కీలక సంస్కరణలు సవాలే

నరేంద్ర మోదీ నేతృత్వంలోనే కేంద్రంలో ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తున్నా, లోక్‌సభలో మెజార్టీపరంగా మారిన పరిస్థితుల రీత్యా.. కీలక సంస్కరణలు చేపట్టడం సవాలుగా మారొచ్చని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

Published : 09 Jun 2024 03:25 IST

విశ్లేషకులు

దిల్లీ: నరేంద్ర మోదీ నేతృత్వంలోనే కేంద్రంలో ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తున్నా, లోక్‌సభలో మెజార్టీపరంగా మారిన పరిస్థితుల రీత్యా.. కీలక సంస్కరణలు చేపట్టడం సవాలుగా మారొచ్చని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజార్టీ 272 సీట్లను భాజపా సొంతంగా సాధించలేకపోవడమే ఇందుకు కారణమని దేశీయ బ్రోకరేజీ సంస్థ ఎంకే తెలిపింది. అయితే ఆర్థిక విధాన దిశ మాత్రం మారకపోవచ్చని పేర్కొంది. స్విస్‌ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ విశ్లేషకులు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. తయారీ, నియంత్రణ ప్రక్రియల సరళీకరణ, కార్మిక చట్టం అమలు, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ సృష్టి అవకాశాల లాంటి సంస్కరణలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నట్లు యూబీఎస్‌ పేర్కొంది. అయితే భూ సంస్కరణలు, పెట్టుబడుల ఉపసంహరణ, వ్యవసాయ బిల్లులు, ఏక పౌర స్మృతి, ఒక దేశం.. ఒకే ఎన్నిక లాంటి కీలక సంస్కరణలను అమలు చేయడంలో సవాళ్లు ఎదురవ్వొచ్చని తెలిపింది. మదుపర్ల సెంటిమెంటును కూడా ఇదే నిర్దేశించే అవకాశం ఉందని పేర్కొంది. తక్కువ మెజార్టీతోనే ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చినందున.. విధాన నిర్ణయాల విషయంలో తెలుగుదేశం పార్టీ, జనతా దళ్‌ (యునైటెడ్‌) లాంటి ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తుందని ఎంకే గుర్తు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని