సంక్షిప్త వార్తలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్‌ 4వ తేదీన స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమవ్వడంపై పూర్తి నివేదికను సమర్పించాల్సిందిగా కేంద్రం, సెబీకి ఆదేశాలివ్వాలని సుప్రీం కోర్టులో విశాల్‌ తివారీ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 10 Jun 2024 01:58 IST

4 నాటి స్టాక్‌ మార్కెట్‌ పతనంపై కేంద్రం, సెబీ నుంచి నివేదిక కోరండి
సుప్రీం కోర్టులో పిటిషన్‌

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్‌ 4వ తేదీన స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమవ్వడంపై పూర్తి నివేదికను సమర్పించాల్సిందిగా కేంద్రం, సెబీకి ఆదేశాలివ్వాలని సుప్రీం కోర్టులో విశాల్‌ తివారీ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే అదానీ- హిండెన్‌బర్గ్‌ కేసు వ్యవహారంలో జస్టిస్‌ ఎ.ఎం.సప్రే నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలను పరిశీలించేందుకు జూన్‌ 3న జారీ చేసిన ఆదేశాల స్థితిపైనా నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వం, సెబీకి ఆదేశాలివ్వాలని కూడా తివారీ కోరారు. నిపుణుల కమిటీ సూచనలను నిర్మాణాత్మకంగా కేంద్రం, సెబీ పరిశీలించి నియంత్రణ వ్యవస్థల బలోపేతానికి, మదుపర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు తెలిపింది. ‘లోక్‌సభ 2024 ఎన్నిక ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడిన తర్వాత స్టాక్‌ మార్కెట్‌ భారీగా పెరిగింది. కానీ అసలైన ఫలితాలు వెలువడగానే భారీగా పతనమయ్యాయి. వార్తా కథనాల ప్రకారం.. ఆ రోజు మదుపర్లకు రూ.20 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది. నియంత్రణ వ్యవస్థల పనితీరుపై సందేహాలు తలెత్తేందుకు ఇది దారి తీసింది. కోర్టు దీనిపై ఆదేశాలు ఇవ్వకుంటే.. ఈ పరిస్థితి మారద’ని పిటిషన్‌లో తివారీ పేర్కొన్నారు. భాజపా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడంతో జూన్‌ 3వ తేదీన (సోమవారం) సెన్సెక్స్‌ 2,507 పాయింట్లు పెరగగా.. ఆ మరుసటి రోజు అంటే ఫలితాల వెల్లడైన మంగళవారం నాడు సెన్సెక్స్‌ 4,390 పాయింట్లు నష్టపోయింది. 


51,006 సీసాల సెఫ్‌డినిర్‌ను వెనక్కి రప్పిస్తున్న లుపిన్‌ 

దిల్లీ: జెనరిక్‌ యాంటిబయోటిక్‌ ఔషధం సెఫ్‌డినిర్‌ (ఓరల్‌ సస్పెన్షన్‌ 250 ఎంజీ/5 ఎంల్‌)కు సంబంధించి 51,006 సీసాలను అమెరికాలోని లుపిన్‌కు చెందిన సంస్థ వెనక్కి (రీకాల్‌) రప్పిస్తోంది. సీసా మూతలో లోపం ఇందుకు కారణమని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ తన తాజా దర్యాప్తు నివేదికలో వెల్లడించింది. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల చికిత్సలో సెఫ్రిన్‌ ఓరల్‌ సస్పెన్షన్‌ను వాడతారు. వెనక్కి రప్పిస్తున్న ఈ ఔషధ సీసాలను మండిదీప్‌లోని లుపిన్‌ ప్లాంటులో తయారయ్యాయి. బాల్టిమోర్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లుపిన్‌ ఫార్మాస్యూటికల్స్‌ అమెరికాలో వీటిని విక్రయిస్తోంది. ఈ స్వచ్ఛంద రీకాల్‌ను మే 8న లుపిన్‌ ప్రారంభించిందని యూఎస్‌ఎఫ్‌డీఏ తెలిపింది.


ఇన్‌స్టంట్‌ ఫ్లోర్‌ మిక్స్‌లపై 18% జీఎస్‌టీ 

దిల్లీ: ఇడ్లీ, దోశ పిండితో పాటు ఇన్‌స్టంట్‌ ఫ్లోర్‌ మిక్స్‌లను సాధారణ పిండిగా వర్గీకరించలేమని, వాటిని 18% జీఎస్‌టీ విధించాలని గుజరాత్‌ అప్పీలేట్‌ అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌(జీఏఏఏఆర్‌) స్పష్టం చేసింది. జీఎస్‌టీ అడ్వాన్స్‌ అథారిటీ ఇచ్చిన తీర్పుపై ఏఏఏఆర్‌ను గుజరాత్‌కు చెందిన కిచెన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓవర్‌సీస్‌ లిమిటెడ్‌ ఆశ్రయించింది. తమ 7 ఇన్‌స్టంట్‌ ఫ్లోర్‌ మిక్స్‌లను రెడీ టూ ఈట్‌గా పరిగణించలేమని, వాటికి కొన్ని వంట పద్ధతులను పాటించాల్సి ఉంటుందని వాదించింది. అందువల్ల వీటిని సాధారణ పిండిగానే భావించి, 5% జీఎస్‌టీ విధించాలని కోరింది. అయితే ఇన్‌స్టంట్‌ ఫ్లోర్‌ మిక్స్‌లను సాధారణ పిండిగా వర్గీకరించలేమని, అప్పీలుదారు పిటిషన్‌ను జీఏఏఏఆర్‌ తోసిపుచ్చింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని