మేలో దేశీయ విమాన ప్రయాణికులు 1.39 కోట్లు: ఇక్రా

దేశీయ విమాన మార్గాల్లో ఈ ఏడాది 1.39 కోట్ల మంది ప్రయాణించినట్లు క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఏప్రిల్‌లో నమోదైన 1.32 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 5.1% అధికం.

Published : 07 Jun 2024 03:40 IST

ముంబయి: దేశీయ విమాన మార్గాల్లో ఈ ఏడాది 1.39 కోట్ల మంది ప్రయాణించినట్లు క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఏప్రిల్‌లో నమోదైన 1.32 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 5.1% అధికం. కొవిడ్‌ ముందు స్థాయితో పోల్చినా, గత నెల ప్రయాణికుల సంఖ్య 14% ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 15.4 కోట్ల మంది దేశీయంగా విమాన ప్రయాణాలు చేశారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ప్రయాణించిన వారితో పోలిస్తే, 13% ఎక్కువ. కొవిడ్‌ పరిణామాలకు ముందు 2019-20లో 14.2 కోట్ల మంది మాత్రమే దేశీయ విమానాల్లో ప్రయాణించారు. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్ల ధరలు స్థిరంగా ఉంటుండటంతో.. 2024-25లోనూ ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి కొనసాగుతుందని ఇక్రా అంచనా వేస్తోంది. విమానయాన సంస్థల సామర్థ్యం ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే 2%, 2023 మే నెలతో పోలిస్తే 6% అధికమయ్యాయి.


విమాన ఇంధన ధర తగ్గింది

  • విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) కిలో లీటరు సగటు ధర 2023-24లో రూ.1,03,499గా ఉంది. 2022-23 నాటి రూ.1,21,013తో పోలిస్తే ఇది 14% తక్కువ. కొవిడ్‌ ముందు నాటి 2019-20లో ఈ వ్యయం రూ.65,368 మాత్రమే కావడం గమనార్హం. 
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏటీఎఫ్‌ ధర వార్షిక ప్రాతిపదికన 5.4% ఎక్కువగా ఉంది. ఈ నెలలో 6.5% తగ్గిందని ఇక్రా పేర్కొంది. విమానయాన సంస్థల వ్యయాల్లో సుమారు 30-40% ఇంధన వ్యయాలే ఉంటాయి. మొత్తం వ్యయాల్లో 45-60% మేర (విమాన లీజు చెల్లింపులు, నిర్వహణ, విమాన ఇంజిన్ల నిర్వహణ, ఇంధన) డాలర్ల రూపేణ చెల్లించాల్సి వస్తోంది. 

నష్టాలు తగ్గుతున్నాయ్‌: 2022-23లో దేశీయ విమానయాన పరిశ్రమ రూ.17,000-17,500 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ తగ్గడమూ ఈ నష్టాలకు కారణమైంది. తదుపరి నష్టాలు తగ్గుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం మాదిరే 2024-25లోనూ విమానయాన రంగ నష్టాలు రూ.3,000-4,000 కోట్లకు పరిమితం కావొచ్చని ఇక్రా అంచనా వేసింది. విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడం, టికెట్‌ ధరలు ఇందుకు దోహదం చేయొచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని