వినియోగ కార్ల విక్రయాలు 1.09 కోట్ల వాహనాలకు చేరొచ్చు

భారత్‌లో వినియోగ (ప్రీఓన్డ్‌) కార్ల విక్రయాలు 2027-28 కల్లా 1.09 కోట్ల వాహనాలకు పెరిగే అవకాశం ఉందని ఇండియన్‌ బ్లూ బక్‌ (ఐబీబీ) నివేదిక అంచనా వేసింది.

Published : 09 Jun 2024 03:23 IST

2027-28పై ఐబీబీ అంచనా 

దిల్లీ: భారత్‌లో వినియోగ (ప్రీఓన్డ్‌) కార్ల విక్రయాలు 2027-28 కల్లా 1.09 కోట్ల వాహనాలకు పెరిగే అవకాశం ఉందని ఇండియన్‌ బ్లూ బక్‌ (ఐబీబీ) నివేదిక అంచనా వేసింది. ఈ తరహా వాహనాల విపణి పరిమాణం కూడా రెట్టింపునకు పైగా పెరిగి 73 బిలియన్‌ డాలర్లను (సుమారు రూ.6 లక్షల కోట్లు) చేరొచ్చని పేర్కొంది. 2022-23లో వినియోగ వాహనాల విక్రయాలు సుమారు 51 లక్షలు కాగా... దేశీయ వినియోగ వాహన విపణి పరిమాణం 32.44 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ.2.70 లక్షల కోట్లు) నమోదైనట్లు తెలిపింది. ‘వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యం పెరగడంతో పాటు కుటుంబాల ఆదాయాల్లో పెరుగుదల, వాడేసిన కొన్నాళ్లకే కొత్త కార్లను కొనే ధోరణి పెరగడం లాంటివి వినియోగ వాహనాలకు గిరాకీ పెరిగేందుకు దోహదం చేస్తోంద’ని నివేదిక వివరించింది.   

భారత్‌లో వినియోగ కార్ల విపణిలో ఉన్న పుష్కల అవకాశాలే ఇందుకు కారణమని వివరించింది. మరో కొత్త వినియోగ కారుకు మారాలనే ఆసక్తి వల్ల కూడా ఇప్పటికే ఉన్న వినియోగ కార్ల విక్రయానికి యజమానులు మొగ్గు చూపడానికి ప్రధాన కారణమని తెలిపింది. తమకు అనువైన బడ్జెట్లో కొనుగోలు చేయాలని భావించే వాళ్లు, నాణ్యమైన వినియోగ కార్లకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారని వివరించింది. మొత్తం కొనుగోలుదార్లలో ఇలాంటి వారి సంఖ్య 63 శాతంగా ఉందని తెలిపింది. వినియోగ కార్ల ఎంపికలో వినియోగదారు అభిరుచులు, కొత్త ధోరణులు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది. ‘వినియోగ కార్ల విపణిలో సంఘటిత సంస్థల ప్రాతినిధ్యం పెరగడం వల్ల ఈ తరహా కార్ల విపణిపై నమ్మకాన్ని, స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. లాభదాయకతలో స్థిరత్వం, వినియోగదారుకు అత్యుత్తమ అనుభూతి అందించడమే సంఘటిత సంస్థలకు తొలి ప్రాధాన్యాలుగా ఉన్నాయి’ అని మహీంద్రా ఫస్ట్‌ ఛాయిస్‌ సీఈఓ, ఎండీ అశుతోష్‌ పాండే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు