అల్లకల్లోల మార్కెట్‌పై ఈడీ దర్యాప్తు చేయాలి

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితంగా ఒకరోజు రూ.13 లక్షల కోట్లకు పైగా లాభాలు రావడం.. మరుసటి రోజే ఎన్నికల వాస్తవ ఫలితాలు వెల్లడయ్యాక.. ఊహకందని విధంగా స్టాక్‌ మార్కెట్లు పతనమై రూ.31 లక్షల కోట్ల మదుపర్ల సంపద తుడిచిపెట్టుకుపోయిన అంశంలో..

Published : 07 Jun 2024 03:33 IST

మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ డిమాండ్‌ 

దిల్లీ: ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితంగా ఒకరోజు రూ.13 లక్షల కోట్లకు పైగా లాభాలు రావడం.. మరుసటి రోజే ఎన్నికల వాస్తవ ఫలితాలు వెల్లడయ్యాక.. ఊహకందని విధంగా స్టాక్‌ మార్కెట్లు పతనమై రూ.31 లక్షల కోట్ల మదుపర్ల సంపద తుడిచిపెట్టుకుపోయిన అంశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు నిర్వహించాలని మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ డిమాండ్‌ చేశారు. చిన్న మదుపర్లు భారీగా నష్టపోయేందుకు కారణమైన ఈ విషయాలపై పారదర్శక దర్యాప్తు అవసరమని కోరుతూ, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌కు శర్మ లేఖ రాశారు. జూన్‌ 3, 4 తేదీల్లో స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర హెచ్చుతగ్గులకు కారణాలు కనిపెట్టేందుకు, మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు ప్రారంభించిందా, మార్కెట్‌ను స్థిమిత పరచడానికి చర్యలేవైనా తీసుకుందా అన్నది వెల్లడించాలని కోరారు. ‘ఆ రెండు రోజుల్లో చిన్న మదుపర్లేమో తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకున్నారు. పెద్ద స్థాయి మదుపర్లు మాత్రం లాభాలు అందుకున్నారు. ఇప్పటికీ స్టాక్‌ మార్కెట్‌ పూర్తిగా కోలుకోలేద’ని ఆయన వివరించారు.

ఈ అంశాలు తేలాలి: ‘జూన్‌ 4న మార్కెట్లు భారీగా పెరుగుతాయని ప్రధాని, హోం మంత్రి ముందుగానే ప్రకటనలు చేయడంతో, చిన్న మదుపర్లు ఆశపడి ముందుగానే షేర్లు కొనుగోలు చేసుకుని, ఉంచుకోవడంతో భారీగా నష్టపోయారు. ప్రధాని ఇటువంటి ప్రకటన ఎందుకు చేశారో తెలియదు. ఆర్థిక శాఖలో ‘నిపుణులు’ ఎవరైనా పీఎమ్‌ఓకు ఇలా చేయమని సూచించారా అన్నది తేలాలి. భారీగా లాభాలు పొందిన వారు, ఆ డబ్బులను ఎక్కడికి తరలించారు? మనీలాండరింగ్‌కు దీనికి ఏదైనా సంబంధం ఉందా అన్నది ఈడీ తేల్చాల’ని ఆ లేఖలో శర్మ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ విషయంలో మౌనంగా ఉండకుండా ఈడీ, సీబీఐ, సీబీడీటీలను రంగంలోకి దించాలని సూచించారు. ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా 1999-2000 సంవత్సరంలో శర్మ పనిచేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని