భారత్‌లో 5-6 ఏళ్లలో 4000 విక్రయశాలలు: డోమినోస్‌

అమెరికా దిగ్గజ పిజ్జా రెస్టారెంట్‌ చైన్‌ డోమినోస్‌ వచ్చే 5-6 ఏళ్లలో భారత్‌లో తన స్టోర్ల (విక్రయశాలలు) సంఖ్యను రెట్టింపు చేసి 4,000కు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ ఇంటర్నేషనల్‌ ఈవీపీ (ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌) ఆర్ట్‌ డి ఎలియా వెల్లడించారు.

Published : 11 Jun 2024 01:49 IST

 అమెరికా తరవాత ఇక్కడే అధికం

దిల్లీ: అమెరికా దిగ్గజ పిజ్జా రెస్టారెంట్‌ చైన్‌ డోమినోస్‌ వచ్చే 5-6 ఏళ్లలో భారత్‌లో తన స్టోర్ల (విక్రయశాలలు) సంఖ్యను రెట్టింపు చేసి 4,000కు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ ఇంటర్నేషనల్‌ ఈవీపీ (ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌) ఆర్ట్‌ డి ఎలియా వెల్లడించారు. ఈ సంస్థ మన దేశంలో 1996లో కార్యకలాపాలను ప్రారంభించగా, ఇటీవలే 2,000వ స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అమెరికా తర్వాత ఈ స్థాయిలో డోమినోస్‌ స్టోర్లు తెరిచిన దేశం భారతేనని డి ఎలియా పేర్కొన్నారు. స్టోర్ల సంఖ్యాపరంగా అమెరికా తర్వాత స్థానంలో ఉన్న భారత్, తమ సంస్థ ఆదాయం పరంగానూ అంతర్జాతీయంగా అగ్రగామి 5 దేశాల్లో ఉందని తెలిపారు. మధ్య ఆదాయ వర్గాల సంఖ్యతో పాటు ఆర్థిక వ్యవస్థలో వృద్ధి, డోమినోస్‌కు భారత్‌లో గొప్ప అవకాశాలకు తావిస్తోందని ఆయన వివరించారు. మన దేశంలో డోమినోస్‌ స్టోర్లను జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ లిమిటెడ్‌ (జేఎఫ్‌ఎల్‌) నిర్వహిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో సుమారు 180-200 స్టోర్లను తెరిచేందుకు, పిజ్జా వ్యాపారాన్ని విస్తరించేందుకు రూ.250 కోట్ల మూలధనం వెచ్చించబోతున్నట్లు సంస్థ సీఈఓ, ఎండీ సమీర్‌ ఖేతార్‌పాల్‌ వెల్లడించారు. 421 నగరాల్లో డోమినోస్‌ స్టోర్ల ద్వారా ఏడాదికి 20 కోట్లకు పైగా పిజ్జాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. మన దేశంతో పాటు టర్కీ, బంగ్లాదేశ్, శ్రీలంక, అజెర్‌బైజాన్, జార్జియా దేశాల్లోనూ స్టోర్లను నిర్వహించేందుకు జేఎఫ్‌ఎల్‌కు లైసెన్స్‌ ఉంది. 2024 మార్చి 31 నాటికి అంతర్జాతీయంగా 2,793 స్టోర్లను జేఎఫ్‌ఎల్‌ నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని