నాలుగేళ్లలో రూ.1300 కోట్ల టర్నోవర్‌!

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఔషధ సంస్థ, ఎస్‌ఎంఎస్‌ ఫార్మాస్యూటికల్స్‌ వచ్చే మూడు - నాలుగేళ్లలో తన టర్నోవర్‌ను రూ.1300 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Published : 07 Jun 2024 03:44 IST

ఎస్‌ఎంఎస్‌ ఫార్మా లక్ష్యం 
రూ.150 కోట్ల మూలధన పెట్టుబడికి సన్నాహాలు 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఔషధ సంస్థ, ఎస్‌ఎంఎస్‌ ఫార్మాస్యూటికల్స్‌ వచ్చే మూడు - నాలుగేళ్లలో తన టర్నోవర్‌ను రూ.1300 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు 20% ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, ఇతర కేటాయింపుల కంటే ముందు ఆదాయం) సాధించాలని భావిస్తోంది. దీనికి తగ్గట్లుగా తన తయారీ యూనిట్లను విస్తరించడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రూ.150 కోట్ల మూలధన పెట్టుబడిని సమీకరిస్తోంది. ఈ నిధుల్లో కొంత సొంతంగా సమకూర్చుకోవడంతో పాటు, మరికొంత సొమ్మును టర్మ్‌ రుణాల రూపంలో సేకరిస్తారు. ఆర్థిక ఫలితాలపై మదుపరులతో నిర్వహించిన టెలికాన్ఫెరెన్స్‌ కాల్‌లో ఈ విషయాలను ఎస్‌ఎంఎస్‌ ఫార్మా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వంశీ కృష్ణ వెల్లడించారు.

ఆదుకున్న ఐబూప్రూఫెన్‌: గత ఆర్థిక సంవత్సరానికి ఈ సంస్థ రూ.709 కోట్ల ఆదాయంపై రూ.50 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23లో రూ.522 కోట్ల ఆదాయంపై రూ.7 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితాలు నమోదు చేయడానికి ఐబూప్రూఫెన్‌తో పాటు డయాబెటిక్‌ ఔషధాలు దోహదపడినట్లు ఎస్‌ఎంఎస్‌ ఫార్మా వివరించింది. గత ఆర్థిక సంవత్సర టర్నోవర్‌లో 19% ఆదాయం ఐబూప్రూఫెన్‌ నుంచే లభించినట్లు సంస్థ తెలిపింది.

  • ఇదే సానుకూలత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగగలదని సంస్థ యాజమాన్యం ఆశిస్తోంది. ఐబూప్రూఫెన్‌ అమ్మకాల్లో 25-28% వృద్ధి నమోదు కావచ్చని అంచనా వేస్తోంది. డయాబెటిక్‌ ఔషధాల అమ్మకాలూ పెరుగుతాయని అంచనా వేస్తోంది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) ఆదాయాల్లో 20-25% వృద్ధి ఉంటుందని, అదే సమయంలో 20% ఎబిటా నమోదు కావచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎబిటా 16 శాతమే. ఐబూప్రూఫెన్‌ ఔషధ ధరలు ఇటీవల తగ్గాయి. అయినా, ఇతర సంస్థలతో పోటీపడి తమ మార్కెట్‌ వాటా నిలబెట్టుకోగలుగుతున్నట్లు ఎస్‌ఎంఎస్‌ ఫార్మా వివరించింది. ప్రస్తుతం ఈ ఔషధం ధరలు స్థిరంగా ఉన్నట్లు వెల్లడించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని