మార్చి త్రైమాసిక వృద్ధి 6.1-6.7 శాతం!

దేశ జీడీపీ వృద్ధి 2023-24 నాలుగో త్రైమాసికంలో 6.1-6.7 శాతంగా నమోదు కావొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సర తొలి 3 త్రైమాసికాల్లో (ఏప్రిల్‌-జూన్, జులై-సెప్టెంబరు, అక్టోబరు-డిసెంబరు) జీడీపీ వృద్ధి 8 శాతానికి పైగా నమోదైన సంగతి విదితమే.

Published : 27 May 2024 02:59 IST

ఆర్థిక వేత్తల అంచనా 

దిల్లీ: దేశ జీడీపీ వృద్ధి 2023-24 నాలుగో త్రైమాసికంలో 6.1-6.7 శాతంగా నమోదు కావొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సర తొలి 3 త్రైమాసికాల్లో (ఏప్రిల్‌-జూన్, జులై-సెప్టెంబరు, అక్టోబరు-డిసెంబరు) జీడీపీ వృద్ధి 8 శాతానికి పైగా నమోదైన సంగతి విదితమే. ఈ నెల 31న మార్చి త్రైమాసిక, పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అధికారిక గణాంకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.6-7.8 శాతం మధ్య నమోదు కావొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

త్రైమాసికం వృద్ధి (%)

ఏప్రిల్‌-జూన్‌ 8.2
జులై-సెప్టెంబరు 8.1
అక్టోబరు-డిసెంబరు 8.4
జనవరి-మార్చి 6.1-6.7 (అంచనా)

  • ‘జనవరి-మార్చిలో తయారీ కార్యకలాపాలు, నిర్మాణ సంబంధిత, పెట్టుబడుల విభాగాలు మంచి పని తీరు కనబరిచాయి. అయితే వ్యవసాయ రంగం వెనక్కి లాగింది. దీంతో జీడీపీ వృద్ధి మార్చి త్రైమాసికంలో 6.1 శాతంగా నమోదు కావొచ్చు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7.6% వృద్ధి నమోదు కావొచ్చ’ని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ముఖ్య ఆర్థిక వేత్త ఉపాసన భరద్వాజ్‌ అంచనా వేశారు.
  • 2024-25లో దేశ వృద్ధిరేటు సుమారు 7 శాతం కావొచ్చని ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారు డీకే శ్రీవాత్సవ అంచనా వేశారు. 2023-24 నాలుగో త్రైమాసికంలో 6.5%, పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐఎంఎఫ్‌ అంచనా వేసిన 7.8 శాతం వృద్ధిని అధిగమించొచ్చని పేర్కొన్నారు.
  • ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ మార్చి త్రైమాసికంలో 6.2% వృద్ధిని అంచనా వేసింది. దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా 6.7 శాతంగా అంచనా వేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7.8% వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్‌లో ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఇఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే.
  • 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.1 శాతంగా నమోదైంది.  2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి 7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని