తక్కువ ధరకు చమురు సమీకరించే యత్నం

తక్కువ ధరకు చమురు సరఫరా చేసేలా రష్యాతో పాటు మరికొన్ని దేశాలతో దీర్ఘకాల ఒప్పందాలు చేసుకోవడంపై భారత్‌ దృష్టి సారిస్తోందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి మంగళవారం వెల్లడించారు.

Published : 12 Jun 2024 02:50 IST

 కేంద్ర చమురు మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి 

దిల్లీ: తక్కువ ధరకు చమురు సరఫరా చేసేలా రష్యాతో పాటు మరికొన్ని దేశాలతో దీర్ఘకాల ఒప్పందాలు చేసుకోవడంపై భారత్‌ దృష్టి సారిస్తోందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి మంగళవారం వెల్లడించారు. తద్వారా దేశీయ వినియోగదార్లకు అందుబాటు ధరలో పెట్రోల్, డీజిల్‌ అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ యోచిస్తున్నారని మంత్రి తెలిపారు. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) కొత్త చమురు శుద్ధి కర్మాగారాన్ని (రిఫైనరీ) నిర్మించబోతోందని మంత్రి ప్రకటించారు. అయితే ఎక్కడ, ఎంత సామర్థ్యంతో నిర్మించనుందీ వెల్లడించలేదు. 

  •  ప్రపంచంలోనే మూడో అత్యధిక చమురు దిగుమతి, వినియోగ దేశంగా భారత్‌ ఉంది. ప్రస్తుతం రష్యా నుంచి అధికంగా చమురు కొనుగోలు చేస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాక, పశ్చిమ దేశాలు మాస్కో నుంచి చమురు కొనుగోలును నిలిపివేశాయి. అప్పటినుంచి మన దేశం రాయితీ ధరకే రష్యా నుంచి చమురును భారీగా కొనుగోలు చేస్తుండటం గమనార్హం.
  • ప్రైవేటు, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తమకు అధిక ప్రయోజనం కల్పించే దేశాలతో, చమురు కోసం దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంటాయనే నమ్మకం తనందని పూరి తెలిపారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ ఇప్పటికే రష్యాతో వార్షిక దిగుమతి ఒప్పందాన్ని చేసుకున్నాయి. ప్రభుత్వ రంగ  ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఇంకా తన ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ కూడా రష్యాతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకునేందుకు చూస్తున్నాయి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని