సంక్షిప్త వార్తలు(9)

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను 0.20 శాతం వరకు పెంచింది. కొత్తరేట్లు ఈనెల 10 నుంచే అమల్లోకి వచ్చాయి.

Updated : 11 Jun 2024 01:48 IST

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డిపాజిట్‌ రేట్ల పెంపు

దిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను 0.20 శాతం వరకు పెంచింది. కొత్తరేట్లు ఈనెల 10 నుంచే అమల్లోకి వచ్చాయి. సాధారణ పౌరులకు పెంచిన వడ్డీ రేట్లు 3-7.25% మధ్య ఉండగా, సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 0.5% వడ్డీ అందివ్వనుంది. 7-29 రోజుల ఎఫ్‌డీపై 3%, 30-45 రోజుల ఎఫ్‌డీపై  3.5%, 46 రోజుల నుంచి 6 నెలల్లోపు ఎఫ్‌డీపై 4.5%, 6 నెలల నుంచి 9 నెలల్లోపు 5.75%, 9 నెలల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీపై 6%, ఏడాది నుంచి 15 నెలల్లోపు ఎఫ్‌డీపై   6.6%, 15 నెలల నుంచి 18 నెలల్లోపు ఎఫ్‌డీపై 7.10%, 18-21 నెలల ఎఫ్‌డీపై 7.25% చొప్పున వడ్డీ రేటు ఇవ్వనుంది. 21 నెలల నుంచి రెండేళ్లలోపు ఎఫ్‌డీపై 7% వడ్డీ రేటు చెల్లిస్తారు. రెండేళ్ల 1 రోజు నుంచి మూడేళ్లలోపు ఎఫ్‌డీపై 7.15%, మూడేళ్ల నుంచి అయిదేళ్లలోపు ఎఫ్‌డీపై 7.20%, అయిదేళ్ల నుంచి 10 ఏళ్లలోపు డిపాజిట్‌పై 7% చొప్పున వడ్డీ రేటును బ్యాంక్‌ చెల్లిస్తుంది. 


కాగ్నిజెంట్‌ చేతికి బెల్‌కాన్‌

దిల్లీ: అమెరికా కేంద్రంగా 60 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సాఫ్ట్‌వేర్, డిజిటల్‌ ఇంజినీరింగ్‌ సేవల సంస్థ బెల్‌కాన్‌ను, ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ 1.3 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.10,800 కోట్ల)కు కొనుగోలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి నగదు, స్టాక్‌ రూపేణ ఈ లావాదేవీ జరగనుంది. ఈ కొనుగోలుతో ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష, ఆటోమోటివ్‌ రంగాల్లో కాగ్నిజెంట్‌ విస్తరించనుంది. బెల్‌కాన్‌కు 60కి పైగా దేశాల్లో 10,000 మంది ఉద్యోగులు ఉన్నారు. బోయింగ్, జనరల్‌ మోటార్స్, రోల్స్‌ రాయిస్, నాసా, అమెరికా నేవీ వంటి సంస్థలకు బెల్‌కాన్‌ సేవలు అందిస్తోంది. ఒప్పందం ప్రకారం.. బెల్‌కాన్‌ ప్రస్తుత సీఈఓ లాన్స్‌ క్వానీవ్‌స్కీని కొనసాగించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


పేటీఎంలో మరిన్ని ఉద్యోగాల కోత

దిల్లీ: పేటీఎం బ్రాండ్‌పై ఆర్థిక సేవలు అందిస్తున్న ఫిన్‌టెక్‌ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ తన ఉద్యోగుల్లో కోతను కొనసాగిస్తోంది. ఎంత మందిని తొలగించనుందో కచ్చితంగా వెల్లడించలేదు. తొలగించిన వారు వేరే సంస్థల్లో మళ్లీ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన మద్దతు అందిస్తున్నట్లు మాత్రం వెల్లడించింది. 2024 మార్చి ఆఖరుకు పేటీఎంలో 36,521 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2023 డిసెంబరు ఆఖరుతో పోలిస్తే, ఈ సంఖ్య సుమారు 3,500 తక్కువ. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆంక్షల నేపథ్యంలో, సంస్థకు ఆదాయం తగ్గడంతో, నిర్వహణ వ్యయాలు తగ్గించేందుకంటూ ఉద్యోగ కోతలను సంస్థ ప్రారంభించింది. తాజాగా మరింత మందికి ఉద్వాసన పలికేందుకు సమాయత్తమైంది. ‘కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఉద్యోగ కోతలు చేపట్టాల్సి వచ్చింది. ఉద్యోగం కోల్పోతున్న వారు, వేరే సంస్థలో ఉద్యోగం సాధించేలా తోడ్పడుతున్నాం. ఇందుకోసం మా మానవ వనరుల బృందం 30 కంపెనీలతో కలిసి పని చేస్తోంద’ని పేటీఎం సోమవారం వెల్లడించింది. సోమవారం బీఎస్‌ఈలో వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు 2.20% పెరిగి, రూ.389.60 వద్ద స్థిరపడింది.


డీప్‌ ఫేక్‌ వీడియోలను నమ్మొద్దు: ఎన్‌ఎస్‌ఈ 

దిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ఎండీ, సీఈఓ ఆశీష్‌ కుమార్‌ చౌహాన్‌ పెట్టుబడి సలహాలు ఇస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నకిలీ (డీప్‌ ఫేక్‌) వీడియోలను నమ్మి మోసపోవద్దని, మదుపర్లను ఎన్‌ఎస్‌ఈ సోమవారం హెచ్చరించింది. ఎన్‌ఎస్‌ఈ చిహ్నం, చౌహాన్‌ ముఖం, గొంతుతో కొందరు డీప్‌ ఫేక్‌ వీడియోలు రూపొందించి, ఆయన పెట్టుబడి సలహాలు, స్టాక్‌ల సిఫారసులు చేస్తున్నట్లు మభ్యపెడుతున్నారని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. ఎన్‌ఎస్‌ఈఇండియా.కామ్, ఎక్స్ఛేంజ్‌ సామాజిక మాధ్యమ హ్యాండిల్స్‌ అయిన ఎట్‌ఎన్‌ఎస్‌ఈ ఇండియా (ఎక్స్‌), ఎట్‌ఎన్‌ఎస్‌ఈఇండియా (ఫేస్‌బుక్‌), ఎట్‌ఎన్‌ఎస్‌ఈఇండియా (ఇన్‌స్టాగ్రామ్‌), ఎట్‌ఎన్‌ఎస్‌ఈఇండియా (లింక్డిన్‌), ఎట్‌ఎన్‌ఎస్‌ఈఇండియా (యూట్యూబ్‌)ల్లో మాత్రమే అధికారిక సమాచారం ఉంటుందని ఎన్‌ఎస్‌ఈ మదుపర్లకు సూచించింది.


కాకినాడలో కోరమాండల్‌ నానో ఎరువుల ప్లాంట్‌ ఉత్పత్తి ప్రారంభం 

ఈనాడు, హైదరాబాద్‌: కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్, కాకినాడలోని నానో ఎరువుల ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (న్యూట్రినెంట్‌ బిజినెస్‌) శంకర సుబ్రమణియన్‌ ఈ ప్లాంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. నానో ఎరువులతో వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని సంస్థ పేర్కొంది. ఈ ప్లాంటులో ఏటా ఒక కోటి సీసాల నానో ఎరువు ఉత్పత్తి చేయొచ్చు. నానో డయా అమ్మోనియమ్‌ ఫాస్పేట్‌ (డీఏపీ), నానో యూరియాతో పాలు పలు  రకాల నానో ఎరువులు ఉత్పత్తి చేసే అవకాశం ఇక్కడ ఉంది. ఈ ప్లాంటులో ఇంధన పొదుపునకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు కోరమాండల్‌ పేర్కొంది. నానో ఎరువులను ఐఐటీ- బాంబే సహకారంతో కోరమాండల్‌ అభివృద్ధి చేసింది. 


ఇండిగోలో రాహుల్‌ భాటియా 2% వాటా విక్రయం!

 లావాదేవీ విలువ రూ.3,270 కోట్లు

దిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌లో 2 శాతం వాటాను, ఆ సంస్థ ప్రమోటర్‌ రాహుల్‌ భాటియాకు చెందిన ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 394 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3,270 కోట్ల)కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత  రాహుల్‌ భాటియా కొంత వాటా విక్రయించి, ప్రతిఫలాన్ని అందుకుంటున్నారు. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌లో ప్రస్తుతం ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు 37.75% వాటా ఉంది. గత 6 నెలల్లో ఇండిగో షేరు 55.66% పెరిగింది. సోమవారం షేరు ముగింపు ధర రూ.4,562.55తో పోలిస్తే 6.5% రాయితీపై, రూ.4,266 కనీస ధరకు 2% వాటాకు సమానమైన షేర్లను బ్లాక్‌ డీల్‌ ద్వారా రాహుల్‌ విక్రయించనున్నారు. ఈ ఒప్పందంలో సిటీ ఐ-బ్యాంకర్‌గా వ్యవహరించనుంది.

 ఏఐ, హోటల్స్‌ వ్యాపారాల కోసం నిధులు

రాహుల్‌ భాటియా ఇటీవల హోటల్స్, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపారాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వీటికి నిధులు సమకూర్చేందుకు ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌లో వాటా విక్రయించబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత ఏప్రిల్‌లో టెక్‌ మహీంద్రా మాజీ ఎండీ సీపీ గుర్నానీతో కలిసి అయాన్‌ఓఎస్‌ అనే ఏఐ కంపెనీని భాటియా ప్రారంభించారు.  


జులైలో 7 కంపెనీలకు చెందిన 22 ఆస్తుల్ని వేలం వేస్తున్న సెబీ 

దిల్లీ: మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ, 7 కంపెనీలకు చెందిన 22 ఆస్తులను వచ్చే నెలలో వేలం వేయబోతున్నట్లు సోమవారం వెల్లడించింది. పైలాన్‌ గ్రూప్‌ (10), విబ్జియార్‌ గ్రూప్‌ (4), జీబీసీ ఇండస్ట్రియల్‌ కార్ప్‌ గ్రూప్‌ (3), టవర్‌ ఇన్ఫోటెక్‌ గ్రూప్‌(2), వారిస్‌ గ్రూప్‌(1), టీచర్స్‌ వెల్ఫేర్‌ క్రెడిట్‌ అండ్‌ హోల్డింగ్‌ గ్రూప్‌(1), అనెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండియా లిమిటెడ్‌(1)లకు చెందిన వివిధ ఆస్తులను జులై 8న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ఆన్‌లైన్‌లో వేలం వేయబోతున్నట్లు సెబీ తెలిపింది. మదుపర్ల నుంచి అక్రమంగా సేకరించిన నగదును రికవరీ చేసేందుకే ఈ వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించింది.


నాగార్జునా ఫెర్టిలైజర్స్‌లో తగ్గిన క్రిబ్‌కో వాటా  

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జున ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌సీఎల్‌) లో క్రిబ్‌కో (క్రిషక్‌ భారతి కోఆపరేటివ్‌ లిమిటెడ్‌) వాటా తగ్గింది. కొంతకాలంగా ఈ సంస్థ ఎన్‌ఎఫ్‌సీఎల్‌ షేర్లను స్టాక్‌మార్కెట్లో విక్రయిస్తూ వస్తోంది. దీంతో క్రమేపీ వాటా తగ్గిపోతోంది. ఇదేకోవలో ఈ నెల 7న మరో 10 లక్షల షేర్లు విక్రయించింది. ఇంకా క్రిబ్‌కో వద్ద 86,62,726 షేర్లు ఉన్నాయి. ఈ షేర్లు ఎన్‌ఎఫ్‌సీఎల్‌ మూలధనంలో 1.44% వాటాకు సమానం. నెమ్మదిగా ఈ షేర్లను సైతం విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే త్వరలోనే ఎన్‌ఎఫ్‌సీఎల్‌ వాటాదార్ల నుంచి క్రిబ్‌కో తప్పుకున్నట్లు అవుతుంది. 


సంక్షిప్తంగా

  • జేపీ అసోసియేట్స్‌కు చెందిన సస్పెండ్‌ అయిన బోర్డు, ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది. గతవారం ఐసీఐసీఐ బ్యాంక్‌ దివాలా పిటిషన్‌ను స్వీకరించిన ఎన్‌సీఎల్‌టీ అలహాబాద్‌ బెంచ్‌.. దివాలా పరిష్కార చర్యలను ఆదేశించింది. వీటిపై సవాల్‌ చేస్తూ కంపెనీ బోర్డు ఎన్‌సీఎల్‌ఏటీలో పిటిషన్‌ వేసింది. 
  • ఈ ఏడాది మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి)లో జపాన్‌ ఆర్థిక వ్యవస్థ 1.8% క్షీణించింది. మొదటి త్రైమాసికంలో -2% క్షీణత నమోదవుతుందని భావించగా, కొంత మెరుగ్గానే జీడీపీ వృద్ధి ఉంది.
  • ముంబయిలో హౌసింగ్‌ సొసైటీ పునరాభివృద్ధి ప్రాజెక్టును రేమండ్‌ గ్రూప్‌ స్థిరాస్తి విభాగమైన రేమండ్‌ రియాల్టీ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టుతో రూ.2000 ఓట్లకు పైగా ఆదాయం లభిస్తుందని కంపెనీ భావిస్తోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని