సంక్షిప్త వార్తలు(5)

షేర్లు లేదా సెక్యూరిటీలను అర్హులైన సంస్థాగత మదుపర్లకు కేటాయించడం ద్వారా రూ.12,500 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ సోమవారం వెల్లడించింది.

Published : 28 May 2024 02:24 IST

రూ.12,500 కోట్ల నిధుల సమీకరణకు అదానీ ఎనర్జీ బోర్డు ఆమోదం

దిల్లీ: షేర్లు లేదా సెక్యూరిటీలను అర్హులైన సంస్థాగత మదుపర్లకు కేటాయించడం ద్వారా రూ.12,500 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ సోమవారం వెల్లడించింది. కంపెనీ బోర్డు సోమవారం సమావేశమై, నిధుల సమీకరణ అంశంపై చర్చిస్తుందని గత వారం బీఎస్‌ఈకి సంస్థ సమాచారమిచ్చింది. నిధుల సమీకరణకు కారణాలు, ఇష్యూ ధర వంటి వివరాలను మాత్రం ప్రకటించలేదు.

అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డు కూడా నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు నేడు (మంగళవారం) సమావేశం కానుంది. ఈ విషయాన్ని కూడా గత వారమే సంస్థ బీఎస్‌ఈకి తెలిపింది.


క్యూఐపీ పద్ధతిలో వేదాంతా రూ.8,500 కోట్ల సమీకరణ!

దిల్లీ: అర్హులైన సంస్థాగత మదుపరు (క్యూఐపీ)లకు షేర్ల జారీ ద్వారా రూ.8,500 కోట్లు సమీకరించే అంశాన్ని అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంతా లిమిటెడ్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. వాటాదార్ల అనుమతి లభిస్తే రాబోయే కొన్ని వారాల్లో ఈ క్యూఐపీని వేదాంతా చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లు రాణిస్తుండటాన్ని అనుకూలంగా మల్చుకోవాలన్నదే దీని వెనక కంపెనీ ఉద్దేశంగా పేర్కొన్నాయి. ఇందుకోసం యాక్సిస్‌ బ్యాంకు అనుబంధ సంస్థ యాక్సిస్‌ కేపిటల్, సిటీ గ్రూపు లాంటి అడ్వయిజర్‌ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నాయి. మధ్య ప్రాచ్య ఫండ్స్‌ సహా పలు పెట్టుబడి సంస్థలను ఆకర్షించే పనిలోనూ వేదాంతా ఉన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది వేదాంతా షేరు 78% రాణించడంతో, కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,70,730.44 కోట్లుగా ఉంది.  


హెచ్‌బీఎల్‌ పవర్‌ లాభం రూ.70.58 కోట్లు  

ఈనాడు, హైదరాబాద్‌: హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్, మార్చి త్రైమాసికానికి రూ.604.28 కోట్ల ఆదాయంపై రూ.70.58 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదేకాలంలో రూ.397.80 కోట్ల ఆదాయంపై రూ.34.83 కోట్ల లాభం నమోదు చేసింది. దీంతో పోల్చి చూస్తే ఈసారి నికరలాభం రెట్టింపయ్యింది. ఆదాయం దాదాపు 50% పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి ఈ సంస్థ రూ.2,209 కోట్ల ఆదాయాన్ని, రూ.263.78 కోట్ల  నికరలాభాన్ని,  రూ.9.46 ఈపీఎస్‌ నమోదు చేసింది. 2022-23లో ఆదాయం రూ.1,249.74 కోట్లు, నికరలాభం 95.53 కోట్లు ఉన్నాయి. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు 50 పైసలు డివిడెండ్‌ చెల్లించాలని యాజమాన్యం ప్రతిపాదించింది. 


ఎన్‌ఎండీసీ లాభం రూ.1416 కోట్లు 

దిల్లీ: ప్రభుత్వరంగ ఇనుప ఖనిజం గనుల సంస్థ ఎన్‌ఎండీసీ, మార్చి త్రైమాసికంలో రూ.1415.62 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.2276.94 కోట్ల కంటే ఇది 38% తక్కువ. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.5842.52 కోట్ల నుంచి రూ.6908.37 కోట్లకు పెరిగింది. వ్యయాలూ రూ.3794.18 కోట్ల నుంచి రూ.4519.64 కోట్లకు చేరాయి. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.5571.25 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 లాభం రూ.5537.72 కోట్ల కంటే ఎక్కువే. 


అపర్ణ వాణిజ్య సముదాయాలు రూ.284 కోట్ల పెట్టుబడులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇప్పటివరకు నివాస సముదాయాలు నిర్మిస్తున్న అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కొత్తగా వాణిజ్య సముదాయాల నిర్మాణంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌ నల్లగండ్ల ప్రాంతంలో అపర్ణ నియో మాల్, అపర్ణ సినిమాస్‌ పేరుతో కొత్త ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. 3.67 ఎకరాల స్థలంలో, 3.5 లక్షల చదరపు అడుగుల్లో నియో మాల్‌ కోసం రూ.252 కోట్లు, అపర్ణ సినిమాస్‌ కోసం రూ.32 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు సంస్థ డైరెక్టర్‌ రాకేశ్‌ రెడ్డి తెలిపారు. 2027 నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో 4 మాల్స్‌ ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. నివాస గృహాల నిర్మాణంలో 20%, వాణిజ్య స్థలాల అభివృద్ధిలో 10% వృద్ధి సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. నల్లగండ్ల మాల్‌ సమీపంలో 25కు పైగా గేటెడ్‌ కమ్యూనిటీలు, 70కి పైగా ఐటీ కంపెనీలున్నాయన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని