2 రోజుల్లో.. రూ.21 లక్షల కోట్ల లాభం

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగుతుండటంతో, రాజకీయ స్థిరత్వంపై మదుపర్లకు భరోసా ఏర్పడుతోంది. ఫలితమే వరుసగా రెండో రోజూ దేశీయ సూచీలు పరుగులు తీశాయి. సెన్సెక్స్‌ మళ్లీ 75,000 పాయింట్ల స్థాయిని అందుకుంది.

Updated : 07 Jun 2024 06:42 IST

మార్కెట్ల రికవరీతో పెరిగిన మదుపర్ల సంపద
75,000 పాయింట్ల ఎగువకు సెన్సెక్స్‌

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగుతుండటంతో, రాజకీయ స్థిరత్వంపై మదుపర్లకు భరోసా ఏర్పడుతోంది. ఫలితమే వరుసగా రెండో రోజూ దేశీయ సూచీలు పరుగులు తీశాయి. సెన్సెక్స్‌ మళ్లీ 75,000 పాయింట్ల స్థాయిని అందుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు తగ్గి 83.53 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు         78.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

  • మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గురువారం రూ.7.83 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం నాటి లాభం రూ.13.22 లక్షల కోట్లను కలిపితే గత రెండు ట్రేడింగ్‌ రోజుల్లో రూ.21.05 లక్షల కోట్లు పెరిగి రూ.415.89 లక్షల కోట్ల (దాదాపు 4.98 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది. 

సెన్సెక్స్‌ ఉదయం 75,078.70 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచీ, 75,297.73 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరకు 692.27 పాయింట్ల లాభంతో  75,074.51 వద్ద ముగిసింది. నిఫ్టీ 201.05 పాయింట్లు పెరిగి 22,821.40 దగ్గర స్థిరపడింది.

  • అదానీ పవర్‌ నుంచి రూ.3500 కోట్ల విలువైన ఆర్డరు దక్కించుకోవడంతో భెల్‌ షేరు 8.85% దూసుకెళ్లి రూ.277.95 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.7,973.93 కోట్లు పెరిగి రూ.96,853.59 కోట్లకు చేరింది. 
  • రెండో రోజూ అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల జోరు కొనసాగింది. అదానీ ఎనర్జీ 5.10%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 3.97%, ఎన్‌డీటీవీ 3.70%, అదానీ పవర్‌   3.17%, అదానీ విల్మర్‌ 3.05%, ఏసీసీ 2.56%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 2.13%, అదానీ గ్రీన్‌ ఎనర్జీ    1.99%, అంబుజా సిమెంట్స్‌ 1.77% లాభాలు నమోదు చేశాయి. అదానీ పోర్ట్స్‌ 0.18% తగ్గింది.  
  • ఏథర్‌ ఎనర్జీలో అదనంగా 2.2% వాటాను రూ.124 కోట్లకు కొనుగోలు చేసినట్లు హీరో మోటోకార్ప్‌ వెల్లడించింది. దీంతో కంపెనీలో హీరో మోటో వాటా 39.7 శాతానికి పెరిగింది. 
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 23 లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా 4.07%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 4.04%, ఎస్‌బీఐ 3.46%, ఇన్ఫోసిస్‌ 2.95%, ఎన్‌టీపీసీ 2.65%, టీసీఎస్‌ 2.24%, ఎల్‌ అండ్‌ టీ 2.24%, విప్రో 2.09%, భారతీ ఎయిర్‌టెల్‌ 2.03%, టాటా స్టీల్‌ 1.65% రాణించాయి. హెచ్‌యూఎల్‌ 2.04%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.88%, ఎం అండ్‌ ఎం 1.57%, నెస్లే 1.40%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.35%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.10% నష్టపోయాయి.

ఐటీసీ హోటల్స్‌ విభజన ప్రతిపాదనకు ఆమోదం: ఐటీసీ హోటల్స్‌ను ప్రత్యేక సంస్థగా విభజించేందుకు వాటాదార్లు అనుమతి ఇచ్చారని ఐటీసీ తెలిపింది. విభజన తర్వాత ఐటీసీ హోటల్స్‌లో 40% వాటా ఐటీసీ చేతిలో ఉంటుంది. ఐటీసీ హోటల్స్‌కు దేశవ్యాప్తంగా 120కు పైగా హోటళ్లు ఉన్నాయి.

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిధుల సమీకరణ: ఈక్విటీ షేర్ల జారీ, క్యూఐపీ సహా పలు పద్ధతుల్లో రూ.2000 కోట్ల సమీకరణ ప్రణాళికకు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజ్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఒకటి లేదా పలు విడతల్లో ఈ నిధుల సమీకరణ ఉండనుంది. ఈ ప్రతిపాదనకు నియంత్రణ సంస్థలు, వాటాదార్ల అనుమతి లభించాల్సి ఉంటుంది.

వీఐపీ ఇండస్ట్రీస్‌ నుంచి నిషాబా గోద్రేజ్‌ నిష్క్రమణ: సూట్‌కేసుల తయారీ సంస్థ వీఐపీ ఇండస్ట్రీస్‌ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌ పదవికి నిషాబా గోద్రేజ్‌ రాజీనామా చేశారు. నాయకత్వ బాధ్యతలు, వారసత్వ ప్రణాళికలు ఇందుకు కారణమని తెలిపారు. ప్రస్తుతం ఆమె గోద్రేజ్‌ కన్జూమర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఈనెల 3న ఆమె రాజీనామా చేసినట్లు సంస్థ తెలిపింది. 

విప్రోకు రూ.4200 కోట్ల ఆర్డరు: అగ్రగామి అమెరికా కమ్యూనికేషన్‌ సేవల సంస్థ నుంచి 500 మి.డాలర్ల (దాదాపు రూ.4,200 కోట్ల) విలువైన ఆర్డరు లభించినట్లు ఐటీ సేవల సంస్థ విప్రో తెలిపింది. ఈ ఆర్డరు కాలవ్యవధి అయిదేళ్లు. ఇందులో భాగంగా కొన్ని ఉత్పత్తులకు సేవలు, పరిశ్రమ సంబంధిత సొల్యూషన్స్‌ను విప్రో అందించనుంది. కొత్త సీఈఓ శ్రీనివాస్‌ పల్లియా నేతృత్వంలో కంపెనీకి ఇదే  మొదటి పెద్ద ఆర్డరు కావడం గమనార్హం.


నేటి ఉదయం 10 గంటలకు ఆర్‌బీఐ సమీక్ష నిర్ణయాల వెల్లడి

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించనున్నారు. బుధవారం నుంచి జరుగుతున్న ఈ సమీక్షలోనూ, వడ్డీ రేట్లను మార్చే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటును ఆర్‌బీఐ 6.5% వద్దే స్థిరంగా కొనసాగిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని