సంక్షిప్తవార్తలు(6)

పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.563 కోట్ల ఆర్డర్‌ లభించింది. ఒక అణు విద్యుత్తు ప్లాంటు నిర్మాణం నిమిత్తం బీహెచ్‌ఈఎల్‌ ఈ ఆర్డర్‌ ఇచ్చింది.

Published : 30 May 2024 03:31 IST

బీహెచ్‌ఈఎల్‌ నుంచి పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.563 కోట్ల ఆర్డర్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.563 కోట్ల ఆర్డర్‌ లభించింది. ఒక అణు విద్యుత్తు ప్లాంటు నిర్మాణం నిమిత్తం బీహెచ్‌ఈఎల్‌ ఈ ఆర్డర్‌ ఇచ్చింది. కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లాలో కైగా అణు విద్యుత్తు ప్రాజెక్టులో ఈ ప్లాంటు నిర్మాంచాలి. సివిల్, ఎలక్ట్రికల్, స్ట్రక్చరల్‌ పనులు, టర్బైన్‌ జనరేటర్‌ భవన నిర్మాణం, కెమికల్‌ ల్యాబ్, స్టోరేజీ ట్యాంకులు, డ్రెయినేజీ వ్యవస్థ నిర్మాణ పనులు ఇందులో ఉన్నాయి. వచ్చే 32 నెలల వ్యవధిలో ఈ పనులు పూర్తిచేయాలి. 


ఇమామీ లాభం రూ.147 కోట్లు 

దిల్లీ: ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఇమామీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.146.75 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.141.62 కోట్లతో పోలిస్తే ఇది 3.62% అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.835.95 కోట్ల నుంచి 6.61% పెరిగి 891.24 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 6.14% పెరిగి రూ.901.94 కోట్లకు చేరింది.మొత్తం వ్యయాలు 7% పెరిగి రూ.680.26 కోట్లకు చేరాయి. దేశీయ వ్యాపారం 8%, పరిమాణ వృద్ధి 6.4 శాతంగా నమోదయ్యాయి. బోరోప్లస్, ఆరోగ్య సంరక్షణ శ్రేణి, 7 ఆయిల్స్‌ ఇన్‌ ఒన్, ద మ్యాన్‌ కంపెనీ, బ్రిల్లేర్‌ బ్రాండ్లు సమీక్షా త్రైమాసికంలో బలమైన పనితీరు ప్రదర్శించాయని కంపెనీ తెలిపింది. శీతాకాలం ఎక్కువ రోజులు ఉండటంతో నవరత్న, డెర్మికూల్‌ వంటి బ్రాండ్ల వృద్ధి ఒక అంకెకు పరిమితమైనట్లు పేర్కొంది. అంతర్జాతీయ వ్యాపారం స్థిర కరెన్సీ వద్ద 9%, రూపాయల్లో 8% పెరిగింది.  ‘గ్రామీణ గిరాకీ క్రమంగా పెరుగుతోంది. మా దేశీయ వ్యాపారంలో సంఘటిత సంస్థల వాటా 2022-23లో 22%  కాగా, తాజాగా ఇది 26 శాతానికి చేరింద’ని ఇమామీ వైస్‌ ఛైర్మన్, పూర్తికాల డైరెక్టర్‌ మోహన్‌ గోయెంకా వెల్లడించారు.

ఈ ఏడాది బాగుంటుంది

పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.724.14 కోట్లకు చేరింది. 2022-23 లాభం రూ.627.41 కోట్లతో పోలిస్తే, ఇది 15.42% అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.3,405.73 కోట్ల నుంచి 5.06% పెరిగి రూ.3,578.09 కోట్లకు చేరింది. భవిష్యత్‌ వృద్ధిపై ఆశావాదంతో ఉన్నామని కంపెనీ తెలిపింది. సాధారణ వర్షపాతం, గ్రామీణ గిరాకీ పుంజుకుంటుండటం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగవుతుండటం వంటి సానుకూల పరిమాణాలు వృద్ధి నమోదు చేసేందుకు దోహదం చేయనున్నాయని పేర్కొంది.


డిజైన్, అనలిటిక్స్, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలతో ఉద్యోగావకాశాలు

దిల్లీ: తాజాగా ఉత్తీర్ణులైన పట్టభద్రులకు డిజైన్, అనలిటిక్స్, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలుంటే కనుక, త్వరగా ఉద్యోగం సాధించే అవకాశాలున్నాయని దిగ్గజ ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ లింక్డ్‌ ఇన్‌ వెల్లడించింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, సిస్టమ్‌ ఇంజినీర్, ప్రోగ్రామింగ్‌ అనలిస్ట్‌ వంటి ఉద్యోగాలకు పట్టభద్రులు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపింది. 

ఈ రంగాల్లో అధికం: యువ వృత్తి నిపుణులకు యుటిలిటీస్‌ రంగం కూడా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పరిశ్రమగా ఉందని ‘లింక్డ్‌ ఇన్‌ కెరీర్‌ స్టార్టర్‌ 2024’ నివేదిక తెలిపింది. చమురు-గ్యాస్, గనులు, స్థిరాస్తి, పరికరాల అద్దె సేవలు, వినియోగదారు సేవల రంగాలు కూడా ఉద్యోగాలు కల్పించడంలో ముందున్నాయని పేర్కొంది. కమ్యూనిటీ-సామాజిక సేవ, న్యాయ, మార్కెటింగ్, మీడియా, కమ్యూనికేషన్‌ రంగాల్లోనూ విస్తృత అవకాశాలున్నాయని తెలిపింది. 

‘కఠిన పరిస్థితుల్లో ఉద్యోగాలు పొందడం కష్టమైనా, పరిశ్రమ ధోరణులకు అనుగుణంగా మారితే అలాంటి వారికి తొలి అవకాశం లభిస్తుంద’ని లింక్డ్‌ ఇన్‌ కెరీర్‌ ఎక్స్‌పర్ట్, ఇండియా సీనియర్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ నిరాజిత బెనర్జీ వెల్లడించారు. చాలా నైపుణ్యాలను వేర్వేరు రంగాల్లో వినియోగించుకోవచ్చని తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం అధికమై, టెక్‌ సంబంధిత ఉద్యోగాలు వివిధ రంగాల్లోని దిగ్గజ సంస్థల్లో పెరిగాయని, విద్యార్హతలతో సంబంధం లేకుండా నిపుణులను ఆయా సంస్థలు నియమించుకుంటున్నాయని నిరాజిత తెలిపారు. ప్రారంభ స్థాయి ఉద్యోగాల్లో ఫ్లెక్సిబుల్‌ వర్కింగ్‌ గణనీయంగా పెరుగుతోందని, ఆన్‌-సైట్‌ ఉద్యోగాలు 15% తగ్గాయని, హైబ్రిడ్‌ ఉద్యోగాలు 52% పెరిగాయని నివేదిక తెలిపింది. 


వేవ్‌రాక్‌లో వాటాలు విక్రయించిన స్ప్రెఫ్‌ 2

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేడ్‌ ఏ ఐటీ సెజ్‌ టీఎస్‌ఐబీపీహెచ్‌ (టీఎస్‌ఐ బిజినెస్‌ పార్క్స్‌ (హైదరాబాద్‌) ప్రైవేట్‌ లిమిటెట్‌)లో తన వాటాలను విక్రయించినట్లు స్ప్రెఫ్‌ 2 ప్రైవేట్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. టీఎస్‌ఐబీపీహెచ్‌ యాజమాన్యంలోనే గచ్చిబౌలిలో 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఐటీ సెజ్‌ వేవ్‌రాక్‌ ఉంది. ఇందులో మెజార్టీ వాటాను 2019లో స్ప్రెఫ్‌ 2 కొనుగోలు చేసింది. సింగపూర్‌కు చెందిన స్పైర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్, షాపూర్‌జీ పల్లోంజీ గ్రూపుతో పాటు, ఇతర సంస్థాగత పెట్టుబడి సంస్థల ఉమ్మడి భాగస్వామ్య సంస్థ స్ఫ్రెఫ్‌ 2. ఈ సంస్థ వేవ్‌రాక్‌లో ఉన్న వాటాలను సింగపూర్‌ ప్రభుత్వానికి చెందిన పెట్టుబడి సంస్థ జీఐసీకి రూ.2,200 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. 


రూ.100లోపు ఎస్‌ఎమ్‌ఎస్‌లు రావు: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 

దిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, తన వినియోగదార్లు చేసే యూపీఐ డెబిట్, క్రెడిట్‌ లావాదేవీల విషయంలో ఎస్‌ఎమ్‌ఎస్‌లకు పరిమితి విధించింది. రూ.100లోపు లావాదేవీలకు ఎస్‌ఎంఎస్‌ పంపబోమని తెలిపింది. 2024 జూన్‌ 25 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. అయితే అన్ని యూపీఐ లావాదేవీలకు ఇమెయిల్‌ సందేశాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది. తాజా పరిమితి ప్రకారం.. రూ.100కు పైన ఎవరికైనా నగదు పంపినా/క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లించినా; రూ.500కు మించి నగదు అందుకున్నప్పుడు మాత్రమే ఎస్‌ఎమ్‌ఎస్‌ అలర్ట్‌లు వస్తాయి. 


భారత్‌కు ఏడీబీ రూ.21,500 కోట్ల రుణం

దిల్లీ: 2023లో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం భారత్‌కు 2.6 బిలియన్‌ డాలర్ల  (సుమారు రూ.21,500 కోట్లు) మేర రుణాన్ని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) మంజూరు చేసింది. పట్టణ అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, విద్యుత్‌ రంగ సంస్కరణలకు ప్రోత్సాహం, రవాణా మార్గాల అనుసంధానతను విస్తరించడం, కాలుష్య నియంత్రణ చర్యలు తదితరాలకు నిధుల సహకారం నిమిత్తం ఈ రుణాన్ని అందజేసింది. గతేడాది ప్రైవేట్‌ రంగ ప్రాజెక్టుల కోసం 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.8300 కోట్ల) మేర రుణ సహకారం అందించినట్లు ఏడీబీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని