సంస్కరణల వేగానికి సమస్యే

మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్‌డీఏ కూటమే అధికారం చేపట్టినా, ఆర్థిక, ద్రవ్య సంస్కరణల వేగవంత అమలుకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి.

Published : 06 Jun 2024 03:11 IST

భాజపాకు పూర్తి మెజారిటీ రానందునే
దీర్ఘకాలంలో వృద్ధికి ఢోకా లేదు
అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు

దిల్లీ: మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్‌డీఏ కూటమే అధికారం చేపట్టినా, ఆర్థిక, ద్రవ్య సంస్కరణల వేగవంత అమలుకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ భాజపాకి రాకపోవడం, భాగస్వామ్య పార్టీలపై ఆధారపడాల్సి రావడమే ఇందుకు కారణమని ఫిచ్, మూడీస్‌ సంస్థలు తాజా నివేదికల్లో పేర్కొన్నాయి. 

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారొచ్చు: ఫిచ్‌ రేటింగ్స్‌

‘ఎన్‌డీఏ కూటమే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నా, ఆధిక్యత తక్కువగా ఉన్నందున, ప్రభుత్వ సంస్కరణల అజెండాకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. 543 లోక్‌సభ సీట్లకు గాను 240 సీట్లు పొందిన భాజపా, తన భాగస్వామ్య పార్టీల నుంచి మరో 53 మంది మద్దతు పొందడం ద్వారా..   మొత్తం మీద 293 సీట్ల మెజారిటీని దక్కించుకుంది. అయినా కూడా సంస్కరణలను వేగంగా అమలు చేయడం క్లిష్టం కావొచ్చు. భూ, కార్మిక సంస్కరణల విషయంలో అడుగులు ఆలస్యం కావొచ్చు.  హిందూత్వంపై కాకుండా.. ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా ప్రభుత్వం దృష్టి సారించాలనేలా ఓటర్లు తీర్పు ఉంది. ప్రతిష్ఠాత్మక రామ మందిరాన్ని నిర్మించిన ఉత్తరప్రదేశ్‌లో భాజపాకు 33 సీట్లే లభించాయి. 2019లో ఇక్కడ 63 సీట్లు రావడం గమనార్హం. ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యకాలానికి మాత్రం భారత భవిష్యత్‌ అంచనాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ దశాబ్దం చివరకు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంద’ని ఫిచ్‌ తన నోట్‌లో పేర్కొంది.


ద్రవ్య విధానంపై త్వరలో స్పష్టత: మూడీస్‌

దేశీయ తయారీకి ఊతమిచ్చి, బలమైన ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడానికి రాబోయే బడ్జెట్‌లో మౌలిక వ్యయాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఎన్‌డీఏకున్న తక్కువ ఆధిపత్యం వల్ల ఆర్థిక, ద్రవ్య సంస్కరణలను  వేగంగా చేపట్టలేకపోవచ్చు. ‘బీఏఏ-’ రేటింగ్‌ ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే భారత ద్రవ్య పరిస్థితి బలహీనంగా కొనసాగొచ్చు. రాబోయే బడ్జెట్‌లో భారత ద్రవ్య విధానం 2029 వరకు ఎలా ఉండొచ్చన్న విషయం స్పష్టమవుతుంది. 2023-24 నుంచి 2025-26 వరకు భారత ఆర్థిక వృద్ధి 7 శాతంపైగానే నమోదు కావొచ్చు. జీ20 దేశాలన్నిటితో పోల్చినా భారత్‌ వేగవంతమైన వృద్ధిని నమోదు చేయగలదు. స్వల్పకాలంలో మాత్రమే నిర్మాణాత్మక బలహీనతలను కనబరచవచ్చు. అన్ని రంగాల్లో యువ నిరుద్యోగిత అధికంగా ఉండడం, వ్యవసాయ ఉత్పాదకత వృద్ధిలో బలహీనతలు కొనసాగొచ్చు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని