నిబంధనలకు అనుగుణంగానే షేర్ల విక్రయం

షేర్లను నిబంధనలకు అనుగుణంగానే, బోర్డు ఆమోదంతో విక్రయించినట్లురెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఈఎల్‌) ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ రష్మి సలూజా తెలిపారు.

Published : 29 May 2024 03:18 IST

ఆర్‌ఈఎల్‌ ఛైర్‌పర్సన్‌ రష్మి సలూజా

దిల్లీ: షేర్లను నిబంధనలకు అనుగుణంగానే, బోర్డు ఆమోదంతో విక్రయించినట్లురెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఈఎల్‌) ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ రష్మి సలూజా తెలిపారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలను ఉల్లంఘించి సలూజా షేర్లను విక్రయించారని బర్మర్‌ కుటుంబం ఈ నెల ప్రారంభంలో ఫిర్యాదులు చేసింది. ఎక్స్ఛేంజీల వద్ద ఉన్న సమాచారం ప్రకారం, సలూజా మార్చి 26న 6.18 లక్షల షేర్లను, 27న 6.70 లక్షల షేర్లను, 28న 7.21 లక్షల షేర్లను విక్రయించారు. ఈ లావాదేవీల తర్వాత ఆర్‌ఈఎల్‌లో సలూజా హోల్డింగ్‌ 1.23% నుంచి 0.81 శాతానికి తగ్గింది. ‘బోర్డు, నామినేషన్, రెమ్యునరేషన్‌ కమిటీ (ఎన్‌ఆర్‌సీ) ఆమోదంతోనే షేర్లను విక్రయించాను. బోర్డు, స్వతంత్ర సభ్యులు నిబంధనలకు అనుగుణంగానే నా ప్రతిపాదనను ఆమోదించారు. అందుకే షేర్ల విక్రయంలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేద’ని సలూజా పేర్కొన్నారు. ఆర్‌ఈఎల్‌లో బర్మన్‌ కుటుంబానికి 4 సంస్థల ద్వారా సుమారు 25% వాటా ఉంది. ఎంబీ ఫిన్‌మార్ట్, పురన్‌ అసోసియేట్స్, వీఐసీ ఎంటర్‌ప్రైజెస్, మిల్కీ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రేడింగ్‌ కంపెనీల ద్వారా ఈ వాటా ఉండగా, 2023 సెప్టెంబరు 25న మరో 26% వాటా కొనుగోలుకు పబ్లిక్‌ వాటాదార్లకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. కంపెనీలో నియంత్రిత వాటా కోసం రూ.2,116 కోట్లతో ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటిస్తున్నామని, తమ కుటంబ ప్రతినిధి ద్వారా సమాచారమిచ్చినా సలూజా 12.9 లక్షల షేర్లను విక్రయించారని గత ఏడాది బర్మన్‌ కుటుంబం సెబీకి ఫిర్యాదు చేసింది. దీనిపై రష్మి సలూజా తాజాగా స్పందిస్తూ తన షేర్లను బోర్డు ఆమోదంతో నిబంధనలకు అనుగుణంగానే విక్రయించానని స్పష్టత ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని