నిర్ణయాల్లో నైపుణ్యాలకే ప్రాధాన్యమిస్తున్నారు. దీనివల్ల పక్షపాత ధోరణి తగ్గుతోందని పారదర్శకత పెరుగుతోందని నివేదిక పేర్కొంది. 
  • డిజిటల్‌ యుగంలో విజయవంతం కావాలంటే బహుళ నైపుణ్యాలను కలిగి ఉండేలా విద్యార్థులను విద్యా సంస్థలు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని గుప్తా తెలిపారు. 
  • వలసల రేటు అధికంగా ఉన్నప్పటికీ.. 70 శాతం సంస్థల నుంచి ఎంబీఏ పట్టభద్రులకు గిరాకీ ఎక్కువగానే ఉందని నివేదిక తెలిపింది. సంస్థల వ్యాపార విజయవంతంలో ఎంబీఏ పట్టభద్రులకున్న ప్రాధాన్యాన్ని ఇది తెలియజేస్తోందని పేర్కొంది. అలాగే గత ఐదేళ్లలో వీరి పారితోషికంలోనూ 5.2 శాతం వార్షిక వృద్ధి ఉందని పేర్కొంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని