బీఎస్‌డీఏ పెట్టుబడుల పరిమితి రూ.10 లక్షలు!

సెక్యూరిటీస్‌ మార్కెట్లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో బేసిక్‌ సర్వీస్‌ డీమ్యాట్‌ ఖాతా (బీఎస్‌డీఏ) పెట్టుబడుల పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని సెబీ ప్రతిపాదించింది.

Published : 06 Jun 2024 03:15 IST

దిల్లీ: సెక్యూరిటీస్‌ మార్కెట్లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో బేసిక్‌ సర్వీస్‌ డీమ్యాట్‌ ఖాతా (బీఎస్‌డీఏ) పెట్టుబడుల పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని సెబీ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.2 లక్షలుగా ఉంది. 

బీఎస్‌డీఏ అనేది సాధారణ డీమ్యాట్‌ ఖాతాకు మరింత బేసిక్‌ వెర్షన్‌. ప్రస్తుతం ఒక డీమ్యాట్‌ ఖాతాలో రూ.2 లక్షల వరకు డెట్‌ సెక్యూరిటీలను, మరో రూ.2 లక్షల వరకు ఇతర డెట్‌ సెక్యూరిటీలను కలిగి ఉన్న మదుపర్లు బీఎస్‌డీఏకు అర్హులు. సెక్యూరిటీ మార్కెట్లో మరింత మంది పాల్గొనేలా ప్రోత్సహించేందుకు.. బీఎస్‌డీఐ పెట్టుబడుల పరిమితిని పెంచాలని సెబీ ప్రతిపాదించింది. ఒక డీమ్యాట్‌ ఖాతాలో ఏ సమయంలోనైనా డెట్‌ లేదా ఇతర డెట్‌ సెక్యూరిటీలు కలిపి మొత్తం సెక్యూరిటీల విలువ రూ.10 లక్షలకు మించకూడదని  ప్రతిపాదించింది. 

అర్హతలివీ: ఒక వ్యక్తి ఒకే డీమ్యాట్‌ ఖాతా కలిగి ఉండాలి. ఆ ఖాతాకు ఆ వ్యక్తే ఏకైక లేదా తొలి ఖాతాదారుగా ఉండాలి. అన్ని డిపాజిటరీల్లో ఆ వ్యక్తి పేరు మీద ఒకే బీఎస్‌డీఏను కలిగి ఉండాలి. బీఎస్‌డీఏ కోసం గరిష్ఠ వార్షిక నిర్వహణ రుసుములపైనా సమీక్ష జరిపేందుకు సెబీ ప్రతిపాదించింది. రూ.4 లక్షల వరకు పెట్టుబడుల విలువ ఉంటే వార్షిక నిర్వహణ రుసుములు ఏమీ ఉండవు. రూ.4 లక్షలు- రూ.10 లక్షల వరకైతే రూ.100గా ఉంచాలని యోచిస్తోంది. బీఎస్‌డీఏలోని పెట్టుబడుల విలువ రూ.10 లక్షలకు మించితే, అప్పుడు సాధారణ డీమ్యాట్‌ ఖాతాగా అవుతుంది. బీఎస్‌డీఏ సేవలకు సంబంధించి.. ఇ-స్టేట్‌మెంట్‌లు ఉచితమని, కాగితం రూపంలోనైతే ఒక్కో స్టేట్‌మెంట్‌కు రూ.25 వసూలు చేయాలని తెలిపింది. ఈ ప్రతిపాదనలపై జూన్‌ 26 లోగా అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా సెబీ కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని