సంక్షిప్త వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేసేందుకు అదానీ పవర్‌ నుంచి రూ.3,500 కోట్ల విలువైన ఆర్డరు లభించినట్లు ప్రభుత్వ రంగ సంస్థ భెల్‌ ప్రకటించింది.

Published : 06 Jun 2024 03:08 IST

భెల్‌కు రూ.3,500 కోట్ల ఆర్డరు

దిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేసేందుకు అదానీ పవర్‌ నుంచి రూ.3,500 కోట్ల విలువైన ఆర్డరు లభించినట్లు ప్రభుత్వ రంగ సంస్థ భెల్‌ ప్రకటించింది. సూపర్‌క్రిటికల్‌ టెక్నాలజీపై 2×800 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన పరికరాలను సరఫరా చేసేందుకు జూన్‌ 5న ఇరు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు భెల్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన బాయిలర్, టర్బైన్‌ జనరేటర్‌లను త్రిచీ, హరిద్వార్‌ ప్లాంట్‌లలో తయారు చేయనున్నట్లు భెల్‌ తెలిపింది. 


వ్యవసాయ పరిశోధనలో రూ.1 పెట్టుబడిపై రూ.13 ప్రతిఫలం!
నాస్‌ ప్రెసిడెంట్‌ హిమాన్షు

దిల్లీ: వ్యవసాయ పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)లో ప్రతి రూ.1 పెట్టుబడిపై రూ.13 ప్రతిఫలం లభిస్తుందని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ (నాస్‌) ప్రెసిడెంట్‌ హిమాన్షు పాథక్‌ తెలిపారు. వ్యవసాయ ఆర్‌అండ్‌డీలో పెట్టుబడులు లాభదాయకమని, పశుసంవర్థక రంగంలో ఈ ప్రతిఫలం ఇంకా ఎక్కువగానే ఉంటుందని నాస్‌ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన అన్నారు. అయితే మన వ్యవసాయ పరిశోధనా వ్యవస్థను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పంట సాగు వ్యయాలు పెరగడం, తక్కువ ఉత్పాదకత, వాతావరణ మార్పు ప్రభావం రూపంలో ఈ రంగానికి సవాళ్లు ఎదురవుతున్న దృష్ట్యా ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


5 నెలల కనిష్ఠానికి సేవల వృద్ధి

దిల్లీ: దేశ సేవల రంగ వృద్ధి మే నెలలో 5 నెలల కనిష్ఠమైన 60.2 పాయింట్లుగా నమోదైంది. బుధవారం విడుదల చేసిన నెలవారీ సర్వే ప్రకారం, తీవ్రమైన పోటీ, ధరల ఒత్తిళ్లు, అధిక వేడి (హీట్‌ వేవ్‌) మధ్య అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సేవలకు కొత్త ఆర్డర్లు దశాబ్ద కనిష్ఠానికి చేరాయి. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ సూచీ ఈ ఏడాది ఏప్రిల్‌లో 60.8 పాయింట్లు కాగా, మేలో 60.2 పాయింట్లకు పరిమితమైంది. 2023 డిసెంబరు తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి.  పర్ఛేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధిగా, దిగువన నమోదైతే క్షీణతగా భావిస్తారు. మేలో వృద్ధి సానుకూలంగానే ఉన్నా, అంతకుముద]ు నెలల కంటే తగ్గింది. ‘భారత సేవల విపణిలో వృద్ధి గత నెలలో నెమ్మదించింది. కొత్త ఆర్డర్ల రాక స్వల్పంగా వృద్ధి చెందింది. అయితే అధిక ముడి పదార్థాల వ్యయాలు, కార్మికుల వేతనాల వల్ల ధరల ఒత్తిళ్లు పెరిగాయ’ని హెచ్‌ఎస్‌బీసీ అంతర్జాతీయ ఆర్థికవేత్త మైత్రేయి దాస్‌ వెల్లడించారు.


పెరూ దేశంలోనూ యూపీఐ సేవలు 

దిల్లీ: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) తరహా రియల్‌-టైమ్‌ చెల్లింపుల వ్యవస్థను లాటిన్‌ అమెరికా దేశమైన పెరూలో తీసుకొచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పెరూ, ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌పీఐఎల్‌) భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూపీఐ సాంకేతికతను దక్షిణ అమెరికాలో ప్రవేశపెట్టబోతున్న తొలి దేశంగా పెరూ నిలుస్తుందని ఎన్‌ఐపీఎల్‌ తెలిపింది. ఆ దేశ ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుందని ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ సీఈఓ రితేశ్‌ శుక్లా వెల్లడించారు. ఎన్‌ఐపీఎల్‌ అనేది నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని