మోసపూరిత అంతర్జాతీయ కాల్స్‌ను నిరోధించండి

విదేశాల నుంచి కాల్‌ చేసినా, భారత మొబైల్‌ నంబరులా చూపించే మోసపూరిత అంతర్జాతీయ కాల్స్‌ను స్తంభింప చేయాలని టెలికాం సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.

Published : 27 May 2024 02:57 IST

టెలికాం సంస్థలకు ప్రభుత్వ ఆదేశం

దిల్లీ: విదేశాల నుంచి కాల్‌ చేసినా, భారత మొబైల్‌ నంబరులా చూపించే మోసపూరిత అంతర్జాతీయ కాల్స్‌ను స్తంభింప చేయాలని టెలికాం సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. మన దేశీయులకు విదేశాల నుంచి కాల్‌ చేసి కూడా, స్థానిక మొబైల్‌ నంబర్‌గా భ్రమింప చేస్తున్న మోసగాళ్లు సైబర్‌ నేరాలు, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని టెలికాం విభాగం (డాట్‌) పేర్కొంది. మనకు ఎక్కడి నుంచి కాల్‌ వచ్చిందో తెలిపే కాలింగ్‌ లైన్‌ ఐడెంటిటీ (సీఎల్‌ఐ)ని తారుమారు చేయడం ద్వారా, మోసగాళ్లు ఇలా చేస్తున్నారని వివరించింది. ప్రభుత్వ, పోలీసు అధికారులుగా నమ్మబలుకుతూ ‘మీరు తప్పు చేసినందున.. అరెస్ట్‌ చేస్తామని బెదిరింపులు’, ఫెడెక్స్‌ - ఇతర కొరియర్‌లలో మీరు పంపిన/మీకు వచ్చిన పార్శిల్‌లో డ్రగ్స్‌ ఉన్నాయని బెదిరించడం.. అరెస్ట్‌ నివారించేందుకంటూ డబ్బును బదిలీ చేయించుకుంటున్నారని వివరించింది. ఇటువంటి కాల్స్‌ను గుర్తించి, స్తంభింప చేసేందుకు డాట్, టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌లు వ్యవస్థను ఏర్పాటు చేశాయని డాట్‌ వెల్లడించింది. ఇప్పటికే దేశీయ ల్యాండ్‌లైన్‌ నంబర్లకు ఇలాంటి నంబర్లు రాకుండా నిరోధించినట్లు తెలిపింది. మోసపూరిత కాల్స్‌ వస్తే ‘సంచార్‌ సాథి’ ద్వారా ఫిర్యాదు చేయాలని డాట్‌ కోరింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని