సంక్షిప్త వార్తలు(6)

స్పెక్ట్రమ్‌ వేలం ఈ నెల 6న నిర్వహించాల్సి ఉండగా, ఈనెల 25కు వాయిదా వేస్తున్నట్లు టెలికాం విభాగం (డాట్‌) తెలిపింది. మొబైల్‌ ఫోన్‌ సేవల కోసం 8 స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌లను రూ.96,317 కోట్ల కనీస ధరతో వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Published : 05 Jun 2024 02:26 IST

స్పెక్ట్రమ్‌ వేలం 25కు వాయిదా: డాట్‌

దిల్లీ: స్పెక్ట్రమ్‌ వేలం ఈ నెల 6న నిర్వహించాల్సి ఉండగా, ఈనెల 25కు వాయిదా వేస్తున్నట్లు టెలికాం విభాగం (డాట్‌) తెలిపింది. మొబైల్‌ ఫోన్‌ సేవల కోసం 8 స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌లను రూ.96,317 కోట్ల కనీస ధరతో వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 800 - 900 - 1800 - 2100 - 2300 - 2500 - 3300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్‌ బ్యాండ్‌ల స్పెక్ట్రమ్‌ను వేలంలో విక్రయించనుంది. ఈ ప్రక్రియ కోసం రిలయన్స్‌ జియో రూ.3,000 కోట్ల మొత్తాన్ని (ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌-ఈఎండీ) డిపాజిట్‌ చేయడం ద్వారా అత్యధిక రేడియో తరంగాలకు బిడ్‌ వేసేందుకు సిద్ధమైంది. డాట్‌ విడుదల చేసిన ప్రీ-క్వాలిఫైడ్‌ బిడ్డర్‌ వివరాల ప్రకారం, భారతీ ఎయిర్‌టెల్‌ రూ.1,050 కోట్ల ఈఎండీని, వొడాఫోన్‌ ఐడియా రూ.300 కోట్ల ఈఎండీని డిపాజిట్‌ చేశాయి.


టాటా మోటార్స్‌ ఫైనాన్స్, టాటా కేపిటల్‌ విలీనానికి ఆమోదం

దిల్లీ: టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌ (టీఎంఎఫ్‌ఎల్‌)తో టాటా కేపిటల్‌ (టీసీఎల్‌) విలీనానికి ఇరు సంస్థల బోర్డులు ఆమోదం తెలిపాయి. టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌.. టాటా మోటార్స్‌కు అనుబంధ సంస్థ. ‘ఎన్‌సీఎల్‌టీ ఆమోదిత షేర్ల బదలాయింపు పద్ధతిలో టాటా మోటార్స్‌ ఫైనాన్స్, టాటా కేపిటల్‌ విలీనానికి ఈ రెండు సంస్థలతో పాటు, టాటా మోటార్స్‌ బోర్డు ఆమోదం తెలిపినట్లు’ ఎక్స్ఛేంజీలకు ఈ సంస్థలు సమాచారం ఇచ్చాయి. విలీన పథకం ప్రకారం.. టీఎంఎఫ్‌ఎల్‌ వాటాదార్లకు టీసీఎల్‌ షేర్లను జారీ చేస్తుంది. తద్వారా విలీనానంతర సంస్థలో టాటా మోటార్స్‌ వాటా 4.7 శాతంగా ఉంటుంది. ఈ షేర్ల బదలాయింపు ప్రతిపాదనకు ఎన్‌సీఎల్‌టీ, ఆర్‌బీఐ, సెబీతో పాటు టీసీఎల్, టీఎంఎఫ్‌ఎల్‌ వాటాదార్లు, రుణ సంస్థల నుంచి ఆమోదం లభించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు 9-12 నెలల సమయం పడుతుందని టాటా మోటార్స్‌ వెల్లడించింది.


జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ చేతికి ఎవర్‌గ్రేట్‌

దిల్లీ: ఎవర్‌గ్రేట్‌ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పీటీఈ లిమిటెడ్‌ సింగపూర్‌ (ఈఐపీఎల్‌)లో 100% వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ వెల్లడించింది. దీంతో ఈఐపీఎల్‌ తమకు అనుబంధ సంస్థగా మారిందని పేర్కొంది. ఈ కొనుగోలు 2024 జూన్‌ 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.


టీవీ ఛానళ్ల చందా 5-8% పెరగొచ్చు!

దిల్లీ: టీవీ ఛానళ్ల చందా రుసుములు 5-8% పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. డిస్నీ స్టార్, వయాకామ్‌18, జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా వంటి బ్రాడ్‌కాస్టర్లు తమ బొకే (ఛానెళ్ల గుచ్ఛం) ధరల్ని పెంచడమే ఇందుకు కారణం. కొత్త టారిఫ్‌ల ప్రకారం ఒప్పందాలపై సంతకం చేయని డిస్ట్రిబ్యూషన్‌ ప్లాట్‌ఫామ్‌ ఆపరేటర్ల (డీపీఓల) సిగ్నల్స్‌ను బ్రాడ్‌కాస్టర్లు, సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు స్విచ్ఛాప్‌ చేయరాదంటూ టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) సూచించింది. జూన్‌ 1తో పోలింగ్‌ ముగిసి, మంగళవారం ఫలితాలు కూడా రావడంతో డీపీఓలపై బ్రాడ్‌కాస్టర్లు రేట్లు పెంచమని ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ వంటి కొన్ని డీపీఓలు స్వల్పంగా రేట్లను పెంచాయి.


టొరొంటో నుంచి ముంబయికి నాన్‌ స్టాప్‌ విమానాలు: ఎయిర్‌ కెనడా

ముంబయి: టొరొంటో నుంచి ముంబయికి కొత్తగా నాన్‌ స్టాప్‌ విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఎయిర్‌ కెనడా ప్రకటించింది. శీతాకాల షెడ్యూల్‌లో భాగంగా కల్గారీ నుంచి లండన్‌ హీత్రో విమానాశ్రయం మీదుగా దిల్లీకి కొత్తగా సీజనల్‌ విమాన సర్వీసు కూడా ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త విమాన సర్వీసులతో భారత్‌ నుంచి ఎయిర్‌ కెనడా నడిపిస్తున్న వారంవారీ విమాన సర్వీసుల సంఖ్య 25కు చేరుతుంది. 


కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్‌లో 10% వాటా విక్రయించనున్న పీఎన్‌బీ 

దిల్లీ: బీమా సంస్థ కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 10% వాటాను విక్రయించబోతున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం సదరు సంస్థలో పీఎన్‌బీకి 23% వాటా ఉంది. 10% వాటా విక్రయానికి పీఎన్‌బీ బోర్డు ఆమోదం తెలిపింది. నియంత్రణ సంస్థల అనుమతికి లోబడి ఈ వాటా విక్రయం ఉంటుందని పీఎన్‌బీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఐపీఓ ద్వారా బీఎస్‌ఈ/ఎన్‌ఎస్‌ఈల్లో సదరు కంపెనీని నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంస్థలో హెచ్‌ఎస్‌బీసీకి 26%, కెనరా బ్యాంక్‌కు 51% వాటాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని